e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్ కార్మిక క్షేత్రంలో పారిశ్రామిక ప్రగతి

కార్మిక క్షేత్రంలో పారిశ్రామిక ప్రగతి

  • ఇండస్ట్రియల్‌ హబ్‌గా రాజన్నసిరిసిల్ల జిల్లా
  • టీఎస్‌ఐ పాస్‌తో 752 కుటీర పరిశ్రమలు
  • వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు
  • పవర్‌లూంల ఆధునికీకరణతో భారీగా వస్ర్తోత్పత్తి
  • సంక్షేమ పథకాలతో ఆనందంలో నేత కార్మికులు
  • అభివృద్ధి బాట.. ఉపాధికి భరోసా

చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల.. సర్కారు ప్రోద్బలంతో పరిశ్రమలకు కేంద్ర బిందువులా మారింది. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం రెండువేల కోట్ల రూపాయల విలువైన వస్ర్తోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం అండగా నిలిచింది. మరమగ్గాలను ఆధునీకరించి బ్రాండెడ్‌ వస్ర్తాల తయారీకి శ్రీకారం చుట్టింది. టీఎస్‌ ఐపాస్‌ను అందిపుచ్చుకొని రూ.1157 కోట్లను వెచ్చించి 752 కుటీర పరిశ్రమలను నెలకొల్పి సుమారు వెయ్యిమందికి ఉపాధి కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటుండగా, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ప్రతి కార్మికుడికీ చేతినిండా పని దొరుకుతున్నది.

రాజన్నసిరిసిల్ల, డిసెంబర్‌ 2 (నమస్తే తెలంగాణ) : నాడు సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల మరమగ్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఊపిరిలూదింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమాత్యుడు కేటీఆర్‌ చొరవతో నేత కార్మికులకు బతుకమ్మ చీరెలు, స్కూల్‌ యూనిఫాంల తయారీ బాధ్యతలు అప్పగించి ఆర్థిక చేయూతనందించింది. సర్కారు ఇచ్చిన భరోసాతో ముంబై, షోలాపూర్‌, గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలసవెళ్లిన కార్మికులు వాపస్‌ వచ్చారు. చేతినిండా పనిదొరకడంతో రందిలేకుండా బతుకులు వెళ్లదీస్తున్నారు. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ అండ్‌ సెల్ప్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా జిల్లాలో 752 పైచిలుకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీఫాంలు, రైసుమిల్లులు, సిమెంట్‌ ఇటుకల తయారీ మొదలు గ్రానైట్‌ వరకు ఫ్యాక్టరీలను నెలకొల్పారు.

- Advertisement -

350 కోట్లతో వర్కర్‌టూ ఓనర్‌ స్కీం

నేత కార్మికులను యజమానిగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం వర్క్‌టూ ఓనర్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకు రూ.350 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద సిరిసిల్లలో షెడ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. వస్త్ర పరిశ్రమలో పురుషులకు దీటుగా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అప్పారెల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నది. అందులో 15 వేల మంది మహిళలకు పనికల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2500ల మందికి ఉపాధి కల్పించే రెండు బ్రాండెడ్‌ గార్మెంట్‌ పరిశ్రమలు జిల్లాకు వచ్చాయి. వాటి షెడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే కొత్త సంవత్సరంలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు

జిల్లావ్యాప్తంగా పంట ఉత్పత్తులు పెరుగడంతో వీటిపై ఆధారపడి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ముస్తాబాద్‌ మండలం గూడెం, గంభీరావుపేట మండలం నర్మాలలో వీటిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. నిధులు సైతం కేటాయించింది. వీటి ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు ఉపాధి లభించనున్నది.

యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా..

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నది. జిల్లాలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ. 1.157 కోట్లతో 20 రకాల 752 చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే వెయ్యిమంది ఉపాధి లభిస్తుంది. ఎస్సారార్‌ జలాశయం నిర్మాణంతో జిల్లాలో సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యం దిగుబడులు పెరుగడంతో పెద్ద సంఖ్యలో రైసుమిల్లులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలకు చెందిన కూలీలు వందల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయంతో పాటు అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కలిగింది. పరిశ్రమలను జిల్లాకు రప్పించి వేల సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. ఇప్పటికే 14 రకాల పరిశ్రమలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఏర్పాటయ్యాయి. అందులో పౌల్ట్రీ ఫాంలు 130, ఫారాబాయిల్డ్‌ రైసుమిల్లులు 18, రా రైసుమిల్లులు 27 పౌల్ట్రీ ఫీడ్‌ మిక్సింగ్‌ యూనిట్లు 24, వెల్డింగ్‌ షాపులు 402, సిమెంట్‌ బ్రిక్స్‌యూనిట్లు 20, రెడిమిక్స్‌ ప్లాంట్లు 8,కాటన్‌ ఇండస్ట్రీలు (జిన్నింగ్‌ యూనిట్లు) 18,సైజింగ్‌లు 10, గార్మెంట్‌ యూనిట్లు 50, స్పిన్నింగ్‌ యూనిట్లు 5, స్టోన్‌ క్రషర్లు 10, సోలార్‌ ప్లాంట్లు 10, గ్రానైట్‌ పరిశ్రమలు 10, సామిల్లులు 10లు ఏర్పాటయ్యాయి. ఇంకా అనేక కుటీర పరిశ్రమల ఏర్పాటు దిశగా సర్కారు ముందుకెళ్తున్నది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement