భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రమైన కుదుపులకు లోనవుతున్నాయి. తాజాగా రెండు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించుకోవడం రెండు దేశాల విభేదాలకు పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య ఈ పంచాయతీకి మూల కారణం. నిజ్జర్ హత్య వెనుక ‘భారత్ ఏజెంట్ల’ పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు గత ఏడాది సెప్టెంబర్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించడం దౌత్యపరమైన దుమారాన్ని రేపింది. ‘అవి అర్థరహితమైన, దురుద్దేశపూరితమైన ఆరోపణలని’ భారత్ అప్పట్లో ఖండించింది.
ఇప్పుడు ట్రూడో ఒకడుగు ముందుకువేసి నిజ్జర్ హత్యను భారత ప్రభుత్వమే చేయించిందని, దౌత్యాధికారులు సంధానకర్తలుగా వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో భారత హై కమిషనర్‌ను అనుమానితుడిగా పేర్కొంటూ ఆయన పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఓట్ల రాజకీయంలో భాగంగానే ఆయన ఈ ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అంతేకాదు, కెనడా తీరుకు నిరసనగా హై కమిషనర్‌ను వెనుకకు పిలిపించుకున్నది. ‘ఓటు బ్యాంకు’ రాజకీయంలో భాగంగానే ఆయన ఈ ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేయడం గమనార్హం.
కెనడా జనాభాలో 2 శాతం వరకు, అంటే సుమారు 7.7 లక్షల మంది సిక్కులున్నారు. కాలక్రమంలో అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఇద్దరు సిక్కులు ట్రూడో మంత్రివర్గంలో సభ్యులుగా ఉండటమే ఇందుకు నిదర్శనం. దేశ దేశాల్లో ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు రాజకీయంగా కీలక స్థానాల్లోకి ఎదగడం కొత్తేమీ కాదు. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా గెలిచి ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడటం మనం చూస్తున్నాం. కానీ, కెనడా విషయం వేరు. అక్కడి సిక్కుల్లో ఖలిస్థానీ వేర్పాటువాదులు కూడా ఉన్నారు. వారు కెనడా గడ్డపై నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
అక్కడి ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పించి పరోక్ష మద్దతు అందిస్తున్నది. సుమారు నలభై ఏండ్ల కిందట కనిష్క విమానం పేల్చివేత మొదలుకొని ఇటీవలి కాలంలో దౌత్య కార్యాలయాలపై దాడుల దాకా భారత్ లక్ష్యంగా జరిగిన అనేక హింసాత్మక దాడులతో కెనడాలోని సిక్కు ఖలిస్థానీవాదులకు సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే. ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన నిజ్జర్ గతేడాది జూన్‌లో కెనడాలోనే హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు భారతే కారణమని కెనడా ఆరోపించింది. ఆధారాలుంటే చూపాలని భారత్ అంటుంటే, ఈసరికే బోలెడు ఆధారాలు చూపామని కెనడా వాదిస్తున్నది.
వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో గెలుపు మీద దృష్టితోనే ప్రధాని ట్రూడో ఈ హత్యను రాజకీయం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ అదే అంటున్నది. జనామోదంలో 31 శాతానికి పరిమితమైపోయి వెనుకబడిన ట్రూడో నిజ్జర్ అంశాన్ని తలకెత్తుకోవడం వెనుక కారణాల గురించి తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖలిస్థాన్ సమర్థకుడైన జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ గత వారమే ట్రూడో సర్కార్‌కు మద్దతు ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో తన ఓటు బలం పెంచుకునేందుకు ఖలిస్థానీయుల మెప్పు కోసం ప్రధాని ట్రూడో భారత్‌పై విమర్శలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనం కోసం భారత్ వంటి దేశంతో సంబంధాలను బలిపెట్టడం వాంఛనీయం కాదు.