యాదాద్రి లక్ష్మీ నరసింహుడి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం, ఆదివారం
కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పురవీధులు,
లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారిని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా దర్శించుకున్నారు. ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారని కొనియాడారు. అలాగే రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొని కానుకలు సమర్పించారు.
యాదాద్రి, జనవరి 2 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున హాజరయ్యారు. నూతన సంవత్సరంతో పాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పును దర్శించుకున్నారు. స్వామి ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 4గంటల నుంచి మొదలైంది. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి నిజాభిషేకంతో ఆరాధించారు. హారతి నివేదనతో అర్చిచండంతో పాటు, సుదర్శన హోమంతో శ్రీ వారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.23,36,027 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామి సేవలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు
యాదాద్రి, జనవరి 2 : శ్రీవారిని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా, రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయాధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇవ్వగా ఈఓ ఎన్.గీత స్వామి వారి ప్రసాదం అందించారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని కేంద్రమంత్రి సందర్శించి మహాద్భుతంగా నిర్మించారని కొనియాడారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అభివర్ణించారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తనకున్న బంగారు నగలన్నీ భక్తితో నిలువు దోపిడీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ నూతన సంవత్సరంలో తొలిసారి స్వామిని దర్శించుకున్న సందర్భంగా నిలువు దోపిడీ ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబసభ్యులు, అభిమానులు, అనుచరుల సహకారంతో స్వర్ణతాపడానికి మరింత బంగారం అందిస్తానని పేర్కొన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు మరింత శక్తిని ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. యాదాద్రి భక్తుల సందడితో కన్నుల పండువగా ఉందన్నారు. మరో రెండు నెలల్లో స్వయంభువుల దర్శనానికి యాదాద్రి క్షేత్రం సిద్ధమవడం సంతోషదాయకమన్నారు. కలలో ఊహించని విధంగా ఆలయాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఏఈఓ శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.