దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయి. ప్రధాన సమస్యలైన
తాగు, సాగునీటి ప్రాజెక్టులు వంటి సమస్యలను తక్కువ సమయంలోనే పరిష్కరించారు. తద్వారా కేసీఆర్‌కు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. అందుకే రాష్ర్టాన్ని దేశానికే రోల్‌మాడల్‌గా చూపాలని, అన్ని రాష్ర్టాల్లోనూ తెలంగాణ పథకాలు అమలుచేయాలన్న ఆలోచనతో కేసీఆర్ ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) పేరుతో జాతీయపార్టీని స్థాపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సామాన్య విషయం కాదు. ఇలా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయస్థాయిలో ఎదగడం, తెలంగాణలో తనకంటూ ప్రత్యామ్నాయమే లేని పరిస్థితులను కల్పించడం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు నచ్చడం లేదు. ప్రశాంతంగా అభివృద్ధే లక్ష్యంగా, మానవ ప్రగతే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై గోబెల్స్ ప్రచారంతో సెంటిమెంట్లను రెచ్చగొట్టి టీఆర్ఎస్ను అస్థిరపరచాలని చూస్తున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి సద్విమర్శ చేసుకొని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజామోదాన్ని పెంచుకోవాల్సిన కాంగ్రెస్, బీజేపీలు ఆ ప్రయత్న మే చేయడం లేదు. తొందరపడి కోయిల ముందే కూసినట్టు తనకు రాజకీయ బిక్షపెట్టి, ఉన్నత స్థానానికెదగడానికి సహకరించిన మాతృ సంస్థ కాంగ్రెస్‌ను వదిలిపెట్టి, ఆ పార్టీకి ఆగర్భశత్రువైన బీజేపీతో చేరాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. దాం తో తెలంగాణ ప్రజలపై ఉపఎన్నికల భారం పడింది. వందలు, వేల కోట్ల ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చవుతున్నది. ఈ పాపం ఎవరిదో ప్రజలకు తెలియదా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడు సీటు ఖాళీ అయింది. ఆయనే ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ బలం ఏ మాత్రం లేకున్నా, ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకమూ లేకున్నా, వివాదాలను, సెంటిమెంట్లను, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ ఉప ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నది. ఒకవ్యక్తి పార్టీ మారినంత మాత్రాన అతనికి పాత పార్టీ ఓట్లన్నీ పడవు. ఏ పార్టీలోనైతే చేరారో ఆ పార్టీ వాళ్లు కూడా అంత త్వరగా ఆ వ్యక్తిని నమ్మరు. కేంద్రంలో, కొన్ని రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా దేశానికి గానీ, రాష్ర్టాలకు గానీ బీజేపీ చేసిందేమీ లేదు. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాలను, విపక్ష పార్టీల నాయకులను వేధించడం, వారిపై ద్వేషం పెంచుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ఏ విధంగా చూసినా ఇప్పుడు రాష్ట్రంలో కానీ, భవిష్యత్తులో దేశంలో కానీ భారత్ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బీజేపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రజలకు, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇది ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో దేశమంతా గుర్తించింది. మరి కోమటిరెడ్డి ఏం చెప్పి ఓట్లడుగుతారు? కోట్ల డబ్బు కుమ్మరించా? బీజేపీ తెలంగాణలో ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాదు, కాబోదు. ఈ విషయం బీజేపీ ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అది పేరుకు జాతీయపార్టీ. అయినా తెలుగు రాష్ర్టాల్లో రోజురోజుకూ చిక్కిశల్యమవుతున్నది. అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నది. తాను గెలుచుకున్న ఎమ్మెల్యేలను కూడా చివరిదాకా కాపాడుకోలేక పోతున్నది. దానికి గల కారణాలను అన్వేషించకుండా, చర్యలు తీసుకోకుండా కాలం చెల్లిన విధానాలతో, నినాదాలతో గెలువాలని చూస్తున్నది. పార్టీకి నెహ్రూ, ఇందిరాగాంధీ కాలం నాటి వైభవాన్ని తీసుకురావడంలో విఫలమవుతున్నది. 56 ఏండ్లు తెలుగు రాష్ర్టాలనేలిన కాంగ్రెస్, నల్గొండనేలిన కోమటిరెడ్డి సోదరులు ఫోరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేక పోయారు? తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం కల. మునుగోడులో మళ్లీ అధికారం నిలబెట్టు కోవడం కాంగ్రెస్‌కు కష్టమే. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో టీఆర్ఎస్ కంటే ఏం ఎక్కువ చేశారో కాంగ్రెస్ చెప్పగలదా? అది వృథా ప్రయత్నం. ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ సబ్బండ వర్ణాలకు చేసిన పనులు ముందు బీఎస్పీ అంతగా ప్రభావితం చూపదు. అలాగే షర్మిల పార్టీ అయిన వైఎస్ఆర్ టీపీ ప్రభావం కూడా తెలంగాణలో శూన్యం. కాంగ్రెస్ ఎలా గూ గెలవదు. ఇక మిగిలింది బీజేపీ. కానీ బీజేపీ గెలిస్తే అనైతిక పార్టీ మార్పిడులకు మద్దతు తెలిపినట్టువుతుంది. రాజ్యాం గ విలువలను కాలరాసే పార్టీని, ప్రభుత్వరంగాన్ని, నిర్వీర్యం చేస్తూ, పేదలను పేదలుగా, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చే పార్టీకి ప్రజల మద్దతు లభించినట్టవుతుంది. తెలంగాణ ప్రజలు అందుకు సిద్ధంగా లేరు.
ఉప్పు తిన్న ఇంటిని మరిచిపోయే మనస్తత్వం కాదు తెలంగాణ ప్రజలది. తెలంగాణ పలురంగాల్లో సాధించిన ప్రగతిని ఎన్నటికీ మరిచిపోరు. లక్షలాది ఎకరాల్లోకి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు, కంచాల్లోకి బువ్వ, సబ్బండవర్గాల కు చేతినిండా పనిని కల్పించి ఆదుకుంటున్న టీఆర్ఎస్నే గెలిపిస్తారు. మత సామరస్యాన్ని, లౌకికత్వాన్ని, శాంతిభద్రతలను కాపాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ సుపరిపాలననందిస్తున్న టీఆర్ఎస్ను గెలిపిస్తారు. తద్వారా తెలంగాణ రుణం తీర్చుకుంటారు. ఏవిధంగా పరిశీలించినా మునుగోడులో గెలుపు టీఆర్ఎస్దేనని తెలంగాణ మట్టి మనుషుల బలమైన విశ్వాసం.
మునుగోడులో గెలిచే ఎమ్మెల్యే ఏడాది కూడా పదవిలో ఉంటారో, లేదో తెలియదు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీకి పెద్దగా ఒరిగేదేం ఉండదు. కానీ ఇక్కడ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నట్టు గానే బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి.
డాక్టర్ కాలువ మల్లయ్య: 91829 18567