మణికొండ : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రేహౌండ్స్ కాలనీలో మౌలికసదుపాయాల కల్పన కోసం చొరవచూపాలని కోరుతూ గురువారం ఎస్పీ రమేశ్, డీఎస్పీ రాములు, శంకరయ్యలు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను కలిసి విన్నవించారు. గత కొన్నిరోజులుగా మంచిరేవుల గ్రామ పరిధిలోని గ్రేహౌండ్స్లోని సిబ్బంది నివాస గృహాల వద్ద సీసీరోడ్లు, తాగునీటి వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పైపులైన్లు, సిబ్బంది నివాసముంటున్న సముదాయాల వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే అధికారులతో కలిసి పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామిఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పొన్న రమేశ్, వార్డు కౌన్సిలర్ నరేష్, నాగపూర్ణశ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.