వేల ఏండ్లుగా మన దేశానికి సహజ రక్షణ కవచంగా ఉన్న హిమాలయాలు.. పెరుగుతున్న పర్యావరణ సమస్యల కారణంగా బలహీనపడుతున్నాయి. అనేక హిమానీనదాలు కరిగిపోతున్నాయి. పొరుగునున్న చైనాతో ఉద్రిక్తతలు పెరగటమే కానీ తగ్గని పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం దీనిపై తక్షణం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో లఢక్ తదితర ప్రాంతాలు కీలకమైనవి. 2000 నుంచి 2020 వరకూ పశ్చిమ హిమాలయాల్లోని డ్రాస్ బేసిన్‌పై జరిపిన విస్తృత అధ్యయనంలో.. హిమానీనదాల విస్తీర్ణం తగ్గిపోతున్నదని వెల్లడైంది. ఉపగ్రహాల ఛాయాచిత్రాల ఆధారంగా జరిపిన ఈ పరిశోధన వివరాలను ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్’ పత్రికలో ప్రచురించారు. మొత్తం 77 హిమానీనదాలపై అధ్యయనం జరిగింది. వీటి విస్తీర్ణం 176.77 చదరపు కిలోమీటర్ల నుంచి 171.46 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది. 20 ఏండ్లలో దాదాపు మూడు శాతం తగ్గుదల.
దీనికి ప్రధాన కారణం జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోవటమేనని పరిశోధకులు తేల్చారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాల వల్ల హిమానీనదాలపై నిక్షిప్తమవుతున్న బ్లాక్‌కార్బన్ మోతాదు ఏటా పెరిగిపోతున్నది. 1984లో ఒక క్యూబిక్ మీటర్‌పై సగటున 338 నానోగ్రాముల బ్లాక్‌కార్బన్ ఉండగా, 2020లో అది 634 నానోగ్రాములకు పెరిగింది. బ్లాక్‌కార్బన్ నిక్షిప్తమైన మంచు సూర్యరశ్మిని అధికంగా శోషించుకుంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రత పెరిగి కరిగిపోతుంది. ఈ సమస్య హిమాలయాల పశ్చిమవైపు మాత్రమే కాదు, తూర్పు దిక్కున ఉన్న హిమానీనదాల్లోనూ కనిపిస్తున్నది. ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో తరతరాలుగా జీవిస్తున్న కోట్లాదిమంది భారతీయుల ఉనికి సమస్య కూడా. మంచినీరు, సాగునీరు, రవాణా, వ్యాపా ర వాణిజ్యాలు- సమస్త రంగాలూ హిమాలయాలతో ముడిపడి ఉన్న జీవనం వారిది. హిమానీనదాలు కరిగి నీరై, నదుల్లో ప్రవాహం పెరిగి వరదలు పోటెత్తితే వారందరికీ తీవ్రమైన ముప్పే.
ప్రకృతిలో మనం ఒక భాగమన్న ఎరుకతో జీవిస్తే మనకే మంచిది. అలా కాకుండా, ప్రకృతి సంపద అంతా మానవాళి వినియోగం కోసం అన్న భావనతో వ్యవహరిస్తే ఊహించనలవిగాని విపత్తులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతా ల్లో ఇది మరింత ఆచరణీయమైన అంశం. కానీ, ముందుచూపు కొరవడిన ప్రభుత్వాలు ఇష్టారీతిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటం, కొండలను, గుట్టలను తొలిచి రోడ్లను వేయటం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో మానవ సంచారానికి, వాహనాల రాకపోకలకు అనుమతులివ్వటం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. వేల ఏండ్లుగా ఒక సమన్వయంతో కొనసాగిన జీవావరణం దీనివల్ల ధ్వం సమై, సమతుల్యతను కోల్పోతున్నది. ఫలితంగానే హిమాలయాల సమీపంలోని పలు రాష్ర్టాల్లో ఉన్నట్లుండి కొండచరియలు విరిగిపడ టం, వరదలు పోటెత్తటం వంటి దుర్ఘటనలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీటినుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పర్యావర ణ స్పృహను పెంపొందించుకోవాలి. హిమాలయాల్ని రక్షించుకోవాలి.