రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీంతో అక్కడి చట్టసభల్లో, సంస్థల్లో కులవివక్షపై నిషేధాలు విధిస్తూ కొత్త చట్టాలు, నిబంధనలు వెలువడుతున్నాయి. సియాటిల్ నగరం దీనికి తాజా ఉదాహరణ. అమెరికాలో ఒక నగరం కుల వివక్షను నిషేధిస్తూ చట్టం చేయటం ఇదే తొలిసారి. దక్షిణాసియా వాసులు అత్యధికంగా నివసించే కాలిఫోర్నియా రాష్ట్రం కూడా ఇదే దిశలో ముందుకు సాగుతున్నది. ఆ రాష్ట్ర సెనేట్‌లో కొందరు సభ్యులు కులాన్ని నిషేధించే బిల్లును గత నెల ప్రవేశపెట్టారు. ఇప్పటికే కాలిఫోర్నియా యూనివర్సిటీ ‘వివక్ష వ్యతిరేక విధానాల్లో’ కులాన్ని కూడా ఒక అంశంగా చేర్చింది.
అమెరికాలో 1965లో తీసుకొచ్చిన ‘వలస, జాతీయతా చట్టం’ నేపథ్యంలో ఆసియా దేశాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తల వంటి వృత్తినిపుణులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వచ్చారు. వీరిలో హిందూ అగ్రకులాలకు చెందిన భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 1990లో అమెరికా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన హెచ్1బీ వీసా పథకం కింద కూడా భారీ ఎత్తున భారతీయులు తరలి వచ్చారు. వీరిలోనూ మెజారిటీ అగ్రకులాల వారే. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీ జరిపిన ఒక సర్వే ప్రకారం.. అమెరికాలోని హిందువుల్లో 87 శాతం మంది అగ్రకులాలకు చెందిన వారుకాగా, ఒక్క శాతం మంది మాత్రమే దళితులు. తొలినాళ్లలో కులవివక్ష ఒక అంశంగా ముందుకు రాకపోయినా, ఇటీవలి కాలంలో బాగా చర్చలోకి వస్తున్నది. కులవివక్ష వ్యతిరేక సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కరిస్టుల కృషి దీనికి ప్రధాన కారణం. వీరిలో తెన్మొజి సౌందర్‌రాజన్ ‘ఈక్వాలిటీ ల్యాబ్స్’ సంస్థ కృషి ముఖ్యమైనది. ‘బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టండి’ అనే నినాదంతో 2018లో ఆమె తీసుకొచ్చిన పోస్టర్ వివాదం రేపింది.
ఈక్వాలిటీ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో నివసిస్తున్న దళితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కులం ఆధారంగా తోటి భారతీయుల నుంచి అవమానాలను ఎదుర్కొంటున్నారు. 2020లో టెక్నాలజీ కంపెనీ సిస్కోలో అగ్రకులాలకు చెందిన ఇద్దరు భారతీయ మేనేజర్లు ఒక దళిత ఇంజినీర్‌పై వేతనం, ఉద్యోగ నిబంధనల పరంగా వివక్ష చూపించిన ఘటన దుమారం రేపింది. ఆ కంపెనీపై ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది. సిలికాన్ వ్యాలీలోని పలు టెక్నాలజీ కంపెనీల్లో కూడా కులవివక్ష ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారోద్యమం ఫలితంగానే అమెరికాలో కుల వివక్షపై నిషేధాలు పెరుగుతున్నాయి. అయితే, కాలిఫోర్నియా సెనేట్ కుల నిషేధ బిల్లును కొన్ని హిందూగ్రూపులు వ్యతిరేకించడం గమనార్హం. అమెరికాలో ఇప్పటికే మతపరంగా వివక్ష ఎదుర్కొంటున్న తమపై ఇటువంటి నిషేధాలు మరిన్ని ఆంక్షలు తీసుకొస్తాయని అవి వాదిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు అమెరికాలో సైతం కులంపై వాడివేడిగా చర్చ నడుస్తున్నది.