బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - May 31, 2020 , 23:03:41

ఓరుగల్లు ఆత్మకథ

ఓరుగల్లు ఆత్మకథ

రాజకీయరంగానికి అతీతంగా ఒక దార్శనికుడైన మేధావి తన జీవన ప్రస్థానంలో ఎంతగా కృషిచేయగలడో ‘అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు’ విస్పష్టంగా పరిచయం చేస్తున్నది. ‘ప్రాణముండి బుద్ధి శరీరములు పనిచేసినంతవరకు సేవ చేయవలెననియే నా ఆశయము, అది ఈశ్వరేచ్ఛ’ అంటూ స్వీయచరిత్రములో రాశారు మాదిరాజు.

ఆనాటి హైదరాబాద్‌ సంస్థాన ఆధునిక చరిత్రలో కొంతమంది అతివాదులు. రావి నారాయణరెడ్డి, ముఖ్దూం మొహియుద్దీన్‌ వంటివారు ఈ వర్గం ప్రతినిధులు. మరికొందరు మితవాదులు. బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు తదిత రులు. ఈ కోవలో ప్రముఖులు మాదిరాజు రామకోటీశ్వరరావు. 

రాజకీయంగా మితవాదిగా ఉంటూనే నిర్మాణ అంశాల్లో కార్యవాదిగా ఎదిగిన రామకోటీశ్వరరావు నాటి వరంగల్లు నగర ప్రముఖుల్లో ఒకరు. గొప్ప న్యాయవాది, ధార్మిక దృష్టి కలిగిన మేధావి. రామకోటీశ్వరరావు ఆంధ్ర మహాసభల్లో అతివాదుల ఆధిక్యతను గట్టిగా నిరసించారు. ధర్మవరం ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. 1943లో హైదరాబాద్‌ ఆంధ్ర మహాసభల్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షుడిగా గెలిచేందుకు సహకరించారు. (అధ్యక్ష పదవికి తొలి పర్యాయం ఎన్నిక జరిగింది. వెంకటరంగారెడ్డి-బద్ధం ఎల్లారెడ్డి పోటీ పడ్డారు) మితవాదులు నిర్వహించిన మడికొండ ఆంధ్ర మహాసభల్లో అన్నీతానై పాల్గొన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన తర్వాత ఎందుకో ఏమో రామకోటీశ్వరరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1960 వరకు జీవించి ఉన్న మాదిరాజు పుష్కరకాలం పాటు (1948-1960) వరంగల్లు విద్యా వికాసానికి సమయం వెచ్చించి ఉంటారనుకోవాలి. 

రామకోటీశ్వరరావు యావత్‌ తెలంగాణకు బాగా గుర్తుండిపోయే పని ఒకటి చేశారు. అదే ఆత్మకథా రచన! మాదిరాజు రచించిన ‘అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు’ కలకాలం నిలువగలిగే విలువైన ఆత్మకథ. మాదిరాజు వారి మనువడు కృష్ణారావు (2017 ముద్రణలో) నాటి జ్ఞాపకాలను చెబుతూ,‘ఈ స్వీయచరిత్ర 60 సంవత్సరాల కిందట రాయబడినది. అప్పుడు నాకు సుమారు 15 సంవత్సరాల వయస్సు. స్వీయచరిత్ర రాసిన వ్రాత పేజీలు వరంగల్‌ చౌరస్తా యందున్న జయలక్ష్మీ ప్రింటింగ్‌ ప్రెస్‌ వారికి అచ్చువేయుటకు ఇచ్చి, వారు ఇచ్చిన అచ్చయిన ప్రూఫ్‌లు చూచుటకు నక్కలగుట్టకు తాతగారి స్వగ్రృహమునకు తీసుకువచ్చేవాడను. ఈ విధంగా 481 పేజీలు ఉన్న స్వీయచరిత్ర పూర్తి అగునంతవరకు తిరిగేవాడను’ అని రాశారు. విశేష శ్రమతో కూర్చిన తన స్వీయచరిత్రము పుస్తక రూపంలోకి రాకముందే మాదిరాజు కన్నుమూశారు. ఆయన కుమారులు ఎంతో బాధ్యతతో తండ్రిగారి ‘స్వీయచరిత్రము’ను ప్రచురించారు. ఇది 1960ల నాటి మాట. ఎందుకో ఏమో ఇంత మహత్తర స్వీయచరిత్రకు గతంలో కనీసస్థాయి గుర్తింపు రాలేదు! 

తెలంగాణ సాహిత్య అకాడమీ 2017 డిసెంబర్‌లో దీన్ని చక్కగా పునర్ముద్రించింది. ఇది అభినందించదగిన కృషి. మాదిరాజు మిత్రుడు ఒకనాటి హోంమంత్రి మందుముల నరసింగరావు అన్నట్టు ఈ స్వీయచరిత్ర భవిష్యత్తులో హైదరాబాద్‌ చరిత్రకారులకు ఎంతో ఉపయోగపడుతుంది. తొలుత రచయిత వంశం, తర్వాత న్యాయశాస్త్ర విద్య, అనంతరం గ్రంథాలయోద్యమంలో పాత్ర, వరంగల్లులో ఆయుర్వేద విద్యాపీఠం ఏర్పాటు తదితర అంశాలు ఆసక్తికరమైనవి.

నాటి హైదరాబాద్‌ సంస్థానంలో అటువైపు ఔరంగాబాద్‌, ఇటు వరంగల్లు జిల్లాలు అత్యంత విలక్షణమైనవి. సాంస్కృతిక వైభవంతో, సమకాలీన చైతన్యంతో నాడు తమ ప్రత్యేకతలను చూసిన జిల్లాలు ఇవి. వరంగల్లు వికాస క్రమం మాదిరాజు ఆత్మకథ ద్వారా అవగాహన అవుతోంది. సర్కారు ఉర్దూ మాద్యమానికి పెద్దపీట వేసిన సమయంలో వరంగల్లు ఖాన్గీ బడులు మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకు చేసిన కృషిని మాదిరాజు స్వీయచరిత్ర విపుల రీతిలో వివరించింది. ఇంకా మూసీనది వరద బీభత్సం, నాటి న్యాయవాద విద్య, గ్రంథాలయాల ఏర్పాటులో ఒక సాంస్కృతిక కార్యకర్త శ్రమించిన తీరు, ఆయుర్వేద కళాశాల ఏర్పాటు కోసం జరిపిన ప్రయత్నాలు వివరంగా పరిచయమవుతాయి. రాజకీయరంగానికి అతీతంగా ఒక దార్శనికుడైన మేధావి తన జీవన ప్రస్థానంలో ఎంతగా కృషిచేయగలడో ‘అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు’ విస్పష్టంగా పరిచయం చేస్తున్నది. ‘ప్రాణముండి బుద్ధి శరీరములు పనిచేసినంతవరకు సేవ చేయవలెననియే నా ఆశయము, అది ఈశ్వరేచ్ఛ’ అంటూ స్వీయచరిత్రములో రాశారు మాదిరాజు. ఆయన ఆశయం వలెనే ఆయన జీవితం కొనసాగిందని సమకాలీనుల జ్ఞాపకాలు చెబుతున్నాయి.

- డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 

9866917227


logo