భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 30 : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు ఏక్‌భారత్-శ్రేష్టభారత్ పేరుతో అండర్-24 విభాగంలో షూటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామానికి చెందిన బోనాల ఇందు, భువనగిరికి చెందిన బండన్నాథం వంశీ గోల్డ్ మెడల్, ఆంధ్రప్రదేశ్‌లో అండర్-19 విభాగంలో నిర్వహించిన మొదటి సౌత్ జోన్ షూటింగ్‌బాల్ పోటీల్లో వలిగొండ మండలం గంగాపురం గ్రామానికి చెందిన దేశపాక మనోజ్‌కుమార్, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన బెల్లె సిద్ధులు ద్వితీయ స్థానం సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో గురువారం క్రీడా కారులను కలెక్టర్ అభినందించి మాట్లాడారు. కార్యక్రమంలో యువజన శాఖ అధికారి ధనుంజనేయులు, షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్ర చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోత్కూరు యాదయ్య, మానస, కొండపురం కృష్ణ పాల్గొన్నారు.
అన్విత్రెడ్డికి చెక్కు అందజేత
రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతమెక్కి తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన జిల్లాకు చెందిన పడమటి అన్వితారెడ్డికి దివీస్ ల్యాబోరేటరీస్ యాజమాన్యం సౌజన్యంతో రూ.2.50 లక్షల చెక్కును కలెక్టర్ పమేలాసత్పతి అన్వితారెడ్డికి అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్వితారెడ్డి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషకరమని కొనియాడారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ ఇన్నోవేటీవ్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, దివీస్ కంపెనీ ప్రతినిధులు బి.కిశోర్కుమార్చౌదరి, వల్లూరి వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.