మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 03, 2020 , 23:20:46

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష

దొంగతనాలు, దోపిడీలు, అక్రమ సంపాదనలు, అరాచక శక్తుల విజృంభణకు, తీవ్రవాదానికి దారితీస్తున్నది. వీటన్నిటికి పరిష్కారం ఉపాధి కల్పన, నైపుణ్యాల పెంపు. అందుకు నాణ్యమైన కేజీ టు పీజీ ఉచిత గురుకుల విద్య. ఈ విషయాలు తెలిసికూడా ఆచరించకపోవడమే కేంద్ర బడ్జెట్‌లో స్పష్టంగా గమనించవచ్చు. ఆయుధాలు కొనుగోలుకు లక్షన్నర కోట్లు ఎందుకో అర్థం కాదు. సుప్రసిద్ధ అర్ధశాస్త్రవేత్త పద్మభూషణ్‌ సీకే ప్రహ్లాద్‌ ‘ఫార్ట్యూన్స్‌ ఎట్‌ ది బాటవ్‌ు ఆఫ్‌ పిరమిడ్‌' గ్రంథంలో చెప్పిన విషయం గుర్తుచేస్తాను. గత రెండు వందల ఏండ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సైన్స్‌ టెక్నాలజీ, మార్కెటింగ్‌ అంతా 600 కోట్ల ప్రజల్లో 200 కోట్ల ప్రజలకే అందుతున్నది. ఇంకెంత అభివృద్ధి చెందినా మూడింట రెండు వంతుల ప్రజలు ప్రపంచంలో పేదలుగానే కొనసాగుతుంటారు.

కేంద్ర బడ్జెట్‌ ఒక చిల్లికుండ బడ్జెట్‌. పైనుంచి నీళ్లు పోస్తుంటే కింది నుంచి ఆ చిల్లి ద్వారా కారిపోతుంటాయి. ప్రజలనుంచి వసూలుచేసి కుండ నింపుతుంటే చిల్లి ద్వారా పారిశ్రామికవేత్తలకు, భారీ ఎగవేతదారులకు బ్యాంకులకు తరలిస్తున్నది. అత్తగారి సొమ్ము కొత్త కోడలు తల్లిగారింటికి జారగొట్టినట్టు పారిశ్రామిక వర్గాలకు, మార్వాడి, గుజరాతీ వ్యాపార, వాణిజ్యవేత్తలకు, ఎగవేతదారులకు, ఎగవేయడానికి సహకరించిన బ్యాంకులకు రూ.లక్షల కోట్లను ధారాదత్తం చేస్తున్నది. కార్పొరేట్‌ పన్ను వసూలు పద్ధతిని మార్చడం ద్వారా మరో రూ.25 వేల కోట్లు వారికి ప్రయోజనం చేకూర్చుతున్నది. రాష్ర్టానికి కేంద్రంలో రావలసిన 41-1 శాతం తగ్గించడం జరిగింది. 30 లక్షల కోట్ల బడ్జెట్‌లో 18 శాతం వడ్డీలు చెల్లించడానికి వెళ్ల్లిపోతుంది. ఇక్కడ వివరించడం వీలు కాదుగానీ, ముప్ఫై లక్షల కోట్ల బడ్జెట్‌ వాస్తవంలో అది 20 లక్షల కోట్ల బడ్జెటే. గత బడ్జెట్‌ కేటాయింపునకు, ఖర్చు కు వ్యత్యాసం ద్వారా దీన్ని గమనించవచ్చు. అలాగే లోటు బడ్జెట్‌ అనేది కూడా దీన్ని స్పష్టం చేస్తున్నది.


బడ్జెట్‌ ప్రతిపాదనలో ఒక కొత్త అంశం యువతరానికి సంబంధించింది గమనించడం అవసరం. కిందిస్థాయి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకు అనేక పరీక్షల స్థానంలో కామన్‌ పరీక్ష ఒక్కటే నిర్వహించే ప్రతిపాదన చాలా ముఖ్యమైనది. ఉద్యోగ పరీక్షల భారం బాగా తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాల వారికి మొదటితరం విద్యావంతులకు సమాచారం అందక కోల్పోతున్న ఉద్యోగావకాశాలు ఈ కామన్‌ పరీక్షల ద్వారా అందుకునే అవకాశం పెరుగుతుంది. బ్యాంకులు, ఎల్‌ఐసీలు, రైల్వే, టెలిఫోన్స్‌ తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే పరీక్షతో ఎంపిక చేసుకోవడం ద్వారా అటు యాజమాన్యాలకు, ఇటు యువతరానికి బరువు బారాలు తగ్గి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బ్యాంకు, బ్యాంకులు, బీమా కంపెనీలు, రైల్వే తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగాలను ఒకే పరీక్ష పరిధిలోకి తీసుకురావాలి. దాంతోపాటుగా గ్రూప్‌-1 అన్ని శాఖల పోస్టులను కూడా ఒక పరీక్షతో ఎంపిక చేసుకొని ఆయా శాఖల వారీగా తమ అవసరాల మేరకు శిక్షణ ఇచ్చుకోవచ్చు. తద్వారా ఏటా ఉద్యోగ సమాచారం అందుబాటులోకి వస్తుంది.

తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులను అమ్ముకు తిన్నట్టుగా దశాబ్దాల తరబడి ఎంతో జాగ్రత్తగా పెంచిపోషిస్తూ వస్తున్న ప్రభుత్వ సంస్థలను అమ్మడమనేది ఏ రీతిలోనూ సానుభూతిగా అర్థం చేసుకోవడం కష్టం. 


ఇన్స్యూరెన్స్‌ కంపెనీలను, బ్యాంకులను, భారీ పరిశ్రమలను జాతీయం చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆశించారు. అలా సోవియట్‌ యూనియన్‌ పంథాలో ప్రభుత్వ యాజమాన్యంలో స్థాపించడం, అదుపులోకి తెచ్చుకోవడం జరిగింది. అలా ఒక గొప్ప సంస్థగా ఎదిగిన ఎల్‌ఐసీని అమ్మివేయడానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం శోచనీయం. ఎల్‌ఐసీ విశ్వసనీయత దీనివల్ల బాగా దెబ్బతింటుంది.

లెక్కల పద్దుల వివరాలను పక్కనబెట్టి ఈ బడ్జెట్‌ ద్వారా జరిగిందేమి టో గమనించాలి. కొన్నేండ్లుగా కావాలని అప్పులు తీసుకొని, కావాలని ఎగవేస్తున్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు, అందుకు సహకరిస్తున్న బ్యాంకు యాజమాన్యాలు, ప్రజల డిపాజిట్లను వారి చేతుల్లో పెడుతున్నారు. బ్యాంకు డిపాజిటర్లకు నమ్మకం కలుగాలనే పేరుతో, బ్యాంకులు మునగకూడదనే పేరుతో ఇప్పటికే బ్యాంకులకు సుమారుగా రూ.12 లక్షల కోట్లను కేంద్రం సహాయం అందిస్తున్నది. మరోవైపు ఆర్‌బీఐ నుంచి కేంద్రం నిధులను లాక్కుంటున్నది. ఒకవైపు ఎగవేతదారులు పెరుగుతుంటే, వాటిని వసూలు చేయకపోవడ గమనించవచ్చు.


ఇలా ప్రజా సొమ్మును బ్యాంకుల నుంచి సేకరించి, ఎగవేసి ఆ డబ్బు ను మరో రూపంలోకి మార్చి, ప్రభుత్వం అమ్ముతున్న సంస్థలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అలా ఇన్స్యూరెన్స్‌ కంపెనీలైతేనేమి, నవరత్నాలైతేనేమి, ప్రజల డిపాజిట్లను కొల్లగొట్టిన డబ్బుతో కొని ప్రైవేటీకరిస్తున్నారు. ఇలా ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నును పరిశ్రమలకు రాయితీల పేరిట సహాయ, సహకారాలు అందిస్తున్నారు. అలా పై నుంచి నీళ్లు వస్తే చిల్ల్లుగుండా కొన్ని సామాజికవర్గాలకు అందిస్తున్న కుండగా బడ్జెట్‌ మారిపోతూ వస్తున్నది. నాణ్యమైన పాఠశాల విద్యను, ఉన్నత విద్యను పేదలకు అందించడాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వ్యయభారం పెంచి కొందరికే అన్ని అవకాశాలు అందేవిధంగా బడ్జెట్‌ రూపొందిస్తున్నారు. జేఎన్‌యూ వంటి విద్యాసంస్థల ఫీజులు పెంచటం, విద్యార్థులు అందుకు వ్యతిరేకంగా ఉద్యమించడం ఈ సందర్భంగా గమనించవచ్చు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒక లక్షా ఇరువై ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇది కదిలిస్తే కుంభకోణాలమయంగా తీరుతుంది. దీనికి బదులుగా ఆసరా పింఛన్‌, స్వచ్ఛంద సేవా గౌరవ వేతనం పేరిట ప్రతి నెలా ఇవ్వడం ద్వారా దానికి ఒక లెక్క ఉంటుంది. ఒక ఉద్యో గభద్రత కలిగినట్టుగా ప్రజలు భావిస్తారు. ఎవరికైతే ప్రస్తుతం లబ్ధి అం దుతున్నదో వారినే ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాలు లింకు ద్వారా ఈ పథకానికి రూపకల్పన చేయవచ్చు. అందుకు తెలంగాణలో, ఏపీలో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసి రూపకల్పన చేయవచ్చు. 


