
పూర్వం రాజవంశీయులు పరిపాలించిన మండల కేంద్రమైన రాజాపేట చుట్టూ ఎత్తైన గోడలు, నలుదిక్కులా బురుజులు, దర్వాజలు దర్శనమిస్తాయి. అలాంటి గ్రామ పంచాయతీ పల్లె ప్రగతిలోభాగంగా చేపట్టిన పనులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఆదర్శ గ్రామ పంచాయతీ దిశగా అడుగులు వేస్తున్నది.
5,300 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో చక్కటి, అతి సుందరమైన వీధులున్నాయి. ప్రభుత్వ నిధులతో వీధి వీధినా సీసీ రోడ్లతోపాటు మురుగు కాల్వలను నిర్మించారు. ప్రతి వీధిని గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయిస్తూ పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహిస్తున్నారు. ఇండ్లల్లోని చెత్తను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ దోమల నివారణకు మందులు పిచికారీ చేస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ. 2లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.1.40 లక్షలతో గ్రామ నర్సరీ, రూ.38 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.84 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు, రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా 9 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం
గ్రామ పంచాయతీ ఆదాయం, ప్రభుత్వ నిధులను పూర్తిగా గ్రామాభివృద్ధికే వెచ్చిచిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి హరిత వనాన్ని తలపిస్తున్నాయి. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
పల్లె ప్రగతి పనులు పూర్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామం అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పనకు పాలక వర్గం నిరంతరం కృషి చేస్తున్నది. మున్ముందు మరింత అభివృద్ధికి గ్రామస్తులమంతా సహకరిస్తాం.
-రేగు సిద్ధులు, గ్రామస్తుడు
ప్రతి వారం సంత…
గ్రామంలో ప్రతి గురువారం సంత నిర్వహిస్తున్నారు. తై బజార్‌కు వేలం నిర్వహించి వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వెచ్చిచిస్తున్నారు. సంతకు వచ్చే వారికి మంచినీటి వసతితోపాటు మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు.
కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలు..
గ్రామంలో ప్రతి కూడలి వద్ద మహాత్మాగాంధీ, అంబేద్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, సుభాశ్‌చంద్రబోస్, వివేకానంద విగ్రహాలను నెలకొల్పారు. వీధుల్లోని కూడళ్లను జాతీయ నాయకుల పేర్లతో పిలుస్తారు.