
ఉమ్మడి జిల్లాలో నయాసాల్కా జోష్ నెలకొన్నది. యువత హోరెత్తించారు. 2021 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. కేక్ కట్ చేసి సంబురాల్లో మునిగితేలారు. మద్యం ప్రియులు విందులు చేసుకున్నారు. దీంతో బేకరీలు, మద్యం, మాంసం దుకాణాల వద్ద సందడి నెలకొన్నది.
మహబూబ్నగర్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు గతంలో ఎ ప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారు. కాలం కలిసొచ్చి పుష్కలంగా వర్షాలు కురవడంతో.. బోర్లు, బావులు, ప్రాజెక్టుల పరిధిలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. మరోవైపు రైతుబంధుతో సకాలంలో పంట పెట్టుబడి గా సీఎం కేసీఆర్ ఎకరాకు అందిస్తున్న రూ.10 వేల సాయం ఎంతో ఉపయోగపడుతున్నది. దీంతో వ్యవసాయం దండుగ అన్న దశ నుంచి పండుగ అనే స్థాయికి చేరుకున్నది. 2021 సంవత్సరం అన్నదాతలకు సంతోషాన్ని పంచింది. 2021లో రైతుబంధు, రైతుబీమాతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక ధరణితో భూరికార్డులకు భద్రత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాకు ఎంతో ప్రతిష్ఠ్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఈ ఏడాది పూర్తయ్యే అవకాశాలు ఉండటంతో రైతులకు కొత్త ఏడాది కోటి ఆశలను కల్పిస్తున్నది. పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో.. కొత్త ఏడాది సైతం ఇదే స్థాయిలో ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. మరోవైపు కేంద్రం రైతులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిన మూడు నల్ల చట్టాలను సైతం గతేడాది విజయవంతంగా తరిమికొట్టిన అన్నదాతలు దేశమంతా వ్యవసాయానికి స్వేచ్ఛను సాధించారు. కేంద్రం మెడలు వంచి కొత్త ఆశలతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టారు.
క్రమంగా సాధారణ పరిస్థితులు..
గతేడాది కరోనా మహమ్మారితో ఇబ్బంది పడినా.. పరిస్థితులు క్రమంగా మెరుగుపడి జనజీవనం సాధారణ స్థాయికి చేరుకున్నది. ఇప్పటికే దేశంలోకి ఒమిక్రాన్ వచ్చినా.. దాదాపుగా వ్యా క్సినేషన్ పూర్తి చేసుకొని పోరాటానికి సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే వ్యాక్సినేషన్, మాస్క్, శానిటైజర్ అండగా వైరస్ను తరిమికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది బాగుండాలని కోరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కో ట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కొత్త క లెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. నూతన సంవత్సరం సాధ్యమైనంత త్వరగా సీఎం కేసీఆర్ చే తుల మీదుగా కొత్త కార్యాలయాలు ప్రజలకు సే వలు అందించనున్నాయి. ఇక కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతి వచ్చిన వనపర్తి, నాగర్కర్నూల్లో ఈ ఏడాది నుంచి వైద్య విద్యకు అవకాశం లభించనున్నది. వీటితోపాటు నర్సింగ్ కళాశాలలు సైతం అందుబాటులోకి రానున్నాయి. కొత్త జోన్ల ఏర్పాటు తర్వాత జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన చేపట్టిన ప్రభుత్వం.. ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏర్పడే ఖాళీలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ మేరకు కొత్త ఏడాదిలో ఉద్యోగాల భర్తీకి కూడా అవకాశం ఉండడంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రెండేండ్లుగా కొవిడ్ కారణంగా వ్యాపారాల్లో నష్టపోయినవారు, చదువులు కోల్పోయిన విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన వారు 2022 మేలు చేస్తుందని కొత్త ఉత్సాహంతో ఉన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
నిన్నటి అనుభవాలను బేరీజు వేసుకొని, నేటి గమనాన్ని నిర్ధారించుకుంటూ భవిష్యత్ వైపు అడుగేయడంలో కాలం తిరుగులేని ప్రధాన పాత్ర వహిస్తున్నది. కాలగమనంలో నెలలు, సంవత్సరాలు గడచిపోతుంటాయి. వర్తమానం నుంచి భవితవైపు సాగుతున్న ప్రస్థానంలో వచ్చే కొత్త సంవత్సరం మైలురాయిగా నిలిచిపోవాలని ఆశిద్దాం. బహుముఖంగా సాగిపోయే ప్రగతి సాధనలో మన వంతు కర్తవ్యాన్ని స్వీకరించి, స్ఫూర్తిగా ముందడుగు వేయడమే కొత్త సంవత్సరానికి మనం ఇచ్చే అపురూప స్వాగతం. ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులందరికీ ‘నమస్తే తెలంగాణ’కొత్త ఏడాది శుభాకాంక్షలు.