రైతన్న చేతికి పెట్టుబడి అందుతోంది. మూడోరోజూ ఎకరాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో రైతాంగం నగదు విడిపించుకుంటున్నది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి కనిపిస్తుండగా, సర్కారు పంపిన పెట్టుబడి తీసుకున్న రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఆనందం వెల్లివిరుస్తోంది. సాగు ఖర్చులకు సాయం పంపిన సీఎం కేసీఆర్ తమకు కనిపించే దైవమని రైతాంగం కొనియాడుతున్నది. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల్లో 5,03,650 మంది రైతుల ఖాతాల్లో రూ.311.42 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమైంది.
రైతన్న చేతికి పెట్టుబడి అందుతున్నది. మూడు రోజులుగా ఎకరాల వారీగా 5,03,650 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.311.42కోట్లు జమ చేయగా, రైతాంగం నగదు విడిపించుకుంటున్నది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి కనిపిస్తుండగా, సర్కారు పంపిన పెట్టుబడి తీసుకున్న రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. సాగు ఖర్చులకు సాయం పంపిన సీఎం కేసీఆర్ తమకు కనిపించే దైవమని రైతాంగం కొనియాడుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటింది.
పిండి బత్తాలకు ఢోకా లేకుంట పోయింది
రైతు బంధు పైసలతో పిండి బత్తాలకు ఢోకా లేకుంట పోయింది. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రతి సారి రూ.20వేలు వస్తున్నయ్. ఇప్పటికీ 8 సార్లు పైసలు పడ్డయి. వాటితో పిండి బత్తాలు తెచ్చుకుంటున్న. వానకాలం, యాసంగి రెండు పంటలకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పైసలు వేస్తంది. వరి పంటను కేంద్రం కొంటలేదంటే గిప్పుడు సీడ్ వరి పెడుతున్నం. సీడ్ కంపెనీ వాళ్లే మా పంటను తీసుకుపోతరు. తెలంగాణ రాక ముందు ఎవుసం అంటేనే ఇబ్బందైతుండె. కేసీఆర్ సార్ వచ్చినంక రైతులకు అన్ని విధాలా సాయం అందిస్తుండు. నీళ్ల గోస లేకుండా ప్రాజెక్ట్‌లు కట్టిండు. చెరువులు, కుంటలను మంచిగ చేసిండు. వ్యవసాయం చేసే రైతులకు ఏ లోటు రాకుండా చూస్తుండు. సారు రుణపడి ఉంటం.
ఏండ్ల కాలంగా పంట పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడ్డ కర్షకుల బాధలను ‘రైతు బంధు’.. దూరం చేసింది. చేతిల పైసల్లేక సమయానికి విత్తనాలు, ఎరువులు కొనలేక.. సాగు చేయలేక దిగులుపడ్డ అన్నదాతల గోస తీర్చింది. పేద రైతులకు భరోసా నింపింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు సీజన్లకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించగా, ఆ తర్వాత నుంచి రూ.5 వేల చొప్పున ఖాతాల్లో వేస్తోంది. ఈసారి కూడా మూడు రోజులుగా రైతుల ఖాతాల్లో విడుతల వారీగా నగదు జమ చేస్తున్నది. తమ సెల్ఫోన్లకు వచ్చిన మెస్సేజ్‌లు చూసుకుని రైతులు సంబురంగా బ్యాంకులకు వెళ్లి నగదు విడిపించుకుంటున్నారు. దున్నడానికి, కూలీలకు, ఎరువులకు సరైన సమయంలో పెట్టుబడి వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం పండుగలా మారింది
మాది గంగాధర మండలం ఆచంపల్లి. గ్రామ శివారులో మాకు ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం అంటే తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పుకోవాలె. తెలంగాణ రాక ముందు మా ఊళ్లె తాగుదామంటే నీళ్లు దొరికేటివి కావు. వ్యవసాయానికి నీళ్లు లేక భూములు బీళ్లుగా వదిలేసేవాళ్లం. వ్యవసాయం చేయాలని అనుకున్నా పెట్టుబడి కష్టాలు మొదలయ్యేవి. ఏ పైసలున్న మా రాజు దగ్గరికో, షావుకారి దగ్గరికో పొయ్యి పైసలు తెచ్చుకుని విత్తనాలు, ఎరువులు కొనుకునేటోళ్లం. సాగు నీరు అందక పంటలు ఎండిపోయి పెట్టుబడి కోసం చేసిన అప్పుకూడా మీదపడేది. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మా రైతుల పెట్టుబడి కష్టాలు తీరినయి. ఎకరానికి ఐదు వేల రూపాయల సాయాన్ని మా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ మా కష్టాలు తీర్చుతున్నాడు. నా బ్యాంకు ఖాతాల 7,500 రూపాయలను సర్కారు జమ చేసింది. కేసీఆర్ సాయాన్ని ఎన్నటికీ మర్చిపోం.
బర్ల కోసం షెడ్డు కట్టిన..
మా ఊరి శివారులో ఐదెకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద ఐదుసార్లు రూ. లక్ష దాకా సాయం అందింది. వచ్చిన పైసలను బ్యాంకుల నుంచి తీయలె. ఆరు నెలం కిందట ఈ పైసలతోటి పొలం కాడనే షెడ్డు కట్టుకున్న. సొంత డబ్బులతో మూడు బర్రెలను కొనుగోలు చేసిన. ఇవి రోజుకు 10 లీటర్ల దాకా పాలిస్తున్నయ్. నేను చేన్ల కందగడ్డ, ఉల్లి, వెల్లుల్లి పండిస్తున్న. సర్కారు నుంచి వచ్చిన పైసలతోటి లాగోడి కర్సులు ఎళ్లదీసుకుంటున్న. పంటలు అమ్ముకొంగా వచ్చిన డబ్బులతో కుటుంబం గడుస్తున్నది. కొంతమొత్తం పిల్లగాండ్ల సదువులకు వెనకేసుకుంటున్న.
ఎల్లారెడ్డిపేట మండలం పెట్టుబడులు ఎల్లుతున్నయ్..
నాకు ఎకరంన్నర భూమి ఉంది. రెండేండ్ల నుంచి పెట్టుబడి సాయం తీసుకుంటున్న. పసలుకు 7,497 వస్తన్నయి. అచ్చిన పైసలు కైకిలోళ్లకుపోను మందుల కోసం ఖర్చు చేత్తన్న. ఎల్లిన లాగోడి ఇంత ఇంట్లకుంచుకొని, మిగితది అమ్మి ఇల్లుగడుపుతం. రైతుబంధు కింద వచ్చిన పైసలు పెట్టుబడి సరిపోతన్నయి. మా ఊరిల ఎక్కువమంది ఎవుసం మీదనే బతుకుతరు. కాళేశ్వరం నీళ్లు రాకముందు రైతులందరం అరిగోస వడ్డం. మా ఊరి మీది నుంచి వరదకాలువ ఉంది. ఏడాది పొడవునా నీళ్లుంటున్నయ్. ఇగ ఏ పంట జేసినా మాకు బాధలేకుంటపోయింది. పెట్టువడికి సర్కారే పైసలిత్తంది, కావలసినన్ని నీళ్లున్నయి. ఇప్పుడు ఊరంతా పచ్చని పంటపొలాలతోని కళకళలాడుతంది. మమ్ముల వెన్నంటి కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం.
కైకిళ్ల కర్సులు ఎల్తున్నయ్..
నాకు 18 గుంటల భూమి ఉన్నది. ఇంకా కొంత కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్న. ఆర్నెళ్లకోసారి రైతుబంధు కింద 2250 రూపాయలు వస్తున్నయ్. ఈ పైసలు కైకిళ్ల కర్సులు ఎల్తున్నయ్. మూడేండ్లలో 13 వేలు వచ్చినయ్.. అడగకముందే రైతులకు మంచి చేస్తున్న మనసున్న మారాజు కేసీఆర్. ఆయనను బతికినంతకాలం గుర్తుపెట్టుకుంటం.
-ఆరె రమేశ్, రైతు, వర్షకొండ, ఇబ్రహీంపట్నం మండలం.
సోలార్ కంచెకు ఆసరైతయ్..
నాకు గంభీరావుపేట శివారుల ఎకరన్నర భూమున్నది. కేసీఆర్ సారు దయతోని మళ్లా రైతుబంధు తీసుకుంటున్న. మొదాలు అచ్చినప్పటి నుంచి ఎకరం భూమి అచ్చుకట్టి, మడి మడికి పైపు లైన్లు ఏసుకుని ఇన్ని రోజులు వరి పండిచ్చిన. ఇప్పుడు యాసంగి వడ్లు కొంటలేమని కేంద్రం అంటున్నదట. అద్దెకరంల కూరగాయలు సాగు చేద్దామని అనుకుంటున్న. కానీ కోతులు, అడవి పందుల బెడద ఉంది. వాటి నుంచి కాపాడుకోడానికి సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంట. మొన్నచ్చిన. రైతు బంధు పైసలు రూ.7500లతో సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంట. కూరగాయలు పండిస్త. గిట్ల టైంకు చేతికి పైసలు అచ్చినందుకు రంది లేకుంటవోయింది.
-పిల్లి ఎల్లయ్య, రైతు, గంభీరావుపేట.
రైతుల బతుకులు మారినయ్
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక రైతుల బతుకులు మారినయ్. పెట్టుబడికి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగుకు గోదావరి జలాలు తీసుకువచ్చి చెరువులు, బావులు నింపిండ్రు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు 4 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. నాకు ఏడాదికి 40వేల రైతు బంధు పెట్టుబడి సాయం వస్తుంది. 2 ఎకరాల్లో వరి, ఎకరంలో పత్తి, ఎకరం భూమిలో మిర్చి, ఆవాలు, కంది, ఉల్లి, కూరగాయలు పండిస్తున్న. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగ ఉన్నారు.
-నాగులపెల్లి రవి రైతు రుద్రంగి.
అడ్తీదారులతో తిప్పలు తప్పినయ్
రైతు బంధు కేసీఆర్ సార్ పైసల్ పెట్టబడికి అక్కరకొస్తున్నాయి. మా ఊల్లె నాకు మూడెకరాల పొలం ఉన్నది. 2018 వానకాలం నుంచి యేడాదికి రెండు సార్లు రైతు బంధు పైసలు బ్యాంక్‌లో పడ్తున్నయ్. ఇప్పటికి రూ.57వేల దాకా వచ్చినయ్. పంటసాయం రాకముందు అడ్తీదారి దగ్గర ఎవుసం పెట్టుబడికి పైసలు తీసుకునేట్టోలం. పండిన వడ్లు షావుకారు చెప్పిన ధరకు అమ్ముకునేటోళ్లం. అప్పు కింద పావుపంట పోయేది. కేసీఆర్‌సార్ వచ్చినంక పెట్టుబడి సాయం చేస్తున్రు. ఈ పైసలు కూలీలు, ట్రాక్టర్ డీజిల్, మోటర్, ట్రాక్టర్ రిపేర్లకు పనికొస్తన్నయ్. అక్కరలుతీరుతున్నాయి. అడ్తిదారులతో తిప్పలు తప్పినయ్.
-శాయంపేట్ రైతు మడికొండ దేవేందర్‌రావు(జమ్మికుంట రూరల్)
ఎవుసం చేయాలనే ధైర్యం ఇచ్చిండు..
నా పేరు కంటె రెడ్డి. నాకు 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో చేతిల పైసలు లేక 5 ఎకరాలు సాగు చేస్తుండె. మిగిలిన 4 ఎకరాలు బీడుగా ఉండేది. పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి పంట పండినంక పైసలు కట్టేది. అచ్చిన పంట పైసలు అప్పులకే పోతుండె. సీఎం కేసీఆర్ రైతు బంధుతో రైతులను ఆదుకుంటున్నడు. నాకు ఏడాదికి 90వేల రైతు బంధు పెట్టుబడి సాయం వస్తుంది. ఇప్పుడు 9 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న. విత్తనాలకు, కూలీలకు, ట్రాక్టర్ ఖర్చులకు, ఎరువులకు నగదు పైసలు ఇచ్చి పనులు చేసుకుంటున్న. అప్పుల బాధ అస్సలే లేదు. నాడు వ్యవసాయం చేసుడంటే అప్పులు గుర్తుచేసుకొని భయపడేది. ఇప్పుడు రైతులెవరూ భయపడతలేరు. కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో వ్యవసాయం తీరు మారింది.
-కంటె రెడ్డి, రైతు రుద్రంగి
పెట్టుబడికి సరిపోతున్నయ్..
నాకు ఎకరం భూమి ఉన్నది.. ఇందులో వరితో పాటు కొంత మేర ఇతర పంటలు సాగు చేస్త. యేటా రైతుబంధు కింద రూ. 10 వేల దాకా వస్తున్నయ్.. ఈ పైసలు పంటల పెట్టుబడికి సరిపోతున్నయ్.. సావుకార్ల దగ్గర అప్పులు చేసే బాధ తప్పింది.. చెప్పిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-పెంచల పద్మ, మహిళా రైతు గోపాలపురం (ఒక ఎకరం)(కరీంనగర్ రూరల్)