e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home సంపాదకీయం శాంతి వచనం

శాంతి వచనం

‘అఫ్గానిస్థాన్‌లో ఇరువై ఏండ్ల ఘర్షణను ముగించాం. నిరంతర యుద్ధ శకానికి ముగింపు పలికి, నిరంతర దౌత్యమనే కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం శాంతి ప్రియులలో ఆశాభావం రేకెత్తిస్తున్నది. ట్రంప్‌ వాదాన్ని ఓడించి అధికారం చేపట్టిన బైడెన్‌, ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన తొలి ప్రసంగం, అమెరికా విధాన పత్రాన్ని ప్రకటించినట్టుగా ఉన్నది. ప్రపంచం రెండు శిబిరాలుగా విభజితమయ్యే మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం అనేది చిట్టచివరి ప్రత్యామ్నాయం కావాలని సూచించారు. ఇరాన్‌, కొరియా ద్వీపకల్ప సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కూడా ఆకాంక్షించారు. ఆచరణ ఎలా ఉంటుందో కానీ, బైడెన్‌ శాంతి వచనాలు ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి.

ఎంత సంయమనంతో మాట్లాడినా, చైనా నుంచి తమకు గట్టి పోటీ ఎదురుకానుందనే వాస్తవాన్ని కూడా బైడెన్‌ గుర్తించారు. రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులకు అనేక కారణాలున్నాయి. ఒకటి వ్యాపారపరమైనది. చైనా అంతకంతకూ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉంటే, అమెరికా పూర్వ వైభవాన్ని కోల్పోతున్నది. రెండో అంశం విలువలకు సంబంధించినది. అమెరికా ప్రజాస్వామిక సమాజానికి ప్రతీక అయితే, చైనా ఏకపార్టీ పాలనకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. చైనా పేరు ఎత్తకుండానే ఆ దేశంలోని మైనారిటీల పరిస్థితిని బైడెన్‌ పరోక్షంగా ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య అగాధం పెరిగే ప్రమాదం ఉన్నదని ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ కూడా హెచ్చరించారు. ‘రెండు భిన్న రకాల ఆర్థిక- వ్యాపార- విత్త- సాంకేతిక నియమాలు, కృత్రిమ మేధ వృద్ధి పోకడలు, అంతిమంగా రెండు సైనిక భౌగోళిక రాజకీయ వ్యూహాల వైపుగా ప్రపంచం వెళ్తున్నద’ని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ చెప్పినట్టు- చైనాను పోటీదారుగా గుర్తిస్తూనే, దౌత్యం, ఇతర శాంతియుత విధానాలను ఎంచుకోవడమనేది శ్రేయస్కరం.

- Advertisement -

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో అన్ని ఖండాల్లో జాతులు సచేతనమయ్యాయి. ఇతర దేశాల్లో సైనిక జోక్యమనేది కాలంచెల్లిన మొరటు విధానంగా, విఫల సాధనంగా మారిపోయింది. అనేక రూపాల్లో నిరంకుశ వ్యవస్థలపై ఒత్తిడులు తేవడం, ప్రజాస్వామ్యశక్తులకు సూత్రప్రాయ మద్దతివ్వడమే సరైన విధానం. బైడెన్‌ అభిప్రాయపడినట్టు- కరోనా, వాతావరణ మార్పులు, సాంకేతిక ముప్పులు, నిరంకుశ వ్యవస్థలపై మానవాళి ఉమ్మడిగా పోరాడవలసి ఉన్నది. వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి వర్ధమాన దేశాలకు ఆర్థిక తోడ్పాటును రెట్టింపు చేస్తామని బైడెన్‌ ప్రకటించారు. ఇతర దేశాలలోని బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులకు పెట్టుబడులను నిలిపివేస్తామని, ఇదే సందర్భంగా తమవంతుగా చైనా ప్రకటించింది. మానవాళి ఉమ్మడి సమస్యలపైనే మన పోరాటం ఉండాలనే విజ్ఞత అన్ని దేశాల నాయకులలో నెలకొంటుందని ఆశిద్దాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement