సింగరేణి మరోసారి శ్రమజీవుల సంబురాల గనిగా మారిపోయింది. సంస్థ లాభాలలో 29 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిని గని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దసరా కానుకగా చెప్పుకోవచ్చు! గత ఏడాది కూడా సంస్థ తనకొచ్చిన లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు అందించింది. తెలంగాణ అవతరణ తరువాత సింగరేణి కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చూపుతు న్న శ్రద్ధకు ఇదొక తాజా ఉదాహరణ. కార్మికుల వారసత్వ హక్కును సీమాంధ్ర పాలకులు తొలగిస్తే, కేసీఆర్ దానిని పునరుద్ధరించి కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపారు. వైద్య అనర్హత కేసు ల్లో ఉద్యోగం వద్దనుకునే వారికి ఏకమొత్తంగా రూ.25 లక్షలు లేదా నెలకు రూ.26, 293 చొప్పున చెల్లిస్తున్నారు. కార్మికులు మరణిస్తే ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను లక్ష నుంచి 20 లక్షలకు పెంచారు. తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేని రూ.10 లక్షల రుణం ఇస్తున్నారు. పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పొడిగించారు.
తెలంగాణ తల్లి సిగలో నీలమణి మకుటం వంటి సింగరేణిని ఇక్క డి ప్రజల బతుకులతో విడదీసి చూడలేము. ఈ సంస్థది 130 ఏండ్ల ఘనచరిత్ర. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ బొగ్గు సంస్థ సింగరేణి కాలరీస్. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగరం పారిశ్రామిక విప్లవాన్ని పురికొల్పినట్టుగానే, రామగుండం కేంద్రంగా సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలు దేశ ఆర్థికవ్యవస్థకు ఉత్ప్రేరకంగా మారుతాయని నాడు భావించారు. కానీ తెలంగాణ పరాయి పాలనలో మగ్గిపోవడంతో ఈ ఆశలు ఆవిరయ్యాయి. ఏకంగా సింగరేణినే మూసివేసే పరిస్థితి తలెత్తింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ‘నష్టాల ఊబి లో కూరుకుపోయిన కంపెనీల జాబితా’ (బీఐఎఫ్ఆర్)లోకి సింగరేణి రెండుసార్లు వెళ్లింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో సింగరేణి అనేక సంక్షోభాల నుంచి బయట పడే మార్గం ఏర్పడింది.
దార్శనికుడైన సీఎం కేసీఆర్ దృష్టిలో పారిశ్రామిక అభివృద్ధి, కార్మి క సంక్షేమం అవిభాజ్యమైనవి. అందుకే సింగరేణి ఇతర రాష్ర్టాలలోనే కాదు, విదేశాలలోనూ గనులు నిర్వహించడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తూనే, కార్మిక సంక్షేమంలో కొత్త చరిత్రను లిఖించారు. సింగరేణి సంస్థ లాభాల బాటలో సాగడంలో కార్మికుల పాత్ర కూడా చాలా గొప్పది. ప్రభుత్వం ప్రజలు ఒక్క కుతికెగా పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి సింగరేణి ప్రయోగం ఒక ఉదాహరణ. వ్యవసాయ, పారిశ్రామికాది రంగాలలో కేసీఆర్ ప్రణాళికలేవైనా సకల జనుల సంక్షేమానికి ఉద్దేశించినవే. దళిత బంధు వంటి పథకాలు, ఆహార ప్రసంస్కరణ వంటి పరిశ్రమలు మొదలైనవన్నీ సంక్షేమ- సాధికారతా వ్యూహంలో భాగమే. రైతులైనా, కార్మికులైనా, పల్లె జనులైనా, పట్టణవాసులైనా కేసీఆర్ ప్రణాళికలను అర్థం చేసుకొని ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలి.