విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1933లో హైదరాబాద్ వచ్చారు. తాను 1901లో స్థాపించిన శాంతినికేతన్ (విశ్వభారతి) ఒడిదుడుకులలో ఉన్నది. నిర్వహణకు అవసరమైన నిధులు ఇప్పిస్తానని నిజాం కార్యనిర్వాహక మండలి సభ్యుడు నవాజ్ మెహదీ నవాబ్ జంగ్ హామీ ఇస్తూ ఆహ్వానించినందుకు హైదరాబాద్ వచ్చారు. నిజాం రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆ సందర్భంగా ఇప్పటి బంజారాహిల్స్ ప్రాంతంలో జంగ్ అతిథి గృహంలో రవీంద్రుడు కొద్ది రోజులున్నారు. ఆ పరిసరాలకు ముగ్ధుడైన రవీంద్రుడు; ముందే వచ్చి ఉంటే ఇక్కడే శాంతినికేతన్ స్థాపించేవాడిని అని జంగ్‌తో అన్నారు. రవీంద్రుడు శాంతినికేతన్‌ను హైదరాబాద్‌లో స్థాపించలేకపోయారు కానీ, శాంతినికేతన్‌ను కొండపల్లి శేషగిరిరావు హైదరాబాద్‌కు తెచ్చారు తన చిత్రాల రూపంలో! కొండపల్లి హృదయమూ, వారు భావితరాల కోసం పదిలపరిచిన చిత్రాలు శాంతి నికేతనాలే!
‘సరస రేఖా చిత్ర
సాహిత్యమును గూర్చిన
నీదు కుంచియకు
అభివాదమయ్యా,
అప్సరసల భువిని
అవతరింపగజేయు మాంత్రికా నీకు నమస్సులయ్యా..’
దాశరథి కృష్ణమాచార్య పద్య పాదాలతో కొండపల్లికి సుమాంజలి…
Kondapally Sheshagiri Rao | పాత వరంగల్ జిల్లా, మానుకోట (మహబూబాద్) దగ్గరలోని పెనుగొండలో 1924, జనవరి 27న కొండపల్లి జన్మించారు. బొమ్మలు వేయ డం పుట్టుకతో వచ్చిన అభిరుచి. రామప్ప శిల్పాలు, పాకాల పరిసరాలు స్కెచెస్గా వేసేవారు. పెన్సిల్-పేపర్‌తో హైదరాబాద్ వచ్చారు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో పెయింటింగ్స్ నేర్చారు. రవీంద్రుడి మిత్రుడు మెహదీ నవాజ్‌జంగ్ కొండపల్లి చిత్రాలకు ముగ్ధుడై శాంతినికేతన్లో చేరేందుకు తోడ్పడ్డారు. ప్రపంచ నగరాల్లో నవ వధువుగా ప్రఖ్యాతిచెందిన హైదరాబాద్ కొండపల్లి శాంతినికేతన్ వెళ్లేప్పుడు ప్రశాంతంగా ఉన్నది. రైల్లో తిరిగి వచ్చే సందర్భంలో శ్రీవైష్ణవుడైన కొండపల్లికి రజాకార్ల దుష్కృత్యాలు 1948లో అనుభవంలోకి వచ్చా యి. ఒక సహ ప్రయాణికుడు ‘ఎవరనుకున్నావు? నవాజ్‌జంగ్ స్నేహితుడు’ అనడంతో ఆపద తప్పింది.
స్వతహాగా గాంధేయవాది అయిన కొండపల్లిపై రావి నారాయణరెడ్డి, వట్టికోట, దాశరథి, కాళోజీ తదితరుల ప్రభావం పడింది. కొండపల్లి జల-తైల వర్ణాల్లో సామ్యవాద ఛాయలూ కనిపిస్తాయి. తాను చదివిన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలోనే అధ్యాపకులుగా పనిచేశారు. ఎందరో చిత్రకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన కొండపల్లి తన చిత్రాల ద్వారా గాడ్స్ పెయింటర్ అనే ప్రశస్తి పొందారు. ఆంధ్ర దేశంలో చిత్రకళ-తెలంగాణలో చిత్రకళ, కళ-కల్పనా వైచిత్రి వంటి రచనలు చేశారు. జానపద చిత్రకళను పరిచయం చేస్తూ పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. తెలుపు-నలుపు చిత్రాలు, మ్యూరల్స్ ఎన్నింటినో చిత్రించారు. అసంఖ్యాక అవార్డులు పొందారు. ఎమరిటస్ మేడం ఫుకు అకినో, బిశ్వనాథ్ ముఖర్జీ, ఎ.ఎస్.రామన్, పీటర్ స్వీజ్, ఎన్.ఎస్.బింద్రే, అనితారాయ్ చౌదరి, వై.వి.శుక్ల, ఎ.పెరుమాళ్ వంటి ఎందరో ప్రముఖులు వీరిని అభిమానించేవారు. హైస్కూల్ విద్యార్థి దశలో నేను కొన్న తొలి పత్రిక ఆంధ్రపత్రిక వీక్లీ. లైబ్రరీలో (1969-70) ఆ పత్రికను చూశాను. ముఖచిత్రం పోతన. ఆ సుకవి అక్షరాలు చిత్రరూపం ధరిస్తే అవి కొండపల్లి శేషగిరిరావు బొమ్మలే! కొండపల్లితో తొలి పరిచయం 1994లో. అదీ చిత్రంగా జరిగింది. ఉదయం పొలిటికల్ బ్యూరో రిపోర్టర్‌గా 1992లో హైదరాబాద్ వచ్చాను. రాంనగర్ వాసినయ్యాను. మనింటి దగ్గరలోనే ఉంటారని మిత్రులు లక్ష్మణరావు జి.కృష్ణకు నన్ను పరిచయం చేస్తున్నారు. మాటల్లో మాటగా గుఱ్ఱం మల్లయ్య (1904-1984)కు బంధువు అని అన్నారు.
