వర్ష బీభత్సం సృష్టించిన జలవిలయంతో కేరళలోని వయనాడ్ ప్రాంతం అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లు బురదలో కూరుకుపోయాయి. 270 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. బాధితుల ఆర్తనాదాలతో వయనాడ్ కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికపై సహాయక చర్యలు సాగుతున్నాయి. జూలై 29-30 తేదీల్లో వయనాడ్ ప్రాంతంలో అసాధారణమైన వర్షం కురిసింది. 48 గంటల్లో 572 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ లెక్కతేల్చింది. ఇంతకూ ప్రకృతి ప్రకోపించడమే వయనాడ్ ఘోరకలికి కారణమా? లేక ఇందులో మానవ తప్పిదం ఏమైనా ఉందా?
కేరళ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పదేండ్ల క్రితమే, కేంద్రం వేసిన పర్యావరణ కమిటీ అంతకుముందే నివేదికలు ఇచ్చాయి. అందులో మొదటి కమిటీకి కస్తూరి రంగన్, రెండోదైన పశ్చిమ కనుమల అధ్యయన కమిటీకి మాధవ్ గాడ్గిల్ చైర్మన్లుగా సారథ్యం వహించారు. కొన్ని గ్రామాలను పర్యావరణపరంగా సున్నితమైనవిగా రెండు కమిటీలూ తమ తమ నివేదికల్లో పేర్కొన్నాయి. సున్నిత ప్రాంతాల్లో ప్రకృతి పరిరక్షణకు, ప్రజల సంరక్షణకు జనజీవన కార్యకలాపాలపై నియంత్రణలు విధించాలని రెండు కమిటీలు సిఫారసు చేశాయి. ప్రజల నుంచి ఈ సిఫారసులపై వ్యతిరేకత వచ్చింది. వాణిజ్య పంటలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజల రోజువారీ అవసరాలకు విఘాతం కలుగుతుందనే నెపం మీద ఆ సిఫారసులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కేరళ ప్రభుత్వం 2013లో కమిటీని నియమించగా 2014లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. దానిపై నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ లోగా గనుల తవ్వకం, టూరిజం పేరిట అటవీ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం, తేయాకు తోటల పెంపకం వంటివి యథావిధిగా జరిగిపోయాయి.
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కఠిన చర్యలను ప్రభుత్వాలు చేపట్టకపోవడం వల్ల ఇప్పుడు వయనాడ్ మరుభూమిగా మిగిలింది. పశ్చిమ కనుమలలోని 57 వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదిగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రానికి గాడ్గిల్ కమిటీ సూచించింది. కానీ కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఆ సిఫారసు ఇప్పటికీ అమలు కాలేదు. ప్రస్తుతం పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ముసాయిదా నోటిఫికేషన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నది. మరింత సమయం కావాలని కూడా అడిగింది. కానీ ప్రకృతి బీభత్సాలు ఎవరి కోసమూ ఆగవు కదా! ప్రభుత్వాల తాత్సారం కారణంగా వయనాడ్ బురదమేటగా మారిపోయింది. ఇప్పటికైనా సున్నిత ప్రాంతాలను గుర్తించి, పర్యావరణానికి నష్టం కలిగించే మానవ కార్యకలాపాలను అదుపు చేయగలిగితే మంచిది. లేకపోతే బీభత్సాలను మనకు మనమే ఆహ్వానించినట్టుగానే భావించాలి!