చౌటుప్పల్, జనవరి 5 : సీఎం కేసీఆర్ ధర్నాతోనే వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, 8విడతల్లో ఇప్పటి వరకు రూ.50వేల కోట్లు పెట్టుబడి సాయం అందించారని కొనియాడారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రం అనేక కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, కోట్లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ప్రధాని చెప్పిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగ కల్పనకు బదులు పీఎం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన 100శాతం జీఎస్టీలో కేవలం 42శాతం వెనక్కి ఇచ్చారన్నారు. మత కల్లోలాలు సృష్టించడం, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ రాష్ట్రంలో బీజేపీ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఇప్పటికే 1.34లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తుచేశారు. ఈ నెల 10న అన్ని గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, ఎడ్లబండ్ల ర్యాలీలతో రైతుబంధు సంబురాలు అట్టహాసంగా నిర్వహించాలని కోరారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యలో రాష్ట్ర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కస్తూర్బా పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి
కస్తూర్బా పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు స్థానిక కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వేస్తున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిర్కటి నిరంజన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్‌యాదవ్, నాయకులు స్వామిగౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, బోరెం నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.