హిమాయత్‌నగర్ : వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఏస్ పరిదిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరు ణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన నిధా రెహమాన్ (34) కూకట్‌పల్లిలోని ఓ ఐటీ కంపెనీలో టెలికాలర్‌గా పని చేస్తుంది.
యూసుఫ్‌గూడలో ఉండే స్నేహితుడు షాబాజ్‌ను కలిసి వస్తానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి శుక్రవారం రాత్రి 10:45 నిమిషాలకు ఏపీ 11 ఎకే 5704 నెంబర్ గల ద్విచక్రవాహనంపై బయలుదేరింది.11:20కి కింగ్‌కోఠి ఈడెన్ గార్డెన్ వద్దకు రాగానే ఆమె వెనుక నుంచి అతివేగంగా దూసువచ్చిన వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో నిధా రెహమాన్ క్రింద పడిపోవడంతో ఆమె తలపై నుంచి వాటర్ ట్యాంకర్ వెనుక టైరు వెళ్లడంతో తల చిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
నిధా రెహమాన్ హెల్మెంట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మహ్మద్ రఫీక్ అతివేగం, నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన మహ్మద్ రఫీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం మృతదేహనికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు నిధా రెహమాన్ తండ్రి లతీఫ్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.