చాదర్‌ఘాట్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని… అన్ని విధాల అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆజంపురాలోని పార్టీ కార్యాలయంలో ఆజంపురా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు.
నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆజం అలీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో డివిజన్‌కు చెందిన నేతలందరూ ఏకాభిప్రాయంతో కమిటీని ఎనుకున్నారు. డివిజన్ అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నాయకుడు కారింగల మారుతీ పేరును ఖరారు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ నేతలను నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆజం అలీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి పరిచయం చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైన కారింగల మారుతీకి హోంమంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల యూనియన్ నాయకుడు దానకర్ణాచారీ, లాయక్ అలీ, బాబు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.