కాల గతిలో వెయ్యి రోజులు అంటే సమస్త జీవజాతులకు వెయ్యి ప్రభాత సంధ్యలు. తెలంగాణ జనజాతులకు మాత్రం వెయ్యి నిద్రలేని నిషీధుల ప్రతీక్షలు. వెయ్యి రోజుల నిరీక్షణలో ‘ఎక్స్పెక్టేషన్-రియాలిటీ’ అంతరం అనంతమైన అగాధం బయటపడిన సంక్షుభిత కాలం. నమ్మించిన భవిష్యత్తు ఒకటి, కండ్లముందు కనిపిస్తున్న వర్తమానం మరొకటి. ఆ రెండింటి మధ్య నిత్య ఘర్షణలతో ప్రజలకు భ్రమాభంగమైన కాలం. రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఆర్థిక భరోసా, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, సామాజిక న్యాయం ఇలా.. ఒకో వర్గాన్ని ముగ్గులోకి లాగి ‘నిన్నటికంటే రాబోయే రేపటిరోజు మహా అద్భుతమని’ అరచేతిలో స్వర్గాన్ని చూపిందీ, మెదళ్ల మీద రంగుల కల వల విసిరిందీ మహామోసమని తేలిన కాలం. దగా పడ్డామని తెలిసేలోగా కాళ్లకింద నేల కదిలిపోయిన కాలం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పాలకుని బుద్ధి బయటపడ్డది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా లంకెబిందెల ప్రస్తావన తెచ్చిండు. ముఖ్యమంత్రి నిట్టూర్పులోనే పాలనా తత్వానికి సంబంధించిన ఒక ప్రమాదకరమైన సంకేతం బయటపడ్డది. లంకెబిందెలంటేనే ఏ కష్టం లేకుండా తేరగా తవ్వుకుపోవడం. అందినకాడికి దండుకోవడం. ‘లంకెబిందెల’ మనస్తత్వమే రైతు సంక్షేమానికి కత్తెర వేసింది. కాంగ్రెస్ నేతలు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. కానీ రేషన్ కార్డులు, కుటుంబ నిర్ధారణల పేరిట రకరకాల కొర్రీలు పెట్టి వేలాది మంది అర్హులైన రైతులను పథకానికి దూరం పెట్టిండ్రు. ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న రైతు భరోసాకు ఆంక్షల గిరిగీసి, ఆఖరికి రూ.12 వేలకు కుదించిండ్రు. దాన్ని కూడా వాయిదాలు పెట్టి సాగును సావు మీదికు తెచ్చిండ్రు.
ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి హామీ దిక్కూమొక్కు లేదు. అదనంగా తులం బంగారం సంగతి దేవుడెరుగు, అసలు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకానికే ఎసరు పెట్టిండ్రు. యువతను ఆకట్టుకోవడానికి ‘జాబ్ క్యాలెండర్’ ఆశలు రేపింది. ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 నాటికి నియామక పత్రాలు అని ఊరించింది. అధికారంలోకి వచ్చి ఏం చేసింది? జాబ్ క్యాలెండర్‌కు ఉరేసి గోడకు నిర్జీవంగా వేలాడదీసింది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షలు పూర్తయి, తుది దశకు చేరిన పోస్టులకు నియామక పత్రాలు అందిస్తూ ఫొటోలు దిగింది. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ గొప్పలుగా ప్రచారం చేసుకున్నది. మళ్లీ ఇప్పటి వరకు గ్రూప్-2, గ్రూప్-3 లాంటి కొలువుల నోటిఫికేషన్ల ఊసే లేదు. నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి హామీని బడ్జెట్ ప్రసంగాల నుంచి కూడా తుడిచేశారు. అశోక్‌నగర్ గ్రంథాలయాల నీడల్లో పుస్తకాలతో కుస్తీ పడుతూ, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం యువత వేచి చూస్తుంటే నోటిఫికేషన్ రాలేదు. కానీ లాఠీలతో పోలీసులు వచ్చిండ్రు. అర్ధరాత్రి వేళల్లో లాఠీచార్జ్‌లు చేయించడం, నిర్బంధాల ఉక్కుపాదం మోపడమే పాలననా?
కులగణన, సామాజిక న్యాయం వంటి పదాలను తెరపైకి తెచ్చి, ఆర్డినెన్సుల పేరిట నాటకాలతో నడిపించిన కాలమే తప్ప, అధికారంలో బీసీ, బహుజనుల వాటా స్వచ్ఛందంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా లేదు. రాష్ట్రంలో జరిగింది కేవలం రాజకీయ ‘ప్రదర్శన’ మాత్రమే. సుప్రీంకోర్టు పరిమితులు ఏమి చెప్తున్నాయో పాలకులకు తెలుసు, అసెంబ్లీ తీర్మానాలకు, ఆర్డినెన్స్‌లకు ఎంతవరకు న్యాయబద్ధమైన చెల్లుబాటు ఉంటుందో తెలుసు. రాజ్యాంగబద్ధమైన అవరోధాలేంటో తెలిసినా ప్రజల కండ్లకు గంతలు కట్టారు, ఫైల్ అటకెక్కించారు.
