
ఇల్లు దాటి బయటకు వెళ్లారా. జేబులో పైసలు లేవా, అయితే చింతించకండి..ఇప్పుడు జేబులో పైసలు లేకున్నా సరే చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. ఎక్కడైనా షాపింగ్ చేయవచ్చు. వీటికి సంబంధించి ఆన్లైన్లోనే చెల్లింపులు పూర్తిచేయవచ్చు. ఒక్క క్లిక్‌తో లావాదేవీలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. హోటల్‌కెళ్లి చాయి తాగినా, ఇస్త్రీ చేసిన ల్యాండ్రి అతనికి డబ్బులు ఇవ్వాలన్నా, కిరాణా సరుకులు, కూరగాయలు కొన్నా, మొబైల్ రీచార్జ్ చేసినా, పెట్రోల్ పోసుకున్నా.. ఇలా, అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్ వచ్చి చేరింది. కరోనా విపత్కర పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఈ పద్ధతికే మొగ్గుచూపుతున్నారు. దీంతో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి అనేక పేమెంట్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణాలతో పాటు ఇప్పుడు పల్లెల్లోనూ డిజిటల్ విధానం విస్తరిస్తుండడంతో గల్లాపెట్టె ఖాళీగా కనిపిస్తున్నా.. బ్యాంక్ అకౌంట్ మాత్రం నిండిపోతున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంగళ్లలో విక్రయించేవారు, వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు సైతం ఆన్లైన్ బాట పట్టారు.
ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు, వీధివ్యాపారులు, చాయ్ దుకాణదారులు ఇలా వందలమంది పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పేలతో పాటు మరిన్ని యాప్‌లను వినియోగిస్తున్నారు. రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడం, అకౌంట్లలో రైతుబంధు జమకావడం, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకుల్లో పొదుపులు చేయడంతో పాటు రుణాలు తీసుకోవడంతో ఈ డిజిటల్ సేవలు మరితంగా పెరుగుతున్నాయి.
కరోనా సమయంలో పెరిగిన డిజిటల్ చెల్లింపులు…
డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన కొత్తలో పెద్దపెద్ద వ్యాపారులు, ఉద్యోగులు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే, కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కరెన్సీ నోటును ముట్టుకుంటే కూడా వైరస్ సోకుతుందని ప్రచారం కావడంతో ప్రజలు ఆన్లైన్ చెల్లింపుల వైపు మొగ్గు చూపారు. దీంతో, క్రమంగా ఆన్లైన్ చెల్లింపులకు ఇటు జనం.. అటు వ్యాపారులు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం, ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్ ద్వారా చిల్లర సమస్య కూడా తీరిందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లమని, ఇప్పుడా పరిస్థితి లేదని అంటున్నారు.
చిల్లర సమస్య తీరింది..
మా కిరాణా షాపులోకి చిన్నచిన్న సామగ్రి కోసం వచ్చే జనం చిల్లర పైసలు తీసుకురాకపోవడంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు సామాన్లు కొన్న వెంటనే మా వద్ద ఉన్న స్కానర్‌ను స్కాన్‌చేసి డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో చిల్లర సమస్య తీరింది. ఇది మాలాంటి చిన్న షాపుల వాళ్లకు ఎంతో
ఉపయోగపుడుతున్నది.
నగదు ఇస్తలేరు…
హోటల్లో టీ, టిఫిన్ కోసం వచ్చిన వారు చాలామంది నగదు ఇస్తలేరు. కౌంటర్ దగ్గరికి వచ్చి ఫోన్‌తో స్కాన్ చేసి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. డిజిటల్ విధానంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా సౌకర్యంగా ఉంది.
చిల్లర తిప్పలు తప్పినవి..
మా దగ్గర 10 రకాలకంటే ఎక్కువ చాయ్‌లు ఉంటాయి. ఒక్కో చాయికి ఒక్కో ధర ఉంటుంది. చాలామంది చాయ్ తాగిన వాళ్లు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. దీంతో, మాకు కూడా చిల్లర ఇబ్బందులు తప్పుతున్నాయి. లేదంటే సరైన చిల్లర లేక ఇబ్బందులు పడేవాళ్లం. కొంతమంది మాత్రమే పైసలు ఇస్తున్నారు. చాలామంది ఫోన్ ద్వారానే పైసలు కొడుతుర్రు.
డిజిటల్ లావాదేవీలు అలవర్చుకోవాలి
ప్రజలు డిజిటల్ లావాదేవీలను అలవర్చుకోవడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు పనులు సులభంగా జరుగుతాయి. నగదు రహిత సేవలను ఉపయోగించేలా మా బ్యాంకు ఖాతాదారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్, రూపే కార్డుల ద్వారా చెల్లింపులతో డిజిటల్ ప్రక్రియను అలవార్చుకోవాలి.
ఫోన్ పే లేదా అని అడుగుతున్నారు..
బట్టలు ఇస్త్రీ చేయించుకునేందుకు వచ్చిన వాళ్లు మీకు ఫోన్‌పే లేదా అని అడుగుతున్నారు. అందువల్ల షాపులో స్కానర్‌ను పెట్టిన. ఇస్త్రీ చేయించుకున్నోళ్లంతా ఫోన్లోనే పైసలేస్తుండ్రు. రానురాను డబ్బులు కనిపిస్తయో లేదోనని అనిపిస్తున్నది. ఇది మంచి సౌలత్గానే ఉంది. కానీ, మాలాంటోళ్లకు మొదట్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు మొత్తం అర్ధమైంది.