పగిలిన అద్దం అంచుల మెరుపును
వజ్రమని ఊరేగుతున్నపుడు
పునాదుల్లేని అంతస్తుల ఎత్తును
కొలుస్తూనే ఉన్నచోట
ఎవరి శ్రమా ఫలాన్ని వారికి పంచడమే
సంక్షేమమై మెరుస్తుంది..
ఏడాదికో బడ్జెట్టూ, ఐదేండ్లకో బ్యాలెట్టూ
బహుకరించే మహాగ్రంథం ముందు
రోజువారీ బతుకులకు ఏ భరోసాలూ ఉండవు.
గణాంక అభివృద్ధిని కాగితాల్లోనూ
వాస్తవాభివృద్ధిని
పెద్ద తలకాయల దొడ్లో దాచుతున్న చోట
వేల అప్పులకు అరదండాలూ
కోటాను కోట్లకు మాత్రం రుణమాఫీలు…
మతం జెండాలు అగ్నికీలలవుతున్నపుడు
భ్రమలన్నింటినీ శుభ్రం చేసి
దేశాన్ని అప్రకటిత జైలులా మార్చుకుంటున్నాం.
విగ్రహాలు కట్టి మనుషులను గాలికి వదిలేసినా
ఏ ఓటూ రాజుకోదు.
స్వదేశీ మంత్రంలో ఎగిరే జెండా మొదలు
తొడిగే అంగీ వరకూ
శతృదేశపు ఉత్పత్తులే అయిన చోట
పాములే తప్ప నిచ్చెనల్లేని
వైకుంఠపాళి బతుకులు.
పుణ్యస్థలాలన్నీ న్యాయస్థానాల మెట్లను
పునీతం చేస్తూనే ఉన్నాయి.
సంస్కరణలన్నీ చిన్న నోట్ల నుంచి
పెద్దవిగా మారి అంతర్థానమైపోయాయి.
మూతికి కట్టిన ముంతలు కుండలై వెక్కిరిస్తున్నాయి.
నాప్కిన్ అడిగినవాళ్లను దురాశాపరులుగా
కండోమ్ బుడగలు పేల్చి వెక్కిరిస్తాయి.
ఎప్పుడే తుపాకీ చూపు ఎవర్ని చూస్తుందో
ఎక్కడి కలలక్కడే గప్చుప్.
కుంభాకార అద్దంలో ఉండాల్సింది
పుటాకారంలో కుదించుకుపోతున్నప్పుడు
కండ్లారా నిద్రపోవడానికో ఆయుధం ధరించాలి.
కిటికీల్లేని ఉక్కపోతల మధ్య చిక్కుకున్న దేశం
అసుర సంధ్యలో వలసపిట్టయి ఎగిరిపోకముందే
చెరబట్టిన స్వేచ్ఛకు విముక్తి కలిగించాలి.
ఏ జెండా అయినా అస్తిత్వాన్ని నిలుపుకొనేది
ఏ గాలిపటమైనా పైకి ఎగిరేది
ఎదురుగాలి వీచినప్పుడే..!
– ర్యాలి ప్రసాద్, 94945 53425