శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 14, 2020 , 22:56:09

జీవన విధానం మారాల్సిందే

జీవన విధానం మారాల్సిందే

నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చెట్లు పుట్టలు ప్రకృతి దేనినుంచైనా నేర్చుకోవచ్చు. కరోనా మనకు జీవితానికి ఉపయోగపడే ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్పిస్తున్నది. ప్రభుత్వాలు, ప్రజలు ఎవరికైనా ఆర్థిక అంశాలపై స్పష్టత ఉండాలి. రేపటికోసం ఆలోచన ఉండాలి. లాక్‌డౌన్‌ వల్ల చాలామందికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. జీతం కావచ్చు, ఆదాయం కావచ్చు మనకు వచ్చేదానిలో 50శాతంగానే భావించి మన జీవన విధానాన్ని అలా మార్చుకొంటేనే మనుగడ. రూపాయి సంపాదిస్తే 50పైసలు ఖర్చుచేసేవారు ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొని నిలబడగలరు. జీతం మించి ఖర్చుచేసేవారికి సమస్యలమయమే.

అందరూ బాధ్యతాయుత పౌరులుగా నిరూపించుకోవాల్సిన సమయమిది. ఖర్చుల విషయంలో దుప్పటి ఎంతవరకు ఉందో కాళ్లు అంతవరకే చాపుకోవాలి అని మన పూర్వీకులు చెప్పిన మాటలను గుర్తుచేసుకోవడమేకాదు ఆచరించాలి. ప్రభుత్వాలు, ప్రజలు ప్రతిఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. 

మనం రెండునెలలపాటు లాక్‌డౌన్‌ జీవితానికి అలవాటుపడ్డాం. అవసరమైనవాటికి మాత్రమే ఇక ఖర్చుచేయడం అలవాటు చేసుకోవాలి. వృథా ఖర్చు ఎక్కడ అవుతున్నదనే అవగాహన ఇప్పటికే వచ్చి ఉండాలి. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌ లాంటి దేశాలే కరోనా తెచ్చే ఆర్థిక సంక్షోభంతో బెంబేలెత్తిపోతున్నాయి. 

కరోనా నష్టంపై ఇప్పటివరకు ఒక కోణం మాత్రమే చూశాం. ఎంతమందికి కరోనా సోకింది, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది చికిత్స తర్వాత కోలుకున్నారు అనేది మొదటి దశలో తేలే అంశాలు. రెండోదశలో ఇంతకుమించిన ప్రమాదాన్ని చూడబోతున్నాం. ఆర్థికరంగం కుప్పకూలబోతున్నది. ప్రజలకు పనులు ఉంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ప్రభుత్వాలకు పన్నులు వస్తాయి. ఆ పన్నులతోనే రాష్ర్టాలకు, కేంద్రానికి నిధులు చేరుతాయి. రెండునెలలుగా లాక్‌డౌన్‌ వల్ల పనులు లేవు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రజలవద్ద డబ్బులు లేవు. ఈ చక్రం ఒకచోట నిలిచిపోతే అన్నిచోట్ల పరిస్థితి అలాగే నిలిచిపోతుంది. 

ప్రభుత్వాలు ఎక్కువరోజులు లాక్‌డౌన్‌ అమలుచేయడం సాధ్యంకాదు. ఉద్యోగులకు ఇంట్లోనే ఉంటే గడిచిపోతుందేమోగానీ వారి సంఖ్య చాలా స్వల్పం. చిన్న వ్యాపారులు, వృత్తిపనులు చేసేవారు, కూలీలు ఎక్కువరోజులు పనిలేకుండా ఉండలేరు. పైవేట్‌ రంగంలో ఆదాయం ఉంటేనే యజమాని జీతాలు చెల్లించగలడు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌లో ఉన్నాం. కంపెనీలు మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటిలో లాక్‌డౌన్‌ రోజులు పదిరోజులు మాత్రమే ఉన్నాయి. ఆ పదిరోజులకే ఫలితాలపై ప్రభావం కనిపిస్తున్నది. 

ఏప్రిల్‌, మే పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్నాం. రెండో త్రైమాసిక ఫలితాలప్పుడు హాహాకారాలు తప్పవు. ఇప్పటికే స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత మద్యం షాపులకు అనుమతి ఇస్తే మొదటిరోజు మాత్రమే క్యూలు కనిపించాయి. రెండురోజుల తర్వాత ఒకరిద్దరు కూడా కనిపించడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు సగం అమ్మకాలు కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు. జనం దగ్గర డబ్బులు లేకపోవడమే దీనికి కారణం. 

దేశంలో కరోనాకు ముందు ఎస్బీఐ కార్డు రెండువందల కోట్లకుపైగా ఆదాయం గడిస్తే కరోనా తర్వాత      అదేకాలానికి 60 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కరోనాసంక్షోభం కోసం అంటూ పెద్దమొత్తంలో నిధులు రిజర్వ్‌లో పెట్టారు. దీన్నిబట్టి ఆర్థికసంస్థల పనితీరు ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. బ్యాంకులు ఎన్ని ఉంటాయో ఎన్ని దెబ్బతింటాయో తెలియదు. చిన్న పరిశ్రమలే కాదు భారీ పరిశ్రమల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తున్నది. 

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత బతుకుపోరాటం మొదలవుతుంది. 30కోట్ల జనాభా ఉన్న అమెరికాలోనే కరోనా దెబ్బతో నిరుద్యోగభృతి కోసం మూడుకోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారంటే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? వీరికితోడు అనేకదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడ అవకాశాలు తగ్గితే మన దేశానికి తిరిగి వస్తే ఎలా ఉంటుంది? ప్రధానంగా గల్ఫ్‌ దేశాల్లో మనవాళ్ల్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. 2008లో అమెరికాలో ఆర్థికసంక్షోభం వచ్చినప్పుడు మనదేశంపై ముఖ్యంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంపై చాలా ప్రభావం పడింది. అప్పుడు ఎక్కువగా ఐటీ ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కనిపించింది. కానీ ఇప్పుడు సమస్య మరింత విస్తృతమవుతుంది. 

ఇలాంటి దురదృష్ట వాతావరణంలో కూడా ఒకరకంగా మనం అదృష్టవంతులమే. ఐటీ ఎగుమతుల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. ఐనా దృష్టి మొత్తం ఐటీరంగానికే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో తెలంగాణ విజయం సాధించింది. ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కొందరు మేధావులు వృథా అన్నారు, కేసులు వేశారు. గొర్రెలు పంచితే, చెరువుల్లో చేపపిల్లలను వదిలినా విమర్శకులు వదిలిపెట్టలేదు. ఇవే ఇప్పుడు గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేశాయి. ఈ సంక్షోభం తీవ్రమైనదైనా మన గ్రామాలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొని నిలబడగలమనే భరోసా కలుగుతున్నది. గ్రామాల్లో పచ్చనిపొలాలు, కాలువల్లో కనిపిస్తున్న జలాలు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాయి. 

కరోనా పుణ్యమాని ఏ రంగంలో కూడా ఉద్యోగాలు సేఫ్‌ అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచం పోకడలను వివరించి ప్రజలను చైతన్యపరిచే మీడియా భవిష్యత్తే ఇప్పుడు ప్రమాదంలో పడింది. వ్యవసాయరంగం మినహా అన్ని రంగాలు కరోనా బారిన పడ్డాయి. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో, ఓ దేశానికో వచ్చిన సంక్షోభం కాదు. మొత్తం ప్రపంచాన్ని సర్వమానవాళిని ప్రమాదంలోకి నెట్టివేసిన సంక్షోభం ఇది. 

హక్కులతోపాటు బాధ్యతలు ఉంటాయనే విషయం ఇప్పుడందరూ గుర్తుంచుకోవాలి. అందరూ బాధ్యతాయుత పౌరులుగా నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రజలిప్పుడు ఈఏంఐల జీవితానికి స్వస్తి పలకాలి. తప్పనిసరి ఖర్చులకే పరిమితం కావాలి. దుప్పటి ఎంతవరకు ఉందో కాళ్లు అంతవరకే చాపుకోవాలి అని మన పూర్వీకులు చెప్పిన మాటలను గుర్తుచేసుకోవడమేకాదు ఆచరించాలి. ప్రభుత్వాలు, ప్రజలు ప్రతిఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కరోనా నేర్పిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ పాఠాలు నేర్చుకొని సంక్షోభాల నుంచి బయటపడదాం. 


logo