సూర్యాపేట, డిసెంబర్ 15 : రైతన్నకు 8వ విడుత రైతు బంధు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో 2,62,911 మంది రైతులకు రూ.313.65 కోట్ల పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో నమోదు కానున్నది. గడిచిన 7 విడుతలుగా జిల్లా రైతులకు రూ.1791.68 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. 8వ విడుతలో పెట్టుబడి సాయం రూ.2,100 కోట్లు దాటనున్నది. ఈ ఏడాది యాసంగికి గానూ అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా అతి త్వరలోనే పెట్టుబడి నగదు అందనున్నది.
కరోనా సమయంలోనూ..
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2018వానకాలం సీజన్లో శ్రీకారం చుట్టింది. 2019 సంవత్సరానికి ముందు ఎకరానికి 4వేలు అందించగా ఆ తర్వాత రూ.5 వేలకు పెంచింది. గడిచిన 7 విడుతల్లో సాగు సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా, లాక్డౌన్ కారణంగా ఆదాయం తగ్గిపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును కొనసాగించింది.
సమైక్య పాలనలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని తిరిగి నిలబెట్టాలన్న లక్ష్యంతో స్వరాష్ట్రంలో ప్రారంభించిన రైతు పథకాల్లో కీలకమైనది రైతుబంధు. ప్రతి సీజన్ ప్రారంభంలో ఎకరాకు 5వేల రూపాయల చొప్పున పంటకు పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే ఏడుసార్లు రైతుబంధు డబ్బులు అందగా, తాజాగా ఈ యాసంగిలో పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దాంతో త్వరలోనే రైతుబంధు డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. గడిచిన 7 విడుతలుగా జిల్లా రైతులకు రూ. 1791.68 కోట్ల పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఈ యాసంగిలో సుమారు 2,62,911 మంది రైతులకు రూ.313.65 కోట్లు అందించనున్నట్లు అంచనా. జిల్లాలో రైతు బంధు సాయం రూ.2,100 కోట్లను దాటనుండగా, రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.