
మునిపల్లి, డిసెంబర్ 16 : వోక్సెన్ యూనివర్సిటీ వండర్‌ఫుల్‌గా ఉందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. గురువారం సంగారెడ్డి సమీపంలోని మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో ఉన్న వోక్సెన్ యూనివర్సిటీలో ఐకానిక్ బ్లూమ్‌బెర్గ్ ఫైనాన్స్ ల్యాబ్, లైబ్రరీ, మెగా స్టోర్స్ ఎరీనా, హైటెక్ అకాడమిక్ బ్లాక్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ రోబోటిక్స్ ల్యాబ్‌లో రోబోలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మొదట యూనివర్సిటీ పేరు విన్నప్పుడు అర్థం కాలేదని, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ యూనివర్సిటీ ఎంత అద్భుతమైనదో తెలిసిందన్నారు. ఇక్కడ పరిశోధనలపై దృష్టి పెట్టడం బాగా నచ్చిందన్నారు. మారుమూల గ్రామం కంకోల్లో యావత్ దేశంలోనే నంబర్ వన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇది తెలంగాణ రాష్ర్టానికి ఓ గొప్ప వరం అని కొనియాడారు. యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న 1200మంది విద్యార్థులు ప్రతి ఒక్కరూ ముందుగానే ఓ లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తూనే, బిజినెస్ రంగంలో ఏ విధంగా రాణించాలో విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను మంత్రి కేటీఆర్ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులు గొప్పస్థాయికి చేరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వోక్సెన్ బిజినెస్ యూనివర్సిటీ చైర్మన్‌పై మంత్రులు పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ విద్యార్థులను ఇతర దేశాలకు పరిచయం చేసి, బిజినెస్ రంగంలో మొదటి స్థానంలో ఉంచడమే తమ లక్ష్యమని యూనివర్సిటీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ పూల అన్నారు. అంతకు ముందు క్యాంపస్‌కు వచ్చిన మంత్రులకు ఘనస్వాగతం పలికారు. మొదట క్యాంపస్ ఆవరణలో మంత్రి కేటీఆర్ మొక్క నాటారు. సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మునిపల్లి ఎంపీపీ, జడ్పీటీసీలు సన్మానించారు. యూనివర్సిటీ విద్యార్థిని, విద్యార్థులతో మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మొదటిసారి క్యాంపస్‌కు వచ్చిన మంత్రితో ఇతర దేశాల విద్యార్థులు పోటీ పడి మరీ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మునిపల్లి ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ మీనాక్షి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సతీష్, ప్రధానకార్యదర్శి శశికుమార్, రాష్ట్ర నాయకులు సాయికుమార్, సర్పంచ్‌లు విశ్వనాథం పాటిల్, రమేశ్, అశోక్, విజయభాస్కర్ తదితరులు ఉన్నారు.