అది రాశాడు, ఇది రాశాడు అని సోది చెబుతావేం? ఫలానా వారితో బంధుత్వం ఉన్నవాడు అనే ముక్క చెప్పకుండా! అన్నారు జి.కృష్ణ. వారిపై నేనొక వ్యాసం రాస్తాను, రేపు ఉదయం మీ ఇంటికి వస్తానన్నారు జి.కృష్ణ. మరుసటి ఉదయం నిద్ర లేవకముందే తలుపు తట్టారు. చేతిలో నోట్‌బుక్, పెన్ను! గుఱ్ఱం మల్లయ్య వాటర్ కలర్ పెయింటింగ్స్ వరదకు తడిచి శిథిలావస్థలో ఉన్నాయని చెప్పినపుడు కలవరం చెందారు. ప్రదర్శిద్దాం, నా వంతు చేయి వేస్తానన్నారు, సిగ్గనిపించింది. రెండేండ్ల తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ లోన్ తీసుకొని పెయింటింగ్స్ ఫ్రేమ్ చేయించి కృష్ణకు చూపించాను. ఎవరిని పిలుద్దామని అడిగాను. ఇంకెవరు కొండపల్లి శేషగిరిరావునే అన్నారు. ఆ సందర్భంగా కొండపల్లి నివాసంలో శాంతినికేతన్ చూశాను.
“స్వతహాగా గాంధేయవాది అయిన కొండపల్లిపై రావి నారాయణరెడ్డి, వట్టికోట, దాశరథి, కాళోజీ తదితరుల ప్రభావం పడింది. కొండపల్లి జల-తైల వర్ణాల్లో సామ్యవాద ఛాయలూ కనిపిస్తాయి. తాను చదివిన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలోనే అధ్యాపకులుగా పనిచేశారు. ఎందరో చిత్రకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన కొండపల్లి తన చిత్రాల ద్వారా గాడ్స్ పెయింటర్ అనే ప్రశస్తి పొందారు.”
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 1994 ఆగస్టు 9న గుఱ్ఱం మల్లయ్య పెయింటింగ్స్ మూడు రోజుల ఎగ్జిబిషన్ ప్రారంభించారు కొండపల్లి. ఆ సమావేశంలో జి.కృష్ణ, రాంభట్ల కృష్ణమూర్తి, దరువూరి వీరయ్యలు కూడా ప్రసంగించారు. శాంతినికేతన్లో తనకు సీనియర్ అయిన గుఱ్ఱం మల్లయ్య, వారికి సీనియర్ అయిన మైసూర్ సంస్థానం చిత్రకారుడు వెంకటప్పయ్యల శైలి గురించి చెప్పారు. వారికి, తనకు విద్యార్థులుగా రెండు దశాబ్దాల తేడా ఉన్నదని, మా అందరికీ అవనీంద్ర నాథ్ టాగోర్-నందలాల్ బోస్‌లు అధ్యాపకులు కావడం సారూప్యత అని తెలిపారు. తొలితరం ఆధునిక తెలుగు చిత్రకారులకు స్వాతంత్య్రానికి పూర్వం లభించిన గౌరవం ఆ తర్వాత కనుమరుగైందన్నారు. చలసాని ప్రసాదరావు, ఏలె లక్ష్మణ్, శ్రీధర్, వంటి చిత్రకారులు, శివాజీ, కిషోర్ తదితర జర్నలిస్టులు, జేఎన్టీయూ విద్యార్థులు పాల్గొన్న ఆ సభలో కొండపల్లి తన ముందుతరాల విశిష్ఠతను పరిచయం చేశారు. రుషులకు సెల్ఫ్ అప్రైజల్ ఉండదు కదా. ఇది కొండపల్లి శేషగిరిరావు శత జయంతి సందర్భం. చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు పెయింటింగ్స్ ప్రదర్శిస్తున్నారు. వారు మన కోసం పదిలపరచిన వ్యాసుడు-గణపతి, రాఘవుడు-గుహుడు, వరూధిని-ప్రవరాఖ్య, మురారి, శకుంతల, గోదాదేవి, అభినవ గుప్తుడు, రామప్ప శిల్పాల వంటి అసంఖ్యాక చిత్రాల్లో ఎంపిక చేసిన చిత్రాలు కొలువై ఉన్నాయి. కలువల కొలనులో కలువ కనుల సుందరి, పల్లెల రమణీయత, ప్రకృతి దృశ్యాలు, ముఖ్యంగా తెలంగాణ వైవిధ్య జీవితం ఆహ్లాదపరుస్తాయి.
-పున్నా కృష్ణమూర్తి 76809 50863
(ఇండిపెండెంట్ జర్నలిస్ట్, రచయిత)