చరిత్ర పునరావృతమవుతుందని అంటుంటాం.. వింటుంటాం.. కానీ, ఇప్పుడు చరిత్ర తిరగబడింది. భారతదేశాన్ని 230 ఏండ్లపాటు ఏలిన బ్రిటన్కు అదే భారతదేశ మూలాలున్న రిషి సునాక్ పాలకుడు కావటం అటువంటి సందర్భమే. అందులోనూ ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆయన పగ్గాలు చేపట్టటం మరింత విశేషం. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ వంటి మాజీ ప్రధానులు తమ వల్ల కాదని కాడి వదిలేసిన నేపథ్యంలో.. ప్రధానిగా రిషికి బాధ్యతలను ఆంగ్లేయులు అప్పగించారంటేనే ఆయన మీద వారికున్న నమ్మకం ఎంతటిదో తెలుస్తున్నది. భారత్ నుంచి తూర్పు ఆఫ్రికాకు అక్కడి నుంచి బ్రిటన్కు వలస వెళ్ళిన కుటుంబానికి చెందిన రిషి స్వయంకృషితో, ప్రతిభతో ఈ స్థాయికి ఎదగడం ప్రశంసనీయం. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ నియమితులై భారత సంతతి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పగా.. రిషి సునాక్ దానికి మరింత బలం చేకూర్చారు.
రిషి సునాక్ ముందున్న సవాళ్లు అత్యంత కఠినమైనవి. ఇతర యూరోపియన్ దేశాల పాలకుల పరిస్థితీ ఇదే మాదిరిగా ఉంది. కరువుమంటే కప్పకు కోపం, విడువుమంటే పాముకు కోపం అన్నట్టుగా- అటు పెట్టుబడిదారీ వర్గాన్ని, ఇటు సామాన్యులను మెప్పించలేని సంకటం. సంపద కేంద్రీకరణ కొనసాగి పేదరికం పెరిగిపోతున్నది. పొదుపు చర్యల పేర సంక్షేమ పథకాలపై కోత విధిస్తే ప్రజల ఆగ్రహానికి గురికావడంతోపాటు దీర్ఘకాలంలో జనం కొనుగోలు శక్తి క్షీణించి క్రమంగా మహామాంద్యాన్ని పోలిన విపత్తు తలెత్తవచ్చు. ఈ సవాలును స్వీకరించి నెగ్గుకు రాగలిగితే మాత్రం బ్రిటన్కే కాదు, ప్రపంచానికి దారి చూపించిన ఘనత రిషి సునాక్కు దక్కుతుంది.
కన్జర్వేటివ్ పార్టీలోని మిగతా వారికన్నా భారతీయ మూలాలున్నప్పటికీ రిషికే ఆమోదనీయత లభించడం బ్రిటిష్ సమాజ ఔన్నత్యాన్ని సూచిస్తున్నది. యూరప్ ఖండం ఆధునిక యుగంలోకి ప్రవేశించినప్పుడు ప్రజల ఆలోచనలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. జాతి, మత విద్వేషాలు అంతరించాయి. లౌకికత్వం, బహుళత్వం అనే భావనలు బలపడ్డాయి. సామాజిక శాంతి నెలకొని ఆర్థికాభివృద్ధి సాధ్యపడింది. యూరప్ ప్రజలు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అందుకు వారు సంతరించుకున్న ఆధునిక విలువలే కారణం. భారత్ వంటి వర్ధమాన దేశాలు తాము అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విలువలను సుస్థిరం చేసుకోవడానికి ఈ ఉదంతం స్ఫూర్తినిస్తుంది. గల్ఫ్ దేశాలలో ధనానికి కొదువ లేదు. చైనాకు సైనిక బలం తక్కువ లేదు. కానీ అవేవీ అభివృద్ధికి నిదర్శనాలు కావు. బ్రిటన్, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల సర్వతోముఖాభివృద్ధే అభిలషణీయమైనది. వీటిని కాపాడుకోవడంలోనే మన ఔన్నత్యం నిలిచి ఉంటుంది.