రేవంత్ సర్కార్ తెచ్చిన హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేద, మధ్యతరగతి వర్గాల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని ముంచెత్తింది. చెరువుల పరిరక్షణ ముసుగులో పేదల నివాసాలపై బుల్డోజర్లు నడిపించి, బడా బాబుల ఫామ్ హౌస్‌లను వదిలేసిన తీరును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్‌ను తప్పించాలనే కఠిన ఆదేశాలు ఇచ్చింది. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల భారీ అంచనాతో తలపెట్టిన మూసీ ప్రాజెక్ట్, ఫోర్త్ సిటీ, దానిలో జరుపుతున్న సమ్మిట్ల విధానపత్రాల్ని నిశితంగా పరిశీలిస్తే.. సామాన్యుడిని విస్మరించి, కార్పొరేట్ భ్రమలను సృష్టించి విఫలమైన చంద్రబాబు ‘విజన్ 2020’ పునారావృతమవుతున్నదని వెయ్యి రోజుల పాలన తేల్చింది.
కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ‘భూమాత’ రెవెన్యూ చట్టం హామీ కూడా వెయ్యి రోజుల తర్వాత తీవ్ర నిరాశనే మిగిల్చింది. కాంగ్రెస్ పాలకులు ధరణి అధ్యయన కమిటీల పేరుతో ప్రజలను ఏమార్చారు. రాత్రికి రాత్రే 22-ఏ అని తెచ్చి 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. సొంత భూమిని అమ్ముకొనే హక్కు రైతుకు, సొంత ఇంటిని విక్రయించే హక్కు, పిల్లలకు ఇచ్చుకొనే హక్కు యజమానికి లేకుండా చేసిండ్రు. బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం కూడా తీసుకోలేని దుస్థితిని తీసుకొచ్చిండ్రు. రాష్టంలోని ప్రతి మూడిండ్లలో ఒక ఇల్లు వివాదమే. 22-ఏ కింద పెట్టిన ప్రతి ఎకరం కూడా ప్రభుత్వ వైఫల్యమే. ఆ తప్పును సరిదిద్దకుండా రైతులు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ దరఖాస్తులతో ప్రదక్షిణలు చేయిస్తే అది పాలన ఎప్పటీ కాదు, దుర్మార్గమే. ఒక ప్రాంత అస్తిత్వంతో ముడిపడిన ప్రతీకల విషయంలో పాలకులు సున్నితంగా వ్యవహరించాలి. కానీ మొదటి నుంచి రేవంత్‌రెడ్డికి ఆ సహానుభూతి లేదు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపకల్పన గానీ, సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన గానీ, ఆంధ్రా ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఉద్యమకారులకు, సమాజానికి తీవ్ర మనస్తాపం కలిగించాయి. పాలకులు సాంస్కృతిక అస్తిత్వాన్ని విస్మరిస్తే ఆ అభిప్రాయమే సమాజంలో శాశ్వతంగా స్థిరపడిపోతుంది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే.
దశాబ్ద కాలంలో పాటు తెలంగాణ మట్టి స్వరూపాన్నే మార్చిన కేసీఆర్‌ను వెయ్యి రోజుల్లో ప్రజలు గుర్తుచేసుకోని రోజంటూ లేదు. 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఎండిన బీడును కూడా సస్యశ్యామలం చేసిన తీరు, కోటి ఎకరాల మాగాణం ఒక భౌతిక వాస్తవం. పల్లెలు, పట్టణాలు ప్రగతిబాటలో పచ్చగా రూపుదిద్దుకున్న రాష్ట్ర ముఖచిత్రం స్వయం సమృద్ధికి ప్రతీకగా నిలిచింది.
రైతుబంధు, రైతుబీమా, చేనేత, బతుకమ్మ గౌరవం వంటి పథకాలు కేవలం రాజకీయ ఉపన్యాసాలు కావు. అవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన స్వావలంబన నమూనాలు. హైదరాబాద్ నగరాన్ని స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, అంతర్జాతీయ ఐటీ పెట్టుబడులతో విశ్వనగరంగా నిలబెట్టిన వ్యూహం వెనుక ఒక పక్కా ప్రణాళిక నడిచింది.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అసలైన అభివృద్ధిని విస్మరించి, అడ్డూ అదుపు లేని మాటలతో కేసీఆర్‌ను తిట్టడమే పాలన అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో గత పాలనను అకారణంగా నిందించడం రాజకీయం కావొచ్చు. కానీ వెయ్యి రోజులు గడిచిన తర్వాత కూడా ప్రతి వైఫల్యానికీ గత ప్రభుత్వాన్నే సాకుగా చూపించడం నేటి పాలకుల చేతకానితనానికి నిదర్శనం. నేటి పాలనా వైఫల్యాలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, అధినేతల మీదనే ఉన్నది. కొలువుల క్యాలెండర్ ఏమైంది? విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు పరిష్కారం ఎప్పుడు? గురుకులాల్లో పేద పిల్లల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? మూసీ, హైడ్రా పేర్లతో పేదల ఇండ్లపై బుల్డోజర్లు నడుపడమే పాలననా? ఈ ప్రశ్నలు నేడు తెలంగాణ సమాజంలో ఆవేదనతో నిండిన గుండెల్లోంచి వెయ్యి పడగలై కాంగ్రెస్ పాలనపైకి లేస్తున్నాయి.