పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో 2004 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం, వీలైనంత వరకు రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ విడిపోతే ఆంధ్రా ప్రయోజనాలు కాపాడుకోవడం ఎలా?’ అని ఆంధ్ర ప్రాంత నాయకులు కుట్రలు పన్నుతున్న రోజులు. 2004లో అధికారం కోసం టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ఆలోచనలు తీవ్రరూపం దాల్చాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘జలయజ్ఞం’ పేరుతో ప్రాజెక్టులు మొదలుపెట్టిన వైఎస్ 2004 నుంచి 2009 నాటికి రాయలసీమలో ఏకంగా 400 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించారు. దాంతోపాటు రాయలసీమకు ప్రధానంగా నీటిని తరలించే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగాయి.
2014లో తెలంగాణ ఏర్పడేనాటికి కల్వకుర్తి ఎత్తిపోతల కింద సాగునీరందింది 13 వేల ఎకరాలకు మాత్రమే. ప్రాణహిత చేవెళ్ల, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కాంతనపల్లి, దుమ్ముగూడెం, ఎన్ఎస్ టెయిల్‌పాండ్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలేవీ పూర్తికాలేదు. ఆ పదేండ్లలో వాటికింద ఒక్క ఎకరానికీ సాగునీరు అందలేదు. అలీసాగర్, భీమా, గుత్ప, సుద్దవాగు ఎత్తిపోతల కింద పాక్షికంగా సాగునీరందించారు. ఆంధ్ర ప్రాజెక్టులు శరవేగంగా పూర్తిచేసి తెలంగాణ ప్రాజెక్టులను ప్రారంభించి పక్కనపెట్టారు. తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా సాగునీరు అందించడానికి అనువుగా ఉండకూడదన్న ఆలోచనతో ప్రారంభించినవే. దీనికి ప్రధాన ఉదాహరణ ప్రాణహిత చేవెళ్లను నీటి లభ్యత లేని తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఎత్తిపోసుకోవాలని చెప్పడం.
అసలు 2014లో తెలంగాణ ఏర్పడేనాటికి జూరాల కింద ప్రతిపాదించిన లక్షా 2 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందించిన పరిస్థితి లేదు. ఇక జూరాల మీద ఆధారపడ్డ రాజీవ్‌భీమా స్టేజ్-1, స్టేజ్-2, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి 5.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ 17.84 టీఎంసీలను కేటాయించింది. ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చే సమయానికే దాని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత లైవ్ కెపాసిటీ 6.8 టీఎంసీలు మాత్రమే. అటువంటి ప్రాజెక్టు మీద ఆధారపడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించాలని వాదించడం పాలమూరు గొంతు కోయడమే అవుతుంది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మేడిగడ్డ వద్ద నిర్మించడం మీద కూడా ఇదే వితండవాదం నడుస్తుండటం గమనార్హం.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్లు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఏడాది కిందట కేంద్రం తిప్పిపంపినా దానిని ఆమోదించుకునేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గత రెండేండ్లుగా తట్టెడు మట్టి ఎత్తకుండా, కాలువల టెండర్లను కూడా రద్దు చేయడం మీద ఈ ప్రభుత్వ నిష్క్రియపరత్వాన్ని కేసీఆర్ గొంతు విప్పి ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సర్కా రు వెన్నులో వణుకు మొదలైంది. దీంతో పాలమూరు రంగారెడ్డిని జూరాల కింద చేపట్టకపోవడంతోనే కేంద్రం నుంచి అడ్డంకులు వస్తున్నాయని, ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఎందుకు నిర్మించారని ప్రశ్నిస్తున్నారు.
