
భువనగిరి కలెక్టరేట్ ఆగస్టు 16: తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ దీపక్‌తివారీతో కలిసి ఆమె మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణకు హరితహారం లో భాగంగా 30లక్షల మొక్కలు నాటే లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 22లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మిగిలిన 8లక్షల మొక్కలను మున్సిపల్ కమిషనర్లు, అధికారులు వారంలోగా నాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కూడా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఫొటోలు తీసి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజువారీగా చేపట్టిన ప్లాంటేషన్‌ను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా అటవీశాఖ అధికారిని కోరారు. మోత్కూరు మున్సిపాలిటీలో 5200 మొక్కల లక్ష్యానికిగాను 103 శాతం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11,900 మొక్కలకుగాను 101 శాతం, ఆలేరు మున్సిపాలిటీలో 5420మొక్కల లక్ష్యానికిగాను 95శాతం, పోచంపల్లి మున్సిపాలిటీలో 23,680లక్ష్యానికిగాను 96శాతం లక్ష్యం సాధించినట్లు మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్‌కు వివరించారు. గూగుల్‌మీట్‌లో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, డీపీవో, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యానశాఖ అధికారి, జిల్లా పరిశ్రమలశాఖ, ప్రొహిబీషన్ ఎక్సై జ్, విద్య, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’లో స్వీకరించే అర్జీలకు త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మండలాలకు చెందిన అర్జీదారుల నుంచి పలు సమస్యలపై వినతులను ఆమె స్వీకరించి మాట్లాడారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ‘ప్రజావాణి’ అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా 45 అర్జీలను స్వీకరించారు.