గ్రూప్ 1, 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కేవలం ప్రతిభ ఆధారంగానే ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, ఇక అక్కడ ఎటువంటి వివక్షకు, పైరవీలకు, సందేహాలకు తావు ఉండే అవకాశం లేదని ఈ నిర్ణయం చాటిచెప్పింది. 91 వేలకుపైగా ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపటం ద్వారా నిరుద్యోగులకు శుభవార్తను అందించిన రాష్ట్రప్రభుత్వం.. నియామకాల విషయంలో పూర్తి పారదర్శకతే తన విధానమని విస్పష్టంగా ప్రకటించి వారిలో మరింత నమ్మకాన్ని కల్పించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ అభ్యర్థులు ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. రాతపరీక్షలో మంచి ప్రతిభ చూపినప్పటికీ ఇంటర్వ్యూలో వారికి మార్కులు పడేవి కావు. సీమాంధ్రకు చెందిన అభ్యర్థులకు రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇంటర్వ్యూలో 95 శాతం వరకూ మార్కులు వేసి ఉద్యోగాల్ని బంగారుపళ్లెంలో పెట్టి అందించేవారు. ఇటువంటి చేదు అనుభవాలకు తోడు అవమానాలు.
‘ఉన్న ఊరిలో ఉండక ఉద్యోగమెందుకు?’, ‘ఒడ్డూ పొడుగూ బాగానే ఉన్నావు కదా సినిమాల్లో ప్రయత్నించుకోరాదు!’ అంటూ ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న పెద్ద మనుష్యులు మన బిడ్డలతో ఆటలాడుకునేవారు. ఇంటర్వ్యూల పేరుతో భారీ ఎత్తున వసూళ్లు జరిగినట్టు ఆరోపణలు ఉండేవి. కేసులు సరేసరి. దీనికితోడు ఇంటర్వ్యూల్లో మంచి మార్కులు వేయిస్తామనే దళారీ దందా. వీటన్నింటి నేపథ్యంలోనే, ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ అంటే అక్రమాలకు, అవినీతికి సందు ఇవ్వటం అన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. ఇంటర్వ్యూలను రద్దు చేయటం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆ చీకటి అవశేషాన్ని వదిలించుకున్నట్టయ్యింది.
తెలంగాణ రాష్ట్రం స్వర్ణకాంతులతో వెలిగిపోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో రంగాన్నీ సమూలంగా సంస్కరిస్తున్నారు. అత్యధికమందికి ఉపాధి కలిగించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కీలకంగా నిలిచే వ్యవసాయరంగంలో ఎటువంటి మహత్తర మార్పులు సంభవించాయో మన కళ్లముందు కనిపిస్తున్నది. ఆ తర్వాత విద్యుత్తు, పారిశ్రామికరంగం, పెట్టుబడులు, శాంతిభద్రతలు మొదలుకొని విద్య, వైద్యం, సంక్షేమం, కులవృత్తులు, ఆధ్యాత్మిక రంగం వరకూ తెలంగాణ నవనవోన్మేష వైభవాన్ని సంతరించుకుంటున్నది.
యావత్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన మరో కీలకమైన సంస్కరణ- ఇంటర్వ్యూల రద్దు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగానే గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీని చేపట్టటం అనేది అభ్యర్థులందరికీ సమాన అవకాశాల్ని ఇవ్వటమే కాదు, వారిపై మానసిక ఒత్తిడి కూడా లేకుండా చేస్తుంది. ముఖ్యంగా, ప్రతిభ ఉండి కూడా దానిని నలుగురి ఎదుట ప్రదర్శించటంలో బిడియపడే గ్రామీణప్రాంత అభ్యర్థులకు ఇదొక ఊరట. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ శక్తిసామర్థ్యాలకు సానబెట్టి ఉద్యోగాలను సొంతం చేసుకోవాలి..