215 టీఎంసీల శ్రీశైలంను కాదని ఆరున్నర టీఎంసీల జూరాల మీద ఆధారపడి నిర్మించాలన్నప్పుడే కాంగ్రెస్ నాయకుల తెలివేమిటో తెలిసిపోతుంది. దీంతో పాటు కృష్ణా జలాలు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ సంతకం పెట్టారని ఇంకో దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ విభజన సమయంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తాత్కాలికంగా ఆ ఏడాది వరకు 299 టీఎంసీలకు ఒప్పుకొన్నది వాస్తవమైనా, దాంతో పాటు కృష్ణా జలాల్లో వాటా తేల్చడానికి ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని కోరారు. అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని అభ్యర్థి హోదాలో 2014లో మహబూబ్‌నగర్ బహిరంగ సభలో వాగ్దానం చేసిన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి పన్నెండేండ్లయినా కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రాన్ని ఒక్క బీజేపీ నాయకుడు అడిగిన దాఖలాలు లేవు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చేనాటికి తెలంగాణలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అందుబాటులో ఉండాలన్న సంకల్పం కేసీఆర్‌ది. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా శరవేగంగా పూర్తిచేసి సాగునీరు అందుబాటులోకి తెచ్చారు. అదే సమయంలో గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల కింద 37 లక్షల ఎకరాలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద 12.5 లక్షల ఎకరాలకు, సీతారామ ఎత్తిపోతల పథకం కింద 6.74 లక్షల ఎకరాలకు, సమ్మక్కసాగర్ కింద 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు.
నత్తనడకన సాగుతున్న దేవాదుల ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లిలను పూర్తిచేశారు. కోయిల్‌సాగర్ కింద తొలిసారి ఆయకట్టుకు సాగునీరందించారు. అంతేకాకుండా మిషన్ కాకతీయ కింద 46,531 చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. కేంద్రం నిధులు ఇవ్వదన్న ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు.
అయితే, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా మీడియా ఎలాంటి పాత్ర పోషించిందో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి మీద విషం చిమ్మిన ఈ మీడియా, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్‌రెడ్డి దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేస్తామంటూ తలుగు చేతిలో పట్టుకుంటున్నది. తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రయోజనాల మీద కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని, సంకల్పాన్ని ఈ మీడియా ప్రశ్నిస్తుండటం ఆశ్చర్యంగా ఉన్నది. పాలమూరు ఎత్తిపోతలపై కేసీఆర్ ప్రశ్నించగానే ఈనాడు దినపత్రిక మెయిన్ ఎడిషన్‌లో ఒక బ్యానర్ వార్త రాసింది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే కేంద్రం వెనక్కి పంపిందని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది’ అని అందులో పేర్కొన్నది. కానీ, 2024 డిసెంబర్లో కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపింది. ఆ విషయం తెలుసుకొని రాయాల్సిన ఆ పత్రిక రేవంత్ రెడ్డి అన్నట్టు తెలిసిందని వార్తను ప్రచురించడం పాఠకులకు నవ్వు తెప్పించింది.
ఈ ఆంధ్రా మీడియా బాధంతా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కాకూడదు. తెలంగాణకు నీటి కేటాయింపులు జరుగకూడదు. పచ్చబడ్డ తెలంగాణను పడావుపడేలా చేయడమే వీరి లక్ష్యం. దానికనుగుణంగానే సీఎం రేవంత్ పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి రెండేండ్లయినా కాళేశ్వరం ఎత్తిపోతల, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఇతర పథకాలలో అవినీతి, బీఆర్ఎస్ నేతల మీద కేసులు, అరెస్టులు, విచారణ పేరుతో విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలన మీద జరిగిన విష ప్రచారం తెలంగాణ సమాజం మీద ప్రభావం చూపిన మాట వాస్తవం. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులకు ఆంధ్రా మీడియా, తెలంగాణ సోకాల్డ్ మేధావులు చేసిన తప్పుడు ప్రచారం అర్థమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తిరుగుబాటు మొదలైంది.
అందుకే, కాంగ్రెస్ ప్రభుత్వం సహకార ఎన్నికలు నిర్వహించకుండా నామినేట్ చేస్తామని చెప్తున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలను నిర్వహించకుండా వెనకడుగు వేస్తున్నది. కనీసం రైతాంగానికి యూరియా కూడా అందించలేని, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేని, విద్యార్థులకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇవ్వలేని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను అందించలేని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని మోసగించిన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించలేని ఈ సోకాల్డ్ మీడియా రేవంత్‌ను వెనకేసుకురావచ్చు. కానీ, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం కాంగ్రెస్ ఆగడాలనే కాదు, ఆంధ్రా మీడియా అత్యుత్సాహాన్ని కూడా గుర్తిస్తున్నదన్న మాట వాస్తవం. సరైన సమయంలో, సరైన రీతిలో సమాధానం చెప్పడం కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తున్నది. కాంగ్రెస్ తప్పులకు తప్పకుండా బుద్ధి చెప్తుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి