రంగారెడ్డి జిల్లాలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్
ఇప్పటివరకు 25.30లక్షల మందికి ఫస్ట్ డోస్.. 21 లక్షల మందికి పైగా రెండు డోస్‌లూ…
పెండింగ్‌లో 3 లక్షల రెండో డోసులు
ఇంటింటికీ వెళ్లి అవగాహన.. టీకా పంపిణీ
వచ్చే నెల 15లోగా పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు
రంగారెడ్డి, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ) : కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను రంగారెడ్డి జిల్లా అధికారులు మరింత వేగవంతం చేశారు. మంత్రి సబితారెడ్డి ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై త్వరితగతిన టీకా పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ లక్ష్యానికి మించి పూర్తికాగా, సెకండ్ డోస్‌పై అధికారులు దృష్టి సారించారు. ఎక్కువశాతం రెండో డోస్ పెండింగ్ ఉన్న గ్రామాలను గుర్తించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు టీకా పంపిణీ చేపడుతున్నారు. ఉన్నతాధికారులు నిత్యం గ్రామాల్లో తనిఖీలు చేస్తూ వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 25.30 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 21 లక్షల మందికి పైగా రెండో డోస్ కూడా తీసుకున్నారు. అంటే సుమారుగా 3లక్షల మంది ఇంకా రెండో డోస్ టీకా తీసుకోవాల్సి ఉన్నది. వీరందరికీ టీకా ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న పరిస్థితుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీంతో మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ లక్ష్యానికి మించి పూర్తికాగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తక్కువ శాతం నమోదైన సంబంధిత ప్రాంతాలపై ప్రత్యేక నజర్ పెట్టడంతోపాటు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. జిల్లాలోని కొందుర్గు, చౌదరిగూడెం, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్లో వెనుకబడి ఉన్నది. సంబంధిత మండలాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫస్ట్, సెకండ్ డోస్‌పై వివరాలను సేకరించడంతోపాటు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ అమయ్‌కుమార్ మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
పెండింగ్‌లో 3 లక్షల డోసులు…
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇప్పటివరకు 113 శాతం మేర ఫస్ట్ డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 46 లక్షల డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. వీటిలో ఫస్ట్ డోస్‌కు సంబంధించి అర్హులైన వారు 25.30 లక్షల డోసులుండగా, సెకండ్ డోస్‌కు సంబంధించి 21 లక్షలకుపైగా డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి, అధికంగా శేరిలింగంపల్లి మండలంలో 90,037 డోసులు పెండింగ్‌లో ఉండగా, సరూర్‌నగర్ మండలంలో 75,993, రాజేంద్రనగర్‌లో 35,763, గండిపేట్‌లో 17,447, శంషాబాద్‌లో 9121, తలకొండపల్లిలో 892, కడ్తాల్‌లో 1234, ఆమన్‌గల్‌లో 2539, మహేశ్వరంలో 5655, కందుకూరులో 5970, బాలాపూర్‌లో 6756, మాడ్గులలో 417, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2849, యాచారంలో 1555, మంచాలలో 3076, ఇబ్రహీంపట్నంలో 3477, కేశంపేట్‌లో 1835, కొందుర్గులో 5088, కొత్తూరులో 5 వేలు, నందిగామలో 3 వేలు, ఫారూఖ్‌నగర్‌లో 14వేలు, మొయినాబాద్‌లో 4630, శంకర్‌పల్లిలో 5100, షాబాద్‌లో 4 వేలు, చేవెళ్లలో 4900 డోసులు ఇప్పటివరకు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో పదిహేను రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన దృష్ట్యా జిల్లా అంతటా ప్రతి కాలనీ, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యబృందాలు వ్యాక్సిన్ వేస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ మొబైల్ వాహనాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 28 మొబైల్ వాహనాల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సినేషన్‌పై ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకొని వారు వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టారు.
ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం
సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నది, ఈనెలాఖరులోగా వంద శాతం పూర్తి చేస్తాం. జిల్లాలో ఎక్కడైతే వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉందో సంబంధిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందకుండా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడంతోపాటు భౌతికదూరం విధిగా పాటించాలి.
-స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో