ఇందూరు, డిసెంబర్ 18 : పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా ధైర్యాన్ని కోల్పోవద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో శనివా రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. జిల్లాలో 42శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల తర్వాత కొంత మంది విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోవడం గమనించామని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 18నెలలపాటు ఓవైపు ఆఫ్‌లైన్ తరగతులు లేక, మరోవైపు ఆన్లైన్ తరగతులు వినలేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఇంటర్‌బోర్డు సిలబస్‌ను 70శాతానికి కుదించి ప్రశ్నపత్రంలోనూ 50శాతం చాయిస్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో సమాధానాలు రాయలేక తక్కువ మార్కులు వచ్చాయన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వచ్చే ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు ఉంటాయన్నారు. 50 శాతం తక్కువ ఫీజుతోనే విద్యార్థులు జవాబు పత్రాలను రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ చేసుకోవచ్చన్నారు. జవాబుపత్రాల వాల్యుయేషన్‌లో ఎలాంటి పొరపాట్లు జరగవని, ప్రతి అధ్యాపకుడు జవాబుపత్రం దిద్దిన తర్వాత మరో మూడుసార్లు పరిశీలన ఉంటుందన్నారు. విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రాన తమ జీవితాలను ముగించుకోవాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇక ముందు తరగతులకు హాజరు కావాలని, మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.