బ్యాంకులకు 2.5 లక్షల కోట్లు ఇచ్చే బడ్జెట్‌ను గనుక విద్యారంగానికి కేటాయిస్తే కేజీ టూ పీజీ గురుకుల విద్యారంగం ద్వారా భారతదేశాన్ని 5, 10 ఏండ్లలోనే గొప్ప విద్యావంతమైన దేశంగా మార్చడానికి శ్రీకారం చుట్టవచ్చు. ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య దాకా పేదలకు, మధ్య తరగతికి రెసిడెన్షియల్‌ ఉచిత విద్య అందించే ప్రయత్నం చేస్తే ప్రపంచం లో అత్యధిక విద్యావంతులున్న దేశంగా ఎదుగుతుంది. సంపద సృష్టి, నైపుణ్యాల పెంపుదల ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఈ దృష్టి లోపించడం వల్ల నిరుద్యోగుల భారం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు భరించాల్సి వస్తుంది. దొంగతనాలు, దోపిడీలు, అక్రమ సంపాదనలు, అరాచకశక్తు ల విజృంభణకు, తీవ్రవాదానికి దారితీస్తున్నది. వీటన్నిటికి పరిష్కారం ఉపాధి కల్పన, నైపుణ్యాల పెంపు. అందుకు నాణ్యమైన కేజీ టు పీజీ ఉచిత గురుకుల విద్య. ఈ విషయాలు తెలిసికూడా ఆచరించకపోవడమే కేంద్ర బడ్జెట్‌లో స్పష్టంగా గమనించవచ్చు. ఆయుధాలు కొనుగోలుకు లక్షన్నర కోట్లు ఎందుకో అర్థం కాదు. ఇతర దేశాల ఆయుధ ఉత్పత్తి దారులకు లాభం చేసి, మధ్యలో కమీషన్లు పోగేసుకోవడానికి ఇది రాచబాట. 1920లలో మన దేశంలోనే మన ఆయుధాలు తయారు చేసుకోవాలి.


 అమెరికా రాజ్యాంగ సవరణ చేసుకున్నది. మనం వందేండ్ల తర్వాతైనా ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చేసుకోవడం అవసరం. వంద ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టిస్తున్న భారతీ య శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తే అత్యున్నతమైన ప్రమాణాల తో మన ఆయుధాలను మనమే తయారు చేసుకోవచ్చు. దీంతో ఉపాధి కల్పన పెరుగుతుంది. సైంటిస్టులు పెరుగుతారు. మొత్తంగా చూసినప్పుడు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని, మోసం, దగా, కుట్ర చేసిందని కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించడం ద్వారా ఎంత నష్టం జరిగిందో ఊహించుకోవచ్చు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను ఈ బడ్జెట్‌ మరోసారి నిరూపిస్తున్నది. సుప్రసిద్ధ అర్ధశాస్త్రవేత్త పద్మభూష ణ్‌ సీకే ప్రహ్లాద్‌ ‘ఫార్ట్యూన్స్‌ ఎట్‌ ది బాటవ్‌ు ఆఫ్‌ పిరమిడ్‌' గ్రంథంలో చెప్పిన విషయం గుర్తుచేస్తాను. గత రెండు వందల ఏండ్లుగా జరుగుతు న్న అభివృద్ధి, సైన్స్‌  టెక్నాలజీ, మార్కెటింగ్‌ అంతా 600 కోట్ల ప్రజల్లో 200 కోట్ల ప్రజలకే అందుతున్నది. ఇంకెంత అభివృద్ధి చెందినా మూడిం ట రెండు వంతుల ప్రజలు ప్రపంచంలో పేదలుగానే కొనసాగుతుంటా రు. అందువల్ల నేటి విధానాలను, ప్రణాళికలను, బడ్జెట్‌ రూపకల్పనలను సమూలంగా మార్చే దృష్టికోణం అవసరం.

బి.ఎస్‌.రాములు


logo
>>>>>>