హుస్నాబాద్, డిసెంబర్ 19 : పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే తపన.. రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఎనిమిది పదుల వయసులో ఆయనను ఆమెరికా నుంచి సొంతూరికి రప్పించాయి. వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పంట చేతికొచ్చే దాకా అన్నదాతలు పడుతున్న వ్యయప్రయాసలు ఆయనను కదిలించాయి. దీంతో కుటుంబాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చి సేవ బాట పట్టాడు. ‘రైతు సేవా సమితి’ అనే సంస్థను స్థాపించి చుట్టుపక్క పల్లెల్లోని రైతులతో కలిసిపోయి సలహాలు, సూచనలు, సహాయం అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆయనే హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై జనగామ మురళీధర్‌రావు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ దిశగా ముందుకెళ్తున్నాడు. ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నాడు. అలాగే, వివిధ రంగాల్లో యువతకు, మహిళలకు శిక్షణ ఇప్పిస్తూ వారు స్వయం వృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నాడు.
అమెరికా నుంచి పుట్టి పెరిగిన ఊరుకు..
రైతు కుటుంబంలో పుట్టిన మురళీధర్‌రావు ఉద్యోగరీత్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం 1994లో తన పిల్లలను అమెరికా పంపించి వారితో పాటు ఈయన కూడా అమెరికాకు వెళ్లాడు. పిల్లలు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగాల్లో స్థిరపడగా, మురళీధర్‌రావు చిరుద్యోగం చేసుకుంటూ 2018 వరకు అమెరికాలోనే జీవనం సాగించాడు. అయితే, పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే భావనతో ఎనిమిది పదుల వయసులో కుటుంబాన్ని వదిలి స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని ఒంటరిగా జీవనం సాగిస్తూ రైతుల కుటుంబాల అభివృద్ధికి పాటుపడుతున్నాడు.
‘రైతుసేవా సమితి’ స్థాపన..
వ్యవసాయం చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని మురళీధర్ నిర్ణయించుకున్నాడు. అయితే, ఉచితంగా డబ్బు ఇస్తే వృథా అవుతుందని భావించి, అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రైతు సేవాసమితి గాంధీనగర్’ సంస్థను స్థాపించాడు. మొత్తం ఏడుగురు డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసి, తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందించాడు. మొదటి సారి 2020 సెప్టెంబర్ 15న పది మంది పాడి రైతు కుటుంబాలను ఎంపిక చేసి వారికి పాడి పశువులు కొనుగోలు చేసేందుకు రుణ సాయం అందించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో రూ. 12లక్షల వరకు విరాళాలు సేకరించి తోటపల్లి, గాంధీనగర్ గ్రామాల్లోని 33 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 50వేల చొప్పున రుణ సదుపాయం కల్పించి పాడిపశువుల కొనుగోలుకు ఆర్థిక చేయూతనందించాడు. తన స్నేహితుడైన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయించాడు. సంస్థ ద్వారా ఆర్థిక రుణం పొంది పలువురు గేదెలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం గ్రామంలో రోజుకు 400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలోనే రూ.50లక్షల వరకు మూల ధనాన్ని సేకరించి సుమారు వంద కుటుంబాలకు పాడిపశువులను అందించి, నిత్యం 2 వేల లీటర్ల పాల ఉత్పత్తి చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్షీర విప్లవ పితామహుడు ‘వర్గీస్ కురియన్’ను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నాడు మురళీధర్‌రావు.
కుట్టు శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలు..
రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లోని ఆడపిల్లలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టుశిక్షణ ఇచ్చేందుకు కుట్టు మిషన్లను కొనుగోలు చేశాడు. గాంధీనగర్, పందిల్ల గ్రామాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇప్పించాడు. వీరు మిషన్ల కొనుగోలు చేసేందుకు రూ.లక్ష ఇరవై వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే, హుస్నాబాద్‌లో మహిళా టైలరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయించి శిక్షణ పొందిన మహిళలకు నిత్యం ఉపాధి ఉండే విధంగా కృషి చేస్తున్నాడు.
త్వరలోనే కంప్యూటర్ శిక్షణ…
రైతు కుటుంబాలను క్షీర విప్లవం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే కాకుండా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న రైతు కుటుంబాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు రైతు సేవాసమితి ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అలాగే, చదువుకుంటున్న విద్యార్థులకు సైతం కంప్యూటర్‌పై సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం కూడా ఈ శిక్షణ కేంద్రం దోహదపడనున్నది.
రైతులకు తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నప్పటికీ మనస్సు మాత్రం సొంతూరి వైపే లాగేది. దీంతో ఎనిమిది పదుల వయసును సైతం లక్ష్య పెట్టకుండా పల్లెకు తిరుగు పయణమయ్యాడు. ఆరుగాలం కష్టపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్నదాతలకు అండగా నిలబడుతున్నాడు. ‘రైతుసేవా సమితి’ పేరుతో సహకార సంస్థను నెలకొల్పి చుట్టుపక్కల పల్లెల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. నిధులు సేకరించి ఆసక్తి కలిగిన, అర్హులైన రైతులకు పాడి పశువుల కొనుగోలు చేసేందుకు సంస్థ ద్వారా రుణాలను అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. అలాగే, మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి, కుట్టు మిషన్లను రుణ సదుపాయంతో ఇప్పించి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తున్నాడు. త్వరలో కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇప్పించనున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై జనగామ మురళీధర్‌రావు సేవానిరతిపై ప్రత్యేక కథనం.
రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం..
గ్రామాల్లో పాల ఉత్పత్తిని పెంచి రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే లక్ష్యంగా రైతుసేవా సమితిని ఏర్పాటు చేశాను. స్వాతంత్య్రానికి ముందే గుజరాత్లో క్షీర విప్లవానికి శ్రీకారం చుట్టి పాల ఉత్పత్తిలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలబెట్టిన వర్గీస్ కురియన్ జీవిత చరిత్రను చదివాను. ఆయనంత కాకపోయినా ఎంతో కొంత రైతులకు సహకారం అందిం చి వారిని పాల ఉత్పత్తి ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నా. గాంధీనగర్, తోటపల్లి, పందిల్ల గ్రామాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించాం. రైతులు, మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నాం. రైతు సేవా సమితిని ఈ ప్రాంతంలో అతిపెద్ద సహకార సంస్థగా రూపుదిద్దాలనే ఆశయంతో సంస్థ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాం. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది.
-జనగామ మురళీధర్‌రావు, రైతుసేవా సమితి వ్యవస్థాపకుడు (సిద్దిపేట జిల్లా)
కుట్టు శిక్షణతో ఉపాధి పొందుతున్నా..
రైతు సేవా సమితి ద్వారా కుట్టు శిక్షణ పొందాను. సంస్థ ఇచ్చిన కుట్టు మిషన్‌తో గ్రా మంలో సొంతంగా ఉపాధి పొందుతున్నా. అంతకుముందు వ్యవసాయ పనులకు వెళ్లే దాన్ని. కానీ, మురళీధర్‌రావు సారుతో పాటు మా ఊరోళ్లందరూ కలిసి పెట్టిన సంస్థ ద్వారా ఆర్థిక సహాయం పొం దాను. కుట్లు, అల్లికలు నేర్చుకున్న మహిళలు, యువతుల కోసం ప్రత్యేకంగా ఒక తయారీ దుకాణాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. చాలా సంతోషంగా ఉంది.
నెలనెలా ఆదాయం ..
కుటుంబం గడువక నా కొడుకు కుటుంబంతో సహా పనికోసం హైదరాబాద్‌కు పోయిండు. కరోనాతో తిరిగి ఇంటికి రావడంతో పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. మురళీధర్‌రావు సారు ఇచ్చిన రుణంతో పాడి బర్రెను కొన్నాం. పాలు విక్రయించడం ద్వారా ఇప్పుడు నెలనెలా ఆదాయం వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. మాలాంటి పేద రైతులను ఆదుకుంటున్న సారు ఎల్లప్పుడూ సల్లగుండాలె. ఆయన పెట్టిన సంఘం ఇంకా చాలామంది రైతులకు సహకారం అందించాలె. -మంచాల ఎల్లవ్వ, మహిళా రైతు, గాంధీనగర్
రైతు సేవా సమితి లక్ష్యాలు…