దేశంలో అధిక జనాభా కలిగిన బీసీలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ఒక బోగస్ బీసీ. సంఘ్ పరివార్ తన రాజకీయ స్వార్థం కోసం, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా వైశ్య కులంలోని ‘తేలి’ అనే సామాజిక వర్గాన్ని, స్వార్థ ప్రయోజనాల కోసం బీసీగా మార్చింది. అలా దేశానికి బీసీని ప్రధానిని చేస్తున్నామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో పబ్బం గడుపుకొన్నది.
కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడానికి మోదీని బీజేపీ ఒక గుమస్తాగా వాడుకుంటున్న మాట నగ్న సత్యం. బీసీలు ఆర్థికంగా పేదలుగా మిగిలిపోవడమే కాకుండా రాజకీయ అవకాశం, గుర్తింపు దక్కని పరిస్థితి దేశంలో నెలకొన్నది. ఎన్నికల్లో బీసీ కార్డు ఎత్తుకున్న జాతీయ పార్టీలు బీసీలకు కేవలం సానుభూతి చూపాయే తప్ప సహానుభూతి చూపలేదు.
కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం అని చెప్పడమే తప్ప అసలు మంత్రుల పేర్లే ప్రజలకు తెలియకుండా అన్ని నిర్ణయాలు మోదీ-షాలే తీసుకుంటూ ఆయా శాఖల మంత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తున్నారు. మండల్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసి, ఆ ఉద్యమాన్ని రథయాత్ర పేరుతో మట్టి కరిపించిన ఘనత బీజేపీది. బీసీ కులగణన చేపట్టాలని ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఆర్టికల్-340 ప్రకారం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ, మోదీ వచ్చాక ఆర్టికల్-14 (4), 16(4)లను సవరించి ఓబీసీలకు ఆర్థికపరమైన రిజర్వేషన్ వర్తించేలా క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొచ్చింది.
తద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రవర్ణాలు 10 శాతం రిజర్వేషన్లు తన్నుకుపోయేలా చేసింది. క్రిమిలేయర్ విధానంలో ఓబీసీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో మోసపోతున్నారనే మాట వాస్తవం. ప్రస్తుతం బీసీ కులగణనపై నోరు మెదపని బీజేపీ సర్కారు, ముఖ్యంగా అందులోని బీసీ నేతలు, బీసీల పేరు మీద ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలి. బీసీల అభ్యున్నతికి అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూ కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూసే బీజేపీకి మునుగోడులో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లు సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల్లో బీసీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ప్రత్యేక స్థానం ఉన్నది. బీసీ కమిషన్నే కాకుండా అనేక సంస్థలకు చైర్మన్ లుగా బీసీలకు అవకాశం ఇచ్చి రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వీటన్నింటికి ఆకర్షితులై అనేకమంది బీసీ నాయకులు కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో వెన్నుదన్నుగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. గౌడ సామాజిక వర్గంలో యాభై ఏండ్లు నిండిన గీతన్నలకు పింఛన్, ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షలున్న ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ వద్ద అతిపెద్ద అధునాతన నీరా కేఫ్ ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నది. అతి త్వరలో గీతన్నలకు మోపెడ్ల పంపిణీ చేయాలని నిర్ణయించడం ముదావహం.
తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్, మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ చేసింది. దీంతో వారికి ఉపాధి లభిస్తున్నది. యాదవ సోదరులకు గొర్ల పంపిణీ పథకంతో పాటు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. నేతన్నలకు చేనేత బీమా పథకం, పింఛన్ అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. కేంద్రం బలవంతంగా చేనేత ఉత్పత్తులపై అధనంగా జీఎస్టీ విధిస్తే కేంద్ర వైఖరిని నిరసిస్తూ చేనేతలకు అండగా నిలబడింది తెలంగాణ ప్రభుత్వం. నాయిబ్రహ్మణులకు మాడ్రన్ సెలూన్ల ఏర్పాటు, అందులో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నది. రజకులకు దోబీఘాట్లతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నది.
ప్రభుత్వాలను కూల్చడం నేర్చుకున్న బీజేపీ, కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణలోనూ ఆ ప్రయత్నం చేసి కేసీఆర్ దెబ్బకు విలవిల్లాడుతున్నది. కేసీఆర్ చర్యతో తెలంగాణ అమ్ముడుపోయే నేల కాదు, ఆత్మగౌరవం కలిగిన నేలగా మరోసారి నిరూపితమైంది. కొంతమంది అవకాశవాదులు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం గుజరాతీలకు గులాం అయ్యారే తప్ప ప్రజలు, ప్రజాబలం, పటిష్టమైన నాయకత్వం ఈ నేల సొంతమని ఎలుగెత్తి చాటింది.
క్రీ.పూ. రెండో శతాబ్దంలో చైనాకు చెందిన తత్వవేత్త హూ ఐనన్ పేర్కొన్నట్లు ‘యుద్ధ క్రీడల్లో మీ పన్నాగాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. ప్రత్యర్థులపై రహస్యంగా దాడి చేయాలి. మీ కదలికలు ఊహించనివిధంగా ఉండాలి.అప్పుడు అవతలివారు మిమ్మల్ని ఎదుర్కోలేరు. అలాంటి ప్రయత్నాలను సిద్ధం చేసుకోవడం వారికి అసాధ్యమవుతుంది’. అన్నది అక్షరాల నిజం.
కేసీఆర్ రాజకీయ చతురతకు చతికిలపడ్డ బీజేపీ కేంద్ర నాయకత్వం నీళ్ల నుంచి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నది. రాజకీయ శూన్యత నెలకొన్నదని దేశం నివ్వెరపోతున్న సందర్భం. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఐటీ, ఈడీ, సీబీఐలతో వెంటాడుతున్న సమయం. అయినా వెనకడుగు వేయకుండా దేశానికి దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన ఘనత కేసీఆర్‌ది.
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కార్యంలో నిమగ్నమైన బీఆర్ఎస్ అంటే కేవలం ‘భారత్ రాష్ట్ర సమితి’యే కాదు, అన్నివర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి పాలనలో సబ్బండవర్గాలను భాగస్వామ్యం చేయబోతున్న బహు‘జన’ రాష్ట్ర సమితి కూడా!
ముఖేష్ సామల 9703973946