కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోవచ్చు. ఏమేం ప్రాజెక్టులు ఇచ్చామో, తెచ్చామో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే అయిదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో కూడా హామీలు ఇవ్వవచ్చు. కానీ అదేమీ లేదు. యథావిధిగా అసత్యాలు, ఆరోపణలు.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేవెళ్ల సభలో మాట్లాడిన మాటల నిండా ఇవే. ఎందుకంటే, తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. తెచ్చింది ఏమీ లేదు కాబట్టి. అధికారంలోకి వచ్చీ రావటంతోనే ఏడు మండలాలను గుంజుకున్నారు. ఇవ్వాల్సిన ఐటీఐఆర్‌ను ఇవ్వకుండా ఆపివేశారు. అంతటితో ఆగకుండా, రాష్ర్టాన్ని తలెత్తుకొనేలా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నదట. మరి, ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన దాదాపు లక్షా 30 వేల పోస్టుల మాటేమిటి? అవి ఎవరి లబ్ధి కోసమో షా చెప్పగలరా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ ఈ దేశ యువతకు మోదీ 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమిత్ షాకు గుర్తున్నదా? ఇప్పటి వరకూ 18 కోట్ల ఉద్యోగాలు యువతకు లభించాయా? కొత్త ఉద్యోగాల సంఖ్య కనీసం అరకోటి కూడా దాటలేదని కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ వెనుక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర ఉందన్నది యావత్ తెలంగాణకు తెలుసు. లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇదేం పని అంటూ అతడిని మందలించాల్సిన బాధ్యత అమిత్‌షాది. అందుకు విరుద్ధంగా అతడేదో ఘనకార్యం చేసి జైలుకు పోయినట్లుగా మెచ్చుకోవటం ఎటువంటి రాజకీయాలకు సంకేతం? 2014-21 మధ్య కాలంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు వెళ్లగా, అటు నుంచి ఇటు వచ్చింది రూ.1,68,647 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాగా, కేంద్రం గతంలో కంటే భారీ ఎత్తున నిధులను ఇస్తున్నదని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయటం లేదనటం ఏమిటి? వరదలొస్తే ఆదుకున్నది లేదు. పండిన ధాన్యాన్ని కొన్నది లేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. కేంద్రం సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది చాలక పైగా అభాండాలు!
బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచటానికి ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలా? బీసీ తదితర వర్గాలపై నిజంగానే ప్రేమ ఉంటే, ఇప్పుడున్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచుతూ కేంద్రం ఒక బిల్లును ఎందుకు తీసుకురాదు? ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఇప్పటి వరకూ ఎందుకు స్పందించదు? ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్‌ను తొలగిస్తామని చెప్పటంలో.. మతపరమైన చీలిక తెచ్చి, ఓట్లు కొల్లగొట్టే వ్యూహం తప్ప మరేమున్నది? చైతన్యవంతమైన తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది. ట్రైలర్, సినిమా రెండూ చూపించటానికి సిద్ధమవుతున్నది.