
మెదక్ రూరల్, డిసెంబర్ 23 : ఏది కల్తీ.. ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. కష్టపడి కొనుగోలు చేసిన ప్రతి వస్తువు సరైన ధర, తూకం, నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటారు. కానీ, ప్రస్తుతం అంతటా మోసాలు పెరిగిపోయాయి. తాగే నీళ్లు, పాలు కూడా కల్తీ అవుతున్నాయి. తూకాల్లో భారీ తేడాలుంటున్నాయి. పలుచోట్ల ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. వీటన్నింటిపై ఎవరిని ప్రశించాలి, నిలదీయాలో చాలామందికి అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో బాధితులు ధైర్యం చేసి పోరాడితే తప్ప న్యాయం జరగడం లేదు. అయితే, ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాలి, హక్కులపై అవగాహన పెంచుకుని తమని తాము రక్షించుకోవాలి. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భగా ప్రత్యేక కథనం వినియోగదారుల హక్కులు .. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 1986లో రూపొందించిన చట్టం 1987, డిసెంబర్, 24 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఈ రోజును జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకొంటారు. కాలానికి అనుగుణంగా పలు మార్పులు చేసి, 2019న రాష్ట్రపతి అనుమతితో భారత ప్రభు త్వం చట్టం చేసింది. ఈ చట్టం 2020 జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
వివిధ స్థాయిల్లో కమిషన్ల ఏర్పాటు
వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ స్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కమిషన్లు పనిచేస్తున్నాయి. ఫోరం స్థానంలోనే జిల్లా వినియోగదారుల కమిషన్, జాతీయ వినియోగదారుల కమిషన్‌గా పనిచేస్తున్నాయి.
2019నూతన చట్టంలోని అంశాలు …
ఒక వస్తువు ఏ ప్రదేశంలో కొనుగోలు చేసినా, తాము నివాసముంటున్న న్యాయస్థానం పరిధిలో ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చు. జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత బాధితుడు, ప్రతివాదుల మధ్య మధ్యవర్తిత్వం నడిపి వివాదాలను పరిష్కరించేందుకు కృషిచేస్తారు. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును 45రోజుల లోపల రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు. జిల్లా కమిషన్ తీర్పును అనుసరించి వ్యాపారి, విక్రయదారుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది. ఫిర్యాదులను టైపింగ్ లేదా రాతపూర్వకంగా దాఖలు చేయవచ్చు. వస్తువులను విక్రయించిన వారు, డీలర్, ఉత్పత్తిదారులు ఇందులో బాధ్యులవుతారు.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ …
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కమిషన్‌తో పాటు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ చట్టంలో ముఖ్యమైన భాగం. ఆన్లైన్, ఈ మొయిల్ ద్వారా నేరుగా సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ పరిష్కరించిన కేసును జాతీయ కమిషన్‌లో మాత్రమే అప్పీల్‌కు అవకాశం ఉంటుం ది. జిల్లా, రాష్ట్ర. జాతీయ కమిషన్లతో సంబంధం లేకుండా సంస్థలో ఫిర్యాదుకు అవకాశం కల్పించారు.కల్తీ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అవసరం కోసం ఇష్టపడి కొనుక్కునే వస్తువుల్లో నాణ్యత లోపిస్తున్నది. నిర్ణయించిన ధర చెల్లించినప్పటికీ అనేక సందర్భాల్లో మోసానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారికి న్యాయం చేసేందుకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఏర్పాటైన కమిషన్లు బాధితులు, ప్రతివాదులకు మధ్య వర్తిత్వం చేస్తూ వివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ హక్కులపై అవగాహన పెంచుకుని, తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసుల వివరాలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1989లో వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3311 ఫిర్యాదులు రాగా, 3235 కేసులు పరిష్కరించారు. పెండింగ్ 76 ఉన్నాయి. 2019లో 107 ఫిర్యాదులు రాగా, 90 పరిష్కరించారు. 2020లో 46 ఫిర్యాదులు రాగా, 27 పరిష్కరించారు. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి.
వినియోగదారుల బాధ్యతలు, పాటించాల్సినవి
ప్రతి వినియోగదారుడు తనకు అవసరమైన, నాణ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.
తీసుకునే వస్తువు గురించి ముందే సమాచారాన్ని సేకరించాలి.
అధీకృత డీలర్ల నుంచి వస్తువు కొనుగోలు చేయాలి.
తయారీ, ముగింపు తేదీలను గమనించాలి.
మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి.
రసీదును తప్పకుండా అడిగి తీసుకోవాలి.
గ్యారంటీ /వారంటీ కార్డును షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి.
ఫిర్యాదు చేసేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
వినియోగదారులకు అండగా ఉంటాం..
వినియోగదారులు నాసిరకం వస్తువులు, మోసపూరిత వ్యాపారులపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు. ప్రతిఒక్కరూ తమకున్న హక్కుల గురించి తెలుసుకొని మోసపోకుండా జా గ్రత్త వహించాలి. సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు ఉమ్మడి మెదక్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంగారెడ్డి కార్యాలయం, 084552 95654లో సంప్రదించవచ్చు.
-శ్రీదేవి, వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు (ఎఫ్ఏసీ)ఉమ్మడి జిల్లా మెదక్
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి..
వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆ వస్తువు నాణ్యతను పరిశీలించాలి. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదును అడిగి తీసుకోవాలి. ఇది వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యా దు చేసేందుకు ఉపయోగపడుతుంది. వినియోగదారుల హక్కులపై అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సలహాలు, సూచనలకు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం 99089 48242లో సంప్రదించవచ్చు.
-డాకురి వెంకటేశం, జిల్లా వియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్, మెదక్