జహీరాబాద్, డిసెంబర్ 19 : ప్రకృతి ఎరువులతో కూరగాయలు, చెరకు, కంది పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. మార్కెట్లో ధర ఉన్న కూరగాయలు, అంతరు పంటలు సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఆవుమూత్రం, బెల్లం, కానుగ, వేప, ఆముదం నూనెతో ఎరువులు తయారుచేసి పంటలకు పిచికారీ చేస్తున్నారు. రాత్రి సమయంలో కూరగాయలపై పురుగులు సోకకుండా పొలం మధ్యలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, దీపాల కింద నీటితో ఉన్న గంపను ఏర్పాటు చేశారు. కూరగాయలు తినేందుకు వచ్చిన పురుగులు నీటిలో పడి మృతిచెందుతాయి. దీంతో పంట నష్టాన్ని నివారించవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన రైతు నడిమింటి మల్లేశం ప్రకృతి సేద్యంతో కూరగాయలు, ఇతర పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువులు లేకుం డా పలురకాల కూరగాయలు, ఆకు కూరలు పండిస్తున్నారు. రైతు మల్లేశం చేస్తున్న ప్రకృతి సేద్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌లోని గాంధీ గ్లోబల్ ఫ్యా మిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ వారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న ‘పుడమి పుత్ర పురస్కారం’ ప్రదానం చేస్తున్నారు. వనపర్తిలో అవార్డు ప్రదానం చేస్తామని ప్రకటించారు.
మార్కెట్లో ధర ఉన్న పంటల సాగు…
మార్కెట్లో ధర ఉన్న పంటలు సాగుచేస్తున్నారు. ప్రతి సీజన్లో కొత్త పంటలు పండిస్తున్నా రు. పశువుల ఎరువులు వేసి పంటలు పండిస్తారు. కాశీంపూర్‌లో రైతు మల్లేశ్‌కు ఎనిమిదెకరాల భూమి ఉంది. చెరకుతోపాటు కంది, ఇతర పం టలు సాగుచేస్తున్నారు. కూరగాయలు, జొన్న, శనగ, పెసరు, మినుములు, ఆసంద, యవ్వలు, ఆవాలు, జామ, సీతాఫల్, చింత, చెర్రీ సాగుచేస్తున్నారు. నాలుగేండ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. కేవీకే శాస్త్రవేత్తల సహకారంతో ప్రకృతి వ్యవసాయ చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
హైదరాబాద్‌లో కూరగాయల విక్రయం..
కాశీంపూర్‌లో ప్రకృతి సేద్యంతో పండిస్తున్న కూరగాయలను హైదరాబాద్‌లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. జహీరాబాద్‌లో ఉన్న డీడీఎస్ సంస్థ సైతం కూరగాయలు కొనుగోలు చేస్తున్నదని రైతు మల్లేశం తెలిపారు. ప్రకృతి సేద్యంతో అధిక లాభాలు లేకపోయిన నష్టం ఉండదన్నారు. పొలం వద్దనే కూరగాయలు కొనుగోలు చేసి తీసుకుపోతున్నట్లు తెలిపారు.
పొలం వద్దనే ఎరువుల తయారీ
ప్రతిరోజూ పొ లం వద్దనే ప్రకృతి లో లభించే ఆకులు, మట్టితో ఎరువులు తయారు చేస్తు న్నాం. బెల్లం, ఆవు మూత్రం, చెట్ల ఆకు లు, వేప, కానుగ, ఆముదం నూనెతో రసాయనాలు తయారు చేసి పంటలకు పిచికారీ చేయిస్తున్నా. పురుగుల నివారణకు రాత్రి వేళల్లో పొలంలో కరెంట్ దీపాలు పెట్టి నివారిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు నష్టం ఉండదు. మార్కెట్లో ధర ఉన్న కూరగాయలు, ఇతర పంటలు సాగుచేస్తున్నా. పొలం వద్దకే వచ్చి కూరగాయలు కొం టున్నారు. ప్రకృతి సేద్యం వ్యవసాయానికి గుర్తించి ‘పుడమిపుత్ర’ పురస్కారం అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉంది.
-నడిమింటి మల్లేశం, రైతు, కాశీంపూర్ (సంగారెడ్డి జిల్లా)
రసాయన మందులు లేకుండా కూరగాయల సాగు
భర్తతో కలిసి వ్యవసాయ భూమి లో ప్రకృతి సేద్యం చేస్తున్నాం. ఎలాం టి రసాయన ఎరువులు వినియోగించకుండా కూరగాయ లు పండిస్తున్నాం. పొలం వద్ద లభించే ఆకు లు, మట్టితో ఎరువులు తయారు చేసి కూరగాయలు, పంటలపై పిచికారీ చేస్తున్నాం. అధిక లాభాలు లేకపోయినా నష్టాలు మా త్రం రావడం లేదు. పది రకాల పంటలు సాగుచేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని గుర్తించి రాష్ట్రస్థాయిలో అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది.
-చిన్నమ్మ, రైతు, కాశీంపూర్(సంగారెడ్డి జిల్లా)
ప్రకృతి ఎరువులను వినియోగిస్తూ ఆదర్శ సేద్యం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన రైతు నడిమింటి మల్లేశం, చిన్నమ్మ దంపతులు. మార్కెట్లో ధర ఉన్న పంటలను సాగు చేస్తూ విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా జీవామృతం ద్వారా తయారు చేసిన ఎరువులను వినియోగిస్తూ పంటలు పండిస్తుండడంతో వారి పొలం వద్దకు వినియోగదారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. వీరు చేస్తున్న ప్రకృతి సేద్యానికి హైదరాబాద్‌లోని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ వారు ఈనెల 22న పుడమి పుత్ర అవార్డును ప్రదానం చేయనున్నారు.