మంగళవారం 02 మార్చి 2021
Editorial - Dec 01, 2020 , 00:47:00

అభివృద్ధికి అండగా..

అభివృద్ధికి అండగా..

‘పువ్వులపైన నిప్పులను బోయుట కేనియు, మల్లెతీవకున్‌/ గ్రొవ్విన కాఱుదున్న జతగూర్చుటకేనియు గున్నమావులన్‌/ మవ్వము దూలిపో సెగల మాడ్చుటకేనియు సాహసించి యీ/ పువ్వులతోటనే నఱుకఁబూనిరి కొందఱు మూఢ మానవుల్‌..’ అని అందమైన పూదోటలాంటి తెలంగాణ జనజీవనాన్ని ధ్వంసం చేయజూస్తున్న మూఢుల యత్నాలను నలభయవ దశకంలోనే కేశవపంతుల నరసింహశాస్త్రి తీవ్రంగా నిరసించారు. మత దురహంకారులైన రజాకార్ల దుశ్చర్యలను నాటి మన సమాజం నిలువరించి సహజీవన పతాకను ఎత్తిపట్టింది. వివిధ జాతి, మత, భాషా సంస్కృతుల సమ్మిళిత దక్కనీ సంస్కృతి విశిష్టతను చాటిచెప్పింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ మొదలు, గానకోకిల సరోజినీ నాయుడు లాంటి వారు హైదరాబాద్‌ సాంస్కృతిక జీవనాన్ని ‘గంగా జమున తెహజీబ్‌'గా కొనియాడారు. అలాంటి నగరానికి ఇవ్వాళ మత విద్వేష రాజకీయాల కారణంగా మరోసారి ప్రమాదం ఏర్పడింది. 

హైదరాబాద్‌ నగర భవితవ్యాన్ని నిర్ణయించే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ మతవిద్వేష రాజకీయాలు వికటాట్టహాసం చేస్తున్నాయి. సుందర, ప్రశాంత  హైదరాబాద్‌ నగర జీవితంలో మతకలహాల మంటలు రేపేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. ఒకరు సమాధులు కూల్చివేస్తామని అంటే, మరొకరు సర్జికల్‌ స్ట్రైక్‌ జరుపుతామని విషం చిమ్ముతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పక్షమైన బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడటం ఆందోళనకరం. అభివృద్ధి ప్రణాళికలతో నగరాన్ని తీర్చిదిద్దే తమ కార్యాచరణను చెప్పకుండా మతం కేంద్రంగా రాజకీయాలు చేయటం గర్హనీయం. 

ముఠా రాజకీయాలు, మత విద్వేషాలతో గత 37 ఏండ్లలో హైదరాబాద్‌ ఎంతో విషాదాన్ని అనుభవించింది. రాజకీయ ఉత్థానానికి మతకలహాలే దగ్గరిదారిగా భావించిన దుస్థితి. 1978-85 మధ్య కాలంలో ఏటా మతఘర్షణలు చోటుచేసుకోవడం నాటి దుష్ట రాజకీయాలకు అద్దం పడుతుంది. 11సార్లు జరిగిన మతఘర్షణల కారణంగా 113 రోజులపాటు నగర ప్రజలు కర్ఫ్యూ నీడలో బిక్కుబిక్కుమని బతికారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా అభివృద్ధే తారకమంత్రంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆరేండ్లుగా నగరం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. సకల మౌలిక వసతులు, వనరుల కల్పనతో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. అన్ని రంగాలలో అభివృద్ధి కానవస్తున్నది. ఈ నేపథ్యంలో మత రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి వైపు నిలబడటం ప్రజల కర్తవ్యం.

VIDEOS

తాజావార్తలు


logo