సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి మరిచి సిగరెట్ ఈజ్ మై సీక్రెట్ అంటూ బాధలో, సంతోషంలో, విందులో, వినోదాల్లో, టీ తాగాక ఒకటి, భోజనం చేశాక ఒకటి, ఏం తోచట్లేదని ఒకటి అంటూ టైంపాస్కి గుటగుట నాలుగు గుటకలు మింగి ఊపిరితిత్తుల్లో పొగను నింపి ఆరోగ్యం క్షీణించాక దవాఖానలు చుట్టూ తిరుగుతున్నారు. మత్తును, ఉద్రేకాన్ని కలిగించే స్వభావం ఉన్న నికోటిన్, ఏడువేల రకాల విషతుల్యమైన క్యాన్సర్ కారకాలు గల పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. ఇప్పటికైనా యువత పొగాకు సేవనంతో కలిగే నష్టాలపై జాగరూకులై, దీని బారినపడకుండా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
డిచ్పల్లి, డిసెంబర్ 19: పొగాకు.. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వ్యసనం. దీన్ని వాడడంతో కలిగే ఉపయోగం కన్నా ఆరోగ్య సమస్యలే ఎక్కువ. ఈ సమస్యలపై దృష్టి పెట్టడానికి ప్రజలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగాకు లేదా టోబాకో సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీటి నుంచి పొగ విడుదలవుతున్నందున దీనికి ‘పొగాకు’ అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుంచి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. కొన్ని రకాల తాంబూలాల్లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. పొగాకు వ్యవసాయాధారిత పంట ఉత్పత్తి. ఇది మత్తు కలిగించే పదార్థం కూడా.
ఇదీ పొగాకు నేపథ్యం…
పొగాకు నికోటియానా అనే జాతికి చెందినది. నికోటియానా (నికోటిన్) అనే పదానికి పోర్చుగల్లోని ఫ్రెంచ్ రాయబారి జీన్ నికోట్ గౌరవార్థం పేరు పెట్టారు. 1559లో దీనిని కేథరీన్ డీ మెడిసిన్ కోర్టుకు ఔషధంగా పంపారు. మానవ ఆరోగ్యంపై పొగాకు ప్రభావాలు అప్పట్లో చాలా ఉండేవి. అది ఉపయోగించిన పద్ధతి, వినియోగించిన మొత్తం ఆధారంగా ఆరోగ్యంపై ప్రభావాలు మారుతూ ఉంటాయి. నికోటిన్ వాడేవారు 1.1 బిలియన్ల మంది వయోజన జనాభాలో 1/3 మంది ప్రజలు ధూమపానానికి అలవాటు పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది సంవత్సరానికి 5.4 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని అంచనా వేసింది.
పంట విధానం…
పొగాకును ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే సాగు చేస్తారు. కీటకాల దాడులను నివారించేందుకు విత్తనాలను చల్లని ఫ్రేముల్లో విత్తుతారు. తర్వాత పొలాల్లో నాటుతారు. పొగాకు వార్షిక పంట. ఇది సాధారణంగా పెద్ద సింగిల్-పీస్ వ్యవసాయ పరికరాల్లో పండిస్త్తారు. పంట తర్వాత పొగాకు క్యూరింగ్ కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కెరోటినాయిడ్ల నెమ్మదిగా ఆక్సీకరణ, క్షీణతను తెలియజేస్తుంది. దీనిని అనుసరించి పొగాకు ధూమపానం, చూయింగ్, స్వీపింగ్ ఇతర రకాల వినియోగాల్లో ఉంటుంది.
పొగాకుతో నష్టాలే ఎక్కువ…
పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా, అనారోగ్యానికి గురి చేస్తుంది. పొగ తాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడంతో కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. పొగాకు వినియోగంతో కలిగే నష్టాల్లో ముఖ్యమైనవి నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004లో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానంతో నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించినట్లు అంచనా. అమెరికాలోని వ్యాధి నిరోధక, నియంత్రణ కేంద్రం పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాల్లో ప్రధానమైనదిగా, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పొగ తాగే వారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుంచి 2006 వరకు సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీరి శాతం ఏడాదికి 3.4శాతం చొప్పున పెరుగుతున్నది.
చట్టాలు కచ్చితంగా అమలుకావాలి..
పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. వీటి వినియోగంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. యువతలో పొగాకు వినియోగం పెరిగింది. వారికి మరింత అవగాహన కల్పించాలి. వారి జీవితాలు నాశనం కాకుండా చూడాలి.
తీసుకోవాల్సిన చర్యలు