చరిత్రలో రెండు దశాబ్దాలు పెద్దగా లెక్కలోకి రావు. కానీ ఈ అతి స్వల్ప కాలంలోనే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నిర్వహించిన పాత్ర గణనీయమైనది. దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయటం, సాధించుకున్న రాష్ర్టాన్ని పలురంగాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టటం టీఆర్ఎస్ సాధించిన ఘన విజయాలు. కేసీఆర్ రాజనీతిజ్ఞత, అద్వితీయమైన నాయకత్వ పటిమ కారణంగానే టీఆర్ఎస్ 20 ఏండ్లలోనే ఈ రెండు మహత్తర లక్ష్యాలను సాధించగలిగింది. తెలంగాణ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పి, సమాజాన్ని ఏకం చేసి, లక్ష్యం దిశగా నడిపించిన కేసీఆర్, ఆ తరువాత రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్న తీరు అపూర్వమైనది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ద్విశతాబ్ది సమావేశాలు జరుపుకోవడం తెలంగాణ సమాజానికే గర్వకారణం.
పార్టీ మహాసభలో కేసీఆర్ పేర్కొన్నట్టు- దేశంలోనే టీఆర్ఎస్ అత్యంత బలమైన రాజకీయ శక్తుల్లో ఒకటి, తెలంగాణ గొంతుక. తెలంగాణ ప్రజల ఏకైక ప్రాతినిధ్య శక్తియైన టీఆర్ఎస్ తన గురుతర బాధ్యతను ఎప్పుడూ పోషిస్తూనే ఉన్నది. జాతీయోద్యమానికి గాంధీజీ రూపంలో ఒక సమున్నత నాయకుడు లభించేవరకూ అదే పరిస్థితి. అతివాదులు, మితవాదులు, మతవాదులు, కమ్యూనిస్టులు అంటూ లెక్కలేనన్ని చీలికలు ఉండేవి. మహాత్ముడి నాయకత్వం ప్రారంభమైన తర్వాతనే ఈ పాయలన్నీ ఒక్కధారగా ఏకీకృతమై, అశేష ప్రజానీకంలో జాతీయభావన ప్రేరేపితమైంది. తెలంగాణ ఉద్యమంలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి. కేసీఆర్ నాయకత్వం లభించేంతవరకూ అనేక రూపాల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష బలహీనంగా వ్యక్తమవుతూ ఉండేది. నిరాశ, నిరుత్సాహం ఆవరించిన ఆ తరుణంలో కేసీఆర్ ఎంతో సాహసంతో టీఆర్ఎస్కు ఊపిరి పోసారు. మూడున్నరకోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే టీఆర్ఎస్ బాధ్యత తీరిపోలేదు. కేసీఆర్ రాజకీయ పార్టీ స్థాపన ఒక ఒంటరి ఘటన కాదు. సమకాలీన రాజకీయాలకు అనుగుణమైన ఒక చారిత్రక పరిణామం. దీనిని వర్తమాన జాతీయ రాజకీయాల నుంచి విడదీసి చూడలేము. కేసీఆర్ ఎప్పుడూ ఒక లక్ష్యం తరువాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ఉంటారు. ఈ లక్ష్య సాధనలో టీఆర్ఎస్ ఒక సాధనం. స్వాతంత్య్రం వచ్చిన మొదటి కొన్ని దశాబ్దాలలో ఉత్తరాదిన గల ఒకటి రెండు రాష్ర్టాల నాయకులే చక్రం తిప్పేవారు. కానీ ఇప్పుడు దేశ రాజకీయ ముఖచిత్రం భిన్నత్వాన్ని సంతరించుకున్నది. వైవిధ్యభరితమైన మన విశాల దేశంలో ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం ప్రాంతీయ శక్తులు బలపడటమే కాదు, జాతీయ స్థాయిలో ప్రభావిత శక్తులుగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ దిశానిర్దేశంలో టీఆర్ఎస్ రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాలలోనూ ప్రధాన పాత్ర పోషించాలని ఆశిద్దాం.