
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3నుంచి 10 వరకు రైతు బంధు సంబురాలు జరుగనున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వారం రోజుల పాటు సంబురాలు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
పండుగలా వ్యవసాయం..
సమైక్య పాలకుల చిన్నచూపు కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. వ్యవసాయం అంటేనే రైతులు వెనుకాడే పరిస్థితిలో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలు సాగును పండుగలా మార్చాయి. ప్రపంచమే ఆశ్చర్యపడేలా తెలంగాణ వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కింది. మిషన్ కాకతీయతో చెరువులను ఆధునీకరించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. ఏటా రెండు పంటలకు అదునుకు పదును అందుతున్నది. 24 గంటలు నిరంతర విద్యుత్, పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే అవసరం లేకుండా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంతో వ్యవసాయం దశ, దిశ మారిపోయింది. 2018లో ప్రారంభమైన రైతు బంధు పథకం వేనోళ్లా ప్రశంసలు పొందింది. వానకాలం సీజన్లో మొదలైన ఈ పథకం ద్వారా ఏటా ఎకరానికి 8వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. 2019వానకాలం సీజన్ నుంచి సాయం పదివేలకు పెరిగింది. తాజాగా 8వ విడుత రైతు బంధు నగదు సాయం అందుతుండగా ఈ నెల 10 నాటికి రూ.50వేల కోట్లకు చేరనున్నది. 8వ విడుతలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10.6లక్షల మంది రైతులకు సుమారు రూ.1,233.19 కోట్లు జమ చేయనున్నారు.
నేటి నుంచే సంబురాలు…
రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సంబురాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొవిడ్ నిబంధనలకు లోబడి రైతులు, మహిళలు, యువకులను కలుపుకొని గ్రామ గ్రామాన వినూత్న రీతిలో సంబురాలు జరుపుకోవాలని సూచించారు. సంక్రాంతి పండుగ ముగ్గుల్లోనూ రైతుబంధు ప్రతిబింబించాలని చెప్పారు. ఈనెల 10న రైతు
వేదికల వద్ద పండుగ వాతావరణంలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. రైతు బంధు, రైతు బీమా సహా వ్యవసాయం, రైతు సంక్షేమ పథకాలపై కరపత్రాలతో ప్రచారం
చేయనున్నారు.