శేరిలింగంపల్లి : సంధ్య కన్వెన్షన్ ఏండీ సర్నాల శ్రీధర్‌రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం కమర్షియల్ కాంప్లెక్స్‌కు సంబంధించి ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు అందకున్న రాయదుర్గం పోలీసులు బెంగళూర్‌లో నిందితుడు సర్నాల శ్రీధర్‌రావును అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకువచ్చి రాజేంద్రనగర్ మేజస్ట్రేట్ ముందు హాజరుపరుచి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి బాధితుడు, మాదాపూర్ డీసీపీ యం. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…నగరానికి చెందిన రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ రాయదుర్గం పాన్మక్తాలో ఉన్న సర్నాల శ్రీధర్‌రావుకు చెందిన సంధ్య టెక్నోవన్ వాణి జ్య భవనంలో 9వ అంతస్థులో కామన్ ఏరియాతో కలుపుకొని 1185 చదరపు అడుగుల విస్తీర్ణంను కొనుగోలు చేశారు.
దీనికి సంబంధించి మొత్తం డబ్బులు రూః 60,39,500ను చెల్లించి 622/2021 జనవరిలో సేల్‌డీడ్ డాక్యుమెంట్ చేయించుకున్నారు. సర్నాల శ్రీధర్‌రావు తరపున అతని సంధ్య కన్వెన్షన్ సంస్థ ప్రతినిది పీ.సృజన్‌సేన్ స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ(ఎస్పీఏ) తీసుకుని రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ కు రిజిష్ట్రర్ చేశారు. అనంతరం ఎలాంటి కామన్ ఎమినీటీస్ కల్పించకపోగా ఎంతకీ భవన ప్రాంగణాన్ని అప్పగించలేదు.
దీంతో పాటు రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిదులను శ్రీధర్‌రావు తన కార్యాలయానికి పలిపించుకొని తన భవనం ఐటీకి అటాచ్ ఆయిందని రెండు సంవత్సరాల వరకు కార్యాలయం అప్పగించడం కుదరదని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను రిజిస్ట్రేషన్ పత్రాలు తిరిగి తనకు ఇచ్చేయాలని, రిజిస్ర్టేషన్ ఖర్చుల డబ్బులు వదిలేసుకోవాలని బెదిరించాడు.
కొద్దిరోజులకు మరో సంస్థ ఇన్క్రీడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సదరు 9వ అంతస్థులో మిగతా కార్యా లయాన్ని కొనుగోలు చేసి కామన్ ఎమినిటీస్ ప్రహారీ గోడలు, గదులు కూల్చివేశారు. దీంతో రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ డైరక్టర్ చైతన్య కృష్ణ మూర్తి రాయదుర్గం పోలీసులను అశ్రయించి తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు సంధ్య కన్వెన్షన్ ఏండీ శ్రీధర్‌రావుతో పాటు అతని అను చరుడు పీ. సృజన్‌సేన్, ఇన్క్రీడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిది ప్రవీణ్‌కుమార్‌లపై 700/ 2021 కైంనెంబర్ సెక్షన్లు 120(భి), 420, 406, 448,427,506, ఆర్‌డబ్ల్యు 34ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు బెంగళూర్‌లో ఉన్న సంధ్య కన్వెన్షన్ ఏండీ శ్రీధర్‌రావును అరెస్టు చేసి గురువారం రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరు పీ. సృజన్‌సేన్, ఇన్క్రీడబుల్ ఇండియా ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిది ప్రవీణ్‌కుమార్‌లు పరారీలో ఉన్నారు.
శ్రీధర్‌రావుపై పలు పోలీసు స్టేషన్లలో 8 కేసులు నమోదు
సంధ్య కన్వెన్షన్ ఏండీ సర్నాల శ్రీధర్‌రావు పై ఇప్పటివరకు 8 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు గతంలో శ్రీధర్‌రావుపై మరో 8 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో 3, గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో 3, నార్సింగీ పోలీస్‌స్టేషన్‌లో 1, మియాపూర్ పోలీసు స్టేషన్ లో 1 కేసులు నమోదయ్యాయి. కాగా గతంలో మరో 8 కేసుల్లో శ్రీధర్‌రావు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.