బన్సీలాల్‌పేట్ : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు శిభిరం నిర్వహిస్తున్నామని, శని, ఆదివారాలలో ప్రజలు తమ సమీప పోలింగ్ బూత్‌లను సందర్శించాలని బేగంపేట్ సర్కిల్ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి ముకుంద రెడ్డి, సహాయ ఈఆర్ఓ బి.దయానంద్‌లు కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్, బేగంపేట్ డివిజన్లలో నవంబర్ మాసంలో 6, 7 తేదీలు, అలాగే 27, 28 తేదీలలో ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ పోలింగ్ బూత్‌లలోని బీఎల్ఓల వద్ద ఉండే ఓటర్ లిస్ట్‌లను పరిశీలించి, ఎవరైనా ఓటరు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్లను సమర్పించాలని, ఇల్లు మారితే కొత్త ఇంటి చిరునామా ప్రకారం ఫారం సమర్పించాలని, అలాగే 18 ఏండ్లు పూర్తి అయిన వారు కొత్తగా ఓటర్‌గా ధరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
బన్సీలాల్‌పేట్ డివిజన్ పరిధిలో 60 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లను శుక్రవారం బి.దయానంద్ పరిశీలించారు. బోయిగూడలోని వెంకటేశ్వర్ స్వామి దేవాలయం వద్ద బిఎల్ఓ సత్యనారాయణ, శ్రీనివాసులు లిస్ట్‌లో ఉన్న వివరాలను ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించారు. స్థానిక బీజేపీ నాయకులు ఆనంద్ యాదవ్, ఎ.శ్రీనివాస్, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డిలు పాల్గొన్నారు.