
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం నల్లగొండకు రానున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య పెద్దకార్యంలో పాల్గొననున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కనకదుర్గ కాలనీ వెనుక భాగంలోని పీటీఆర్ కాలనీలో ఉండే ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఇంటికి వెళ్తారు. కార్యక్రమంలో పాల్గొని గాదరి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం కేసీఆర్ కోసం అక్కడే ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రితోపాటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖులు, పార్టీ ముఖ్యులు కూడా భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు…
సీఎం కేసీఆర్ రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మంగళవారం ఎన్జీ కాలేజీ మైదానంలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ, ఆర్అండ్బీ, పోలీస్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ సమీపంలోని విద్యుత్ స్తంభాలను తొలగించి, చెట్ల కొమ్మను ట్రిమ్ చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి దేవరకొండరోడ్డులోని గాదరి కిశోర్‌కుమార్ ఇంటికి వెళ్లే రూట్‌తో పాటు పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితోనూ కలెక్టర్, ఎస్పీలు చర్చించి ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సీఎం వచ్చే రూట్లో ఇతరుల వాహనాలు రాకుండా వాటిని వేరే రూట్లోకి మళ్లించాలని నిర్ణయించారు. ఎన్జీ కళాశాల నుంచి సీఎం వచ్చే రూట్లోనూ దారి పొడవునా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండానే సీఎం పర్యటన సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారందరికీ విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు చేశారు. బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ గంజి కవిత, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, చీర్ల శ్రీనివాస్ ఆర్అండ్బీ ఈఈ నరేందర్, విద్యుత్ శాఖ డీఈ విద్యాసాగర్, తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.