పూల పండగ – పూజ్యమైన పండుగ
తెలంగాణ మట్టిలో గుభాళింపుల పారవశ్యాన్ని, కలిగించగల
పూల పండుగ మన బతుకమ్మ..
తరాలు మారినా తరుణిలు మరువని పండుగ..
పూలను తెచ్చి.. రమ్యముగా పేర్చి
పసుపును ముద్దగా చేర్చి
గౌరమ్మగా కూర్చి..
బతుకమ్మగా మార్చి
ఆడబిడ్డలంతా సందడిగా వచ్చి
కొత్త కొత్త పాటలకు రాగాలు చేర్చి
సేతి సప్పట్లతో మస్తు ముచ్చట్లతో
తీరొక్క ఆభరణాలతో
పట్టు పరికిణిలతో
అందమైన చీరెలతో ఒదిగిన
మహిళలంతా ఉయ్యాలో.. ఉయ్యాలో.. అని ఆడుతుంటే కదా పుడమి తల్లికి లాలి
పంచుకునే సద్దులో..
పెంచుకునే అనుబంధాలు..
కన్నె పిల్లలకు పావురం ఈ పండుగ
యువతలకు గావురం ఈ పండుగ
అమ్మలకు అనురాగం ఈ పండుగ
అవ్వలకు ఆప్యాయత ఈ పండుగ
కొంటె పొలగాండ్లకు ఉబలాటం ఈ పండుగ..
అంబరాన్నంటే అలంకరణలతో
రమణులు ఆడే రమణీయమైన పండుగే బతుకమ్మ..
భవిష్యత్ పై ప్రేమను పెంచే ప్రకృతి పండుగ మన బతుకమ్మ
మనసులోని బాధలను మరిచి.. మోములోని సంతోషాన్ని చేర్చి
పూలకే పూజ చేసే చూడ ముచ్చటి పండుగ ‘మన బతుకమ్మ’
రచన : అనిత తౌటం (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, చేర్యాల)
సేకరణ : నమస్తే తెలంగాణ, చేర్యాల