2026 సెప్టెంబర్ 2 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు కానున్న నేపథ్యంలో తెలంగాణ బతుకు చిత్రం పూర్తిగా తలకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం లో వివక్షను ఎదుర్కొని, 60 ఏండ్ల పోరాటం తర్వాత 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను తెచ్చింది కేసీఆర్, నిలబెట్టింది కేసీఆర్, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్ అని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉన్నది. తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీరు, తాగునీరు, కరెంటు, సంక్షేమంతో బంగారు తెలంగాణను చూపించారు. కానీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాయాజాలంతో రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసం వాడుకోవడంతో తెలంగాణ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణ స్థితికి దిగజారిపోయింది.
రూ.200 ఉన్న ఆసరా పెన్షన్‌ను కేసీఆర్ హయాంలో ఏకంగా రూ.2,016 కు పెంచి రాష్ట్రంలోని 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీన అందేలా చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక భార్యాభర్తలిద్దరికీ రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 అని ఊదరగొట్టింది. కానీ నేటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అర్హత ఉన్నా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవ్వాతాతలు కన్నీరు పెడుతున్నారు. ఇది పెన్షన్ల పేరుతో చేసిన పెద్ద మోసం. రాష్ట్రంలో ఏటా 1.2 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష అందించి ఆడపిల్ల పెండ్లికి అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తులం బంగారం అని చెప్పి ఆ పథకాన్నే కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఎవరికీ తులం బంగారం ఇచ్చిన పాపాన పోలేదు. యేటా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను నమ్మించి, ఉద్యోగం అడిగితే అశోక్‌నగర్‌లో పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, నిరుద్యోగ భృతి రూ.4,000 అని చెప్పి ఒక్కరికీ ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చూపుతున్న నిర్దయకు నిదర్శనం. మెగా డీఎస్సీ అని హడావుడి చేసి కేసుల పాలయ్యేలా చేశారు.
రైతును రాజు చేయాలని కేసీఆర్ రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు, రైతుబీమా రూ.5 లక్షలు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేశారు. కానీ రేవంత్‌రెడ్డి వచ్చాక రైతుభరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఎప్పుడిస్తారో, ఎవరికి ఇస్తారో తెలియని అయోమయ స్థితికి తెచ్చారు. యాసంగి డబ్బులు ఇప్పటికీ పడలేదు. పైగా ఓటీపీల పేరిట భూ భారతిలో రోజుల తరబడి రైతులను వేధిస్తున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు లేవు. కరెంటు లేదు. మద్దతు ధర లేదు. సాగు చేయాలంటే రైతు భయపడే పరిస్థితి తెచ్చారు. ఇది రైతుల ఓట్లు దండుకోవడానికి వేసిన ఎత్తుగడ తప్ప, వారిపై ప్రేమ కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అత్యంత ప్రమాదకర 22-ఏ నిషేధిత జాబితా. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూములను ఒక్క కలం పోటుతో నిషేధిత జాబితాలో పెట్టారు. దీంతో రైతు భూమి విలువ ఒక్కరోజులో సున్నా అయిపోయింది. ఇటు అమ్ముకోలేని, అటు తాకట్టు పెట్టుకోలేని దయనీయ పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8,500 కోట్లకు చేరాయి. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బకాయిలు అడిగితే ‘ఈడీ, ఐటీ దాడులు చేయిస్తా, కాలేజీలు మూసేస్తా’ అని సీఎం స్వయంగా బెదిరిస్తున్నారని పలు విద్యాసంస్థల అధినేతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు, బస్తీ దవాఖానలు, న్యూట్రిషన్ కిట్లతో వైద్యం పేదలకు అందుబాటులో ఉంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారాసిట్మాల్ మాత్రలు కూడా లేని పరిస్థితి. ఇది విద్య, వైద్యాన్ని భయభ్రాంతులకు గురిచేసే పాలన నెలకొన్నది.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చి, పెద్దల భవనాలకు మాత్రం క్లీన్చిట్ ఇవ్వడం ప్రజలకు అర్థమైపోయింది. హైదరాబాద్‌లో ఒక్క కొత్త ఫ్లైఓవర్, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. కరెంటు కోతలు, నల్లానీళ్లలో మురికి, రోడ్లపై గుంతలు, ట్రాఫిక్‌లో ప్రపంచంలోనే 2వ అత్యంత దారుణ నగరంగా హైదరాబాద్ మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి, పర్సంటేజీ ఇస్తేనే బిల్లు అనే పరిస్థితి తెచ్చారు. అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పాలనతో ఇప్పుడు తెలంగాణలోని 33 జిల్లాల్లో జరుగుతున్న అన్ని సర్వేల్లో బీఆర్ఎస్కి 90% పైగా ప్రజాదరణ వస్తున్నది. ‘కేసీఆర్ రావాలి, తెలంగాణ బాగుపడాలి’ అనేదే ప్రతి ఇంటి మాట. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన తేల్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే)
-బిగాల గణేష్ గుప్తా