
దళిత సాధికారిత కోసం ‘దళితబంధు’ పథకాన్ని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిజానికి దీన్ని ‘పథకం’ అని అనుకోకూడదు. రాజకీయపార్టీలు అధికారంలోకి రావడానికి తాత్కాలిక ప్రయోజనాలపై దృష్టిపెడుతూ ప్రజలు శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించనంతవరకూ ఎన్నో పథకాలు వస్తుంటాయి, పోతుంటాయి. అందుకే చాలా పథకాల ఫలితాలు తాత్కాలికం మాత్రమే. కాని కొన్ని పథకాలు లబ్ధిదారులకు శాశ్వత సాధికారతను చేకూర్చుతాయి. ‘దళిత బంధు’ ఇలాంటిదే. ‘దళితబంధు’ ఒక ఉద్యమంగా అమలు జరుగుతూ దళితుల ఆదాయం పెంచుతూ వారి జీవితాలపైనే కాకుండా పిల్లల జీవితాల్లో కూడా శాశ్వత ముద్రవేయాలి.
రాబోయేకాలంలో రాష్ట్రమంతటా అమలుచేస్తామని చెప్తున్న ఈ ‘దళితబంధు’కు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో అంకురార్పణ జరిగింది. ఈ గ్రామం కొద్దిగా అభివృద్ధి చెందినట్లు కనిపించినా, దళితవాడల్లో పాడుబడ్డ గోడలు.. గతుకుల నేల.. కొన్ని ఇండ్లపై కప్పుగా రంగులు వెలసిన టార్పాలిన్ షీట్లు పేదరికాన్ని చెప్తాయి. ఆ ఆనవాళ్లు దళితుల్లో పేదరికం తాండవిస్తుందనటానికి సాక్ష్యాలు.
జూలూరు గౌరీశంకర్ నాయకత్వంలో.. ప్రొఫెసర్లు, మేధావుల బృందంలో సభ్యుడిగా వాసాలమర్రి గ్రామ దళితవాడలో ప్రతి ఇంటికి వెళ్లి దళితు లు ఈ పథకాన్ని ఏ విధంగా ఉపయోగించు కోవాలనుకుంటున్నారనే విషయం గురించి అధ్యయనం చేశాం. ఆ క్రమంలో దళితుల ఆకాంక్ష, ఆలోచన, అనుభవం, ఆర్థికంగా సా ధ్యాసాధ్యా లు అంచనా వేసే ప్రయత్నం చేశాం. కొందరు ‘డెయిరీ ఫాం’ పెట్టుకుంటామని, మరికొందరు బర్లు కొని పాడి పరిశ్రమ పెడుతామని, ఇంకొందరు గొర్లు పెంచుకుంటామని, యువత ఓ చిన్న వ్యాపారమని, ఆటోలు కొనుక్కుంటామని తెలిపారు.
దేశంలో పలురంగాల్లో సంపదను సృష్టించడంలో దళితులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. దళితులు వారి శక్తియుక్తులను, సామర్థ్యాలను ఉపయోగించుకొని తమ సంపదను పెంచుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయం దళితబంధు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఈ పథకం విజయవంతం కావాలంటే ఉపాధి కల్పిస్తూ, సంపద పెంచుతూ వినూత్న అవకాశాల రూపకల్పన జరగాలి. దళిత లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో గ్రామ, మండల నియోజకవర్గస్థాయిలో శిక్షణ ఇస్తూ నైపుణ్యాన్ని పెంపొందించాలి. ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుంటూ అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా పనిచేయాలి. అధికారంలో ఉన్న పార్టీ ఎదగడానికి ఈ పథకంతో నిగూఢమైన ప్రయోజనం కలుగుతుందని కొందరంటున్నారు. కానీ ఇది అర్థం లేని అపోహ మాత్రమే. ఏదేమైనా దీన్ని తరతరాలుగా ఆర్థిక వివక్షతో పాటు సామాజిక వివక్షకు గురవుతున్న దళితులు గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగాలని కేసీఆర్ చేస్తున్న బృహత్ ప్రయత్నంగా భావించాలి.
‘దళితబంధు’ పూర్తిగా కార్యరూపం దాల్చకముందే విమర్శలతో పాటు, తమకు కూడా ఒక ‘బంధు’ పథకం కావాలనే డిమాండ్ బీసీ, ఇతర సామాజికవర్గాల ప్రజల నుంచి మొదలైంది. నిజానికి ఇతర కులాలవారు దళిత సమాజానికి వెన్నుదన్నుగా నిలబడి అందులో భాగస్వామ్యం పంచుకుంటేనే ఈ పథకం విజయవంతమవుతుంది. అందుకు దళితులు స్థాపించే గ్రామీణ పరిశ్రమలు, వ్యాపారాల్లో ఇతర కులాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. ఈ విధంగా కూడా ఈ పథకం పట్ల వ్యతిరేకతను తగ్గించి సమాజాభివృద్ధికి దోహదం చేయవచ్చు. చిన్నతరహా వ్యవసాయ, ఆహార పరిశ్రమలకు ఈ ‘దళితబంధు’ పథకం నూతన దారులు తెరిచి గ్రామీణ పరిశ్రమల వైపు అడుగులు వేయడానికి దోహదం చేస్తుంది. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాల్లో ఏడు కుటుంబాలకు రెండు నుంచి మూడెకరాల భూమి ఉన్నది. 33 కుటుంబాలకు ఎకరం నుంచి రెండెకరాల భూమి ఉన్నది. వ్యవసాయ, ఆహారరంగాల్లో చిన్న గ్రామీణ పరిశ్రమలు పెట్టాలంటే వ్యవసాయ ఉత్పత్తులు ముడిసరుకుగా అవసరం. చాలామంది రైతులకు భూమి ఉండదు కాబట్టి ముడిసరుకు దొరకదు. దళితులు వ్యవసాయరంగానికి సంబంధించి చిన్న పరిశ్రమ అంటే ఉదాహరణకు ‘ఆలు చిప్స్’ ఫ్యాక్టరీ మొదలు పెట్టాలనుకుంటే గ్రామంలో భూమి ఉన్న ఇతరకులాల వారు పండించిన ఆలుగడ్డలను ముడి పదార్థంగా వాడుకోవచ్చు. ఇది ఇద్దరికీ ప్రయోజనకరమే. దీంతో కేవలం దళితులకే ఎందుకు ఆర్థికసహాయం అందిస్తారనే విమర్శలను తగ్గించవచ్చు. ఇదేవిధంగా ఇతర సామాజికవర్గాల ప్రజలు ఉత్పత్తి చేసే పంటలను దళితులు స్థాపించే జ్యూస్, చట్నీ లాంటి ఇతర చిన్న పరిశ్రమలకు ముడిసరుకు సరఫరాగా అనుసంధానం చేసి గ్రామీణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కూడా అవకాశాలు పెంచవచ్చు.
అంతేకాకుండా ఈ పథకం గతంలో ముఖ్యమంత్రి సూచించిన నియోజకవర్గానికి ఒక ‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్’ ఏర్పాటుచేయాలనే ప్రణాళికలో భాగం కావచ్చు. పథకం మార్గదర్శకాల్లో ఒకరికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించి నియోజకవర్గానికి ఒక సమగ్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తే ఎంతోమంది బీసీలు ఇతర సామాజకవర్గాల వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. ఇందుకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్; నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిఫ్ అండ్ మేనేజ్మెంట్, హర్యానా లాంటి ప్రభుత్వ సంస్థల సహాయంతో దళిత యువతకు పారిశ్రామిక, సాంకేతికరంగాల్లో స్వయం ఉపాధి కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలి. ఈ పథకం ద్వారా మండలానికి ఒక భూసార పరీక్ష కేంద్రం స్థాపించాలి. ఈ యూనిట్ రైతుల అవసరాలను తీర్చడమే కాకుండా దళితుల వ్యాపార ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. గ్రామంలో ‘దళితబంధు’ ద్వారా ‘మినరల్ వాటర్ ప్లాంట్’ ఏర్పాటుచేస్తే ప్రజలందరికీ ఉపయోగపడటమే కాకుండా మార్కెటింగ్ పెరిగి రెవెన్యూ కూడా పెరుగుతుంది.
పట్టణాల్లో నెలకొల్పిన పెద్ద పరిశ్రమలకు అవసరపడే చిన్న చిన్న విడిభాగాలను కూడా గ్రామీణ పరిశ్రమల్లో తయారుచేసి సరఫరా చేయవచ్చు. సక్రమంగా వినియోగిస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంతాభివృద్ధిని, ఉపాధి అవకాశాలను, ఆర్థిక శ్రేయస్సును పెంచడానికి దళితబంధు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దళిత యువతకు ఆయా రంగాల్లో శిక్షణ ఇస్తూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలి.
మొత్తానికి మా బృందం పరిశీలనలో దళితులు కష్టించి పనిచేస్తుంటారని, విషమ పరిస్థితుల్లో స్వావలంబనకు అవసరమైన అపార అంతర్గతశక్తిని కలిగి ఉన్నారని తెలిసివచ్చింది. దళితబంధు ద్వారా అవకాశాలు కల్పిస్తే పలురంగాల్లో ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ, పాడిరంగాల్లో విజయం సాధించి దళిత సాధికారతకు మార్గదర్శకంగా నిలుస్తారనిపించింది. ఈ అధ్యయనంలో జర్మనీలో జన్మించిన బ్రిటిష్ ఆర్థికవేత్త ఈ.ఎఫ్.షూమాకర్ రచించిన ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ పుస్తకం గుర్తుకువచ్చింది. దళితబంధు ద్వారా చిన్న పరిశ్రమలను స్థాపించి తెలంగాణలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఫరిడవిల్లే అవకాశాలున్నట్లు కనపడింది.
(వ్యాసకర్త: ప్రొఫెసర్ దేవీప్రసాద్ జువ్వాడి, డైరెక్టర్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్)