జహీరాబాద్, డిసెంబర్ 15 : ఈ యాసంగిలో రైతుల వరి ప్రత్యామ్నాయంగా శనగ, కంది పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో పురుగుల మందులు వాడకంతో పంటపై కలిగే దుష్ప్రభావాలు, వాటిని ఎలా గుర్తించాలి, నివారణ చర్యలు , రసాయన మందుల్లో మిశ్రమంగా కలిపి వాడటంతో కలిగే నష్టాలు, పురుగుల మందుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి పలు సూచనలు చేశారు. పురుగు, తెగులు, కలుపు మందులను సిఫారసు చేసిన మోతాదుకు మించిగానీ, కలుప కూడని మందులు కలిపి మొక్కలపై పిచికారీ చేసినప్పుడే పంటలకు నష్టం వాటిళ్లుతుందన్నారు. కొన్ని సార్లు రైతులు ఎక్కువ మందులు కలిపి పిచికారీ చేస్తే పంటకు నష్టం జరుగొచ్చన్నారు. ఈ దుష్ప్రభావాలు మొక్కల పై వివిధ రకాలుగా కనిపిస్తాయని ఆయన తెలిపారు.
అధిక రసాయన మందులతో ఆకులు మాడటం..
కొన్ని మందులు మొక్కలపై పిచికారీ చేసిన తర్వాత ఆకుల అంచులు మాడతాయి. కొన్నిసార్లు ఆకులపై మచ్చలు ఏర్పడడం లేదా ఆకు అంతా మాడిపోతుంది. ఒక్కోసారి మొక్కల పెరుగుల ఆగిపోతుంది. మొక్కల కణజాలం ఎండిపోతుంది. దీంతో ఆకులపై తుప్పు రంగులో మచ్చలు ఏర్పడుతాయి.
ఆకులు పసుపు రంగుగా మారడం..
ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడడం లేదా ఆకుల చివర్ల ఎండడం గాని జరుగుతుంది. కొన్నిసార్లు ఆకు అంతా పండిపోతుంది. ఆకులపై బొబ్బలు రావడం లేదా ఆకులు పడవలా ముడుచుకుపోవడం గమనించవచ్చు. పెరుగుదల లోపిం చి మొక్కలు ఎండిపోవడం కనిపిస్తుంది. పిచికారీ మందులను మోతాదుకు మించిగానీ, మిశ్రమ మందులు పిచికారీ చేసినప్పుడు ఈ లక్షణాలు లేత ఆకులపై కనిపిస్తాయి.
నివారణ చర్యలు..
మొక్కలు తీవ్ర ఒత్తిడితో ఉన్నప్పుడు (అత్యధిక లేదా అతిస్వల్ప ఉష్ణాగ్రతలు ఉండే వాతావరణం) పురుగుమందులు పిచికారీ చేయరాదు. నీటి ఎద్దడి సమయంలో మందులు పిచికారీ చేయరాదు. ద్రవరూప మందుల పిచికారీ కంటే నీటిలో కరిగే పొడిమందుల పిచికారీ సురక్షితం.పొడిమందు ట్యాంకు అడుగున పేరుకుపోకుండా తరుచూ కలిపే అవకాశం ఉండే స్ప్రే యర్లను వినియోగించాలి. పొడి, ద్రవరూప పురుగు మందులు కలిపి వాడరాదు. ఒకే రూపంలో ఉన్న వాటిని మాత్రమే కలిపి వాడాలి. 2,3 రకాల పురుగు మందులను కలిపి పిచికారీ చేయరాదు. ఒకటి కంటే ఎక్కువ మందులు పిచికారీ చేయాల్సి వస్తే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సిఫారసు మేరకు మందులు వినియోగించుకోవాలి. పురుగు, తెగుళ్ల నివారణకు ఒకేసారి మందులు వాడాల్సివస్తే, ముందుగా వాటిని కలిపి కొన్ని మొక్కలపై పిచికారీ చేసి పరిశీలించాలి. పంటకు నష్టం లేకపోతే 18 నుంచి 72 గంటల్లో బయటపడతాయి. క్రిమిసంహారక మందులతో ఎరువులను కలిపి పిచికారీ చేయరాదు. కలుపు మందు పిచికారీకి ఉపయోగించే స్ప్రేయర్‌ను పురుగు, తెగులు మందుల పిచికారీకి వాడితే పంటకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
రసాయన మందుల పిచికారీ పై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకొని రసాయన మందులు పిచికారీ చేయాలి. అధిక మోతాదులో రసాయన మందులు వాడితే పంటలకు నష్టం జరుగుతుంది. పురుగుల నివారణకు వ్యవసాయాధికారుల సూచనలతో రసాయన ఎరువులు వాడాలి. రసాయన మందులు వినియోగించే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
-భిక్షపతి, ఏడీఏ జహీరాబాద్
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు