శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 23, 2020 , 23:39:06

జొన్నకంకి

జొన్నకంకి

ఇవ్వాళ

మా ఎర్రచెల్కలోని

జొన్నకంకుల గూర్చి మాట్లాడుతాను.

నీళ్లు పారకుంటే నేమి..

మేఘాలను ధిక్కరిస్తున్నట్టు

పైపైకి చూస్తున్నాయి

నాటిన ఒక్క విత్తనం

భూమి పొరల్తో పోరాటం చేసి

దోసెడు ముత్యాలతో బయటపడింది.

జొన్నకంకితో నా అనుబంధం

ఎన్నటికీ తరగని ఆనందం.

దాని తురాయి

సైనికుడి తుపాకీ మొనమీద

నిలిపిన టోపీ లాగుంది.

నోరూరే దోర దోర పిస్కిళ్ళూ

పజ్జొన్న గటుకా.

ఎప్పటికీ మరపురాని గుటకలే.

కంకులను ఒలుచుకు తింటున్న

పిట్టలను వెల్లగొట్టబుద్దయ్యేది కాదు

వాటి హక్కును వినియోగించుకోగా

మిగిలిందే మాకు

హక్కులన్నప్పుడు

కంకి కొడవలిని కలిపిన

వామపక్ష ఉద్యమాలు

నా ఎర్రెరని జ్ఞాపకాలు.

ఇప్పటికీ

మీరెవరైనా మా ఇంటికొస్తే

మంగళం పెంకల ఏంచిన

పజ్జొన్న పేలాలు మీ దోసిట్లో పోస్తాను

అంతకన్నా ఫలహారం

ఇంకేముంటుంది.

జొన్నకంకి నా బాల్యం

జొన్నకంకి నా కవిత్వం

తెలంగాణ తల్లి సొగసయిందే..

కానీ ఆమె చేతిలో వెలిగే జొన్న కంకి

ఇంకా అందమయ్యింది.

జొన్నకంకి

మెట్టపొలాల్లో వెలిసిన

జానపద జాణ

తెలంగాణను అభిషేకించే

రతనాల వాన..

- నాంపల్లి సుజాత


logo