శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 07, 2020 , 00:12:31

దట్టించిన ఫిరంగిపై అగ్గిపుల్ల

దట్టించిన ఫిరంగిపై అగ్గిపుల్ల

మూడో అధ్యాయం కొనసాగింపు...

ఒకసారి ఉప్పెన విరుచుకు పడిందంటే పట్టణ పరిధిలోని దాడుల్ని మనకున్న బలగాలతో అణచివేయవచ్చునుగాని అయితే తప్పని సరిగా కాల్పులు జరపవలసి ఉంటుంది. కాల్పులవల్లనే గాక దెబ్బకు దెబ్బ తీర్చుకునే విస్ఫోటనాలతో జిల్లా అంతటా భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లుతుంది. విగ్రహాన్ని తప్పక తొలిగిస్తారనే వదంతులు ఈ రోజు బాగా ప్రబలటంతో హిందువులు ముస్లిముల ఆవాసాల పైకి వెడలి కొల్లగొట్టటం, నిప్పు పెట్టటం వంటి చర్యలకు పాల్పడేందుకు సిద్ధమయ్యారని తెలియవస్తుంది. ఒకవేళ అలా జరిగేట్లయితే అల్లర్లు చెలరేగే అన్నిచోట్లా ముస్లిముల ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోవటమే గాకుండా మన అధికారుల్ని వాళ్ల ఆస్తుల్ని కూడ రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు విగ్రహాన్ని తొలగించే చర్యను సమర్ధించే హిందువు కనీసం కాంగ్రెసు వాళ్లల్లో సైతం నాకు కన్పించటం లేదు. ఇటువంటి భావనలతో నిండిన ఈ పరిస్థితులలో మీరు చెప్పినట్లు చేయటం దట్టించిన ఫిరంగిపైన మండే అగ్గిపుల్లను ఉంచటం వంటిది. కనుక ఫలితాలను నేను సమబుద్ధితోనూ, సమర్ధనీయంగానూ ఊహించజాలను. 

అదీగాక ఈ జిల్లాలో అరుదైన పూజారి విషయం వదిలేయండి, కనీసం ఏదో పూజారి మనం ఎంతగా ప్రలోభపెట్టినా విగ్రహాన్ని తొలగించే క్రతువులో పాల్గొనేందుకు నాకు లభించడు. తప్పని పరిస్థితుల్లో ఈ క్రతువును నిర్వహించే వ్యక్తి కోసం వెతుకులాటలో కృపాల్‌సింగ్‌, నేనూ అయోమయ స్థితిలో పడిపోయాం. ఈ సమయంలో ప్రభుత్వానికి సాయపడేందుకు సిద్ధమయ్యే వాళ్ల ప్రాణాలకు, ఆస్తులకు హిందువులందరి దృష్టిలో తిలోదకాలిచ్చినట్లే. మా అన్వేషణలో జిల్లాస్థాయిలో పరిమితంగా వున్న వనరుల కారణంగా విజయవావకాశాలు కనుచూపు మేరలో కన్పించనందువల్ల హిందువులైన కమిషనరుగారు ఐ.జీ. గారు, డి.ఐ.జీ. గారు ఈ పని చేయగల వ్యక్తిని బయటి నుండి తెచ్చేందుకు సాయపడమని కోరాం. కావలసిన సాయమందించేందుకు వాళ్లు సిద్ధపడలేదు. మేము మా ప్రయత్నాలలో విఫలమైతే ప్రభుత్వం తగిన వ్యక్తిని చూచిపెట్టగలదనే విషయంలో నాసందేహాలు నాకున్నాయి. పైగా అర్హత గలిగిన పూజారి కొరకు వెతకితే అతను కాదంటే మనం మన ప్రయత్నాన్ని మానుకోవటమే-అతను కాదనేందుకే ఎక్కువ అవకాశం ఉంది. అయితే విగ్రహాన్ని ఏదో విధంగా ఎవరో ఒకళ్లతో తొలగించే కార్యక్రమాన్ని చేపడితే ఆగ్రహం, నిరసనల వెల్లువ కట్టలు తెంచుకొని జిల్లాను దాటిపోగలదు. అది సంబంధిత అధికారులనేగాక ప్రభుత్వాన్ని కూడ దూషిస్తూ కళంకితం గావించగలదు. పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించి శాంతియుతంగా రాజీ ధోరణితో పరిష్కారం కనుగొనే దానికంటే బలప్రయోగంతో పరిష్కరించటమే మేలని నిర్ణయించేందుకు ఒక గౌరవనీయ మంత్రిని ప్రభుత్వం పంపలేకపోయినట్లుంది. ప్రభుత్వానికి నా మనఃపూర్వక విన్నపమేమంటే బలప్రయోగంతో పరిష్కారాన్ని కనుగొనాలని చేసే ఏ ప్రయత్నాన్నయినా ప్రస్తుతం నెలకొన్న బలమైన తెగింపు భావనలు తప్పక భయంకర దుర్ఘటనలకు దారితీయగలవనే నా మాటను వినిపించుకుని ఆమోదించాలని.

పోలీసు సూపరింటెండెంట్‌ కూడ దీనిని అంగీకరిస్తున్నారు. మాకై మేము చొరవ తీసుకొని బల ప్రయోగంతో హిందువులను హింసకు పాల్పడకుండా, దోపిడీలకు దిగకుండా లొంగదీయటం అనేది జరిగే పనికాదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది మనకు ఎదురయ్యే ప్రశ్న. మసీదులో విగ్రహాన్ని ప్రతిష్ఠించటమనేది ముమ్మాటికి న్యాయసమ్మతం కాని చర్య. అది స్థానిక అధికారుల్నే గాక ప్రభుత్వాన్ని కూడ ఇరకాటం పెట్టింది. సాధ్యమైనంత వరకు త్యాగాలు, నష్టాల్లేకుండా యధాస్థితికి తెచ్చేట్లు చూడ ప్రభుత్వ పరిశీలనకు నేనొక పరిష్కార మార్గాన్ని సూచిస్తాను.

మసీదును జప్తు చేయాలి. దానిలోకి హిందువులను గాని, మహమ్మదీయులను గాని ప్రవేశింపనీయరాదు. అయితే పూజాదికాలు నిర్వహించేందుకు అతి తక్కువ సంఖ్య పూజారులను అనుమతించవచ్చును. పూజారుల సంఖ్య మూడు నుండి ఒకటికి మెల్లగా తగ్గించుకుంటూ పోయి మరో ప్రతిష్టంభన ఎదురవ్వకుండా చూచుకోవాలి. పూజారి విగ్రహం ముందు పూజలు నిర్వహించవచ్చు. భోగం సమర్పించవచ్చు. ఇదంతా లోపలే జరుగుతుంది. పూజారి గాని, పూజారులు గాని మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల మేరకే నియమింపబడుతారు. వాళ్ల వాళ్ల హక్కుల కోసం ఉభయవర్గాలు కోర్టుకెళ్లవచ్చు. సివిల్‌ కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేవరకూ దానిని ముస్లిములకు స్వాధీనపరచరాదు. నిజమే. ఇది బలవంతంగా దొంగచాటుగా జరిగిన ఒక అన్యాయపు ఆక్రమణను శాశ్వతీకరించబోతున్నదనీ, వెనువెంటనే అంతకుముందున్న స్థితిని అది నెలకొల్పజాలదనే విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ దానికి గల ఈ క్రింది ప్రశంసింపదగిన లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది.

1. సివిల్‌ దావాలో తీర్పు హిందువులపరమైతే అమిత బాధలు రక్తపాఠాలు దేశవ్యాపిత ప్రతిచర్యల్ని నివారించవచ్చు.

2. విషయం కోర్టులో నడుస్తూండగా ఏదయినారాజీ కోసం ప్రయత్నించవచ్చు (అది సాధ్యపడుతుందని నా నమ్మిక). ఈ విధమైన విశ్వాసంగల ముస్లిములు కొద్దిమందైనా వాళ్లకు మసీదును స్వచ్ఛందంగా వదలివేస్తే సమీపంలోనే మరో మసీదును అంతే విలువైన దానిని నిర్మించియిస్తామని నచ్చజెప్పవచ్చు. పరిస్థితి దాడులకు దారితీసిందా ముస్లిములు ఇందుకు కూడ అంగీకరించరు. పరిస్థితి ఎప్పటికప్పుడు దాడికి సిద్ధమన్నట్లుగా ఉంటుంది.

3. రాజీ కుదరక చివరకు కోర్టు ముస్లిముల పక్షాన తీర్పునిస్తే పరిస్థితి ఇప్పుడున్న దానికంటే ఏమీ దారుణంగా ఉండబోదు. అప్పటికి ఈ వేడి ఎంతో కొంత తగ్గిపోగలదు.

4.పూర్వపు స్థితిని వెంటనే పునరుద్ధరించలేకపోయిందనే నిందను ప్రభుత్వం భరించవలసి వచ్చినా విషయం కోర్టులో ఉండనే ఉందనే సాకును చూపవచ్చు. ఆస్తిని మేజిస్ట్రేట్‌ పరం చేశామని చెప్పవచ్చు. ఆయన అందులోకి హిందువులను గాని ముస్లిములను గాని ప్రవేశింపనీయరని చెప్పవచ్చు. పూర్వపు యథాస్థితిని సమకూర్చే విషయం ఆయన న్యాయపరమైన విజ్ఞతకు వదలివేస్తున్నామని చెప్పవచ్చు. నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదల్చుకున్నదేమంటే ప్రభుత్వం నుండి నాకు గాని, ఆ మేజిస్ట్రేట్‌కు గాని తిరిగి యథాస్థితిని పునరుద్ధరించమని ఆదేశాలు పంపటం న్యాయవిరుద్ధమవుతాయి. ఆ విషయంలో తుది నిర్ణయం ఆ మేజిస్ట్రేట్‌ చట్టపరమైన విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది. ఒక చట్ట సమ్మతం కాని చర్యకు పూనుకోరాదు-అదీ విషయం కోర్టు ముందున్నప్పుడు